- మైసూరవారిపల్లి స్కూలుకు ఆటస్థలం
- మాట నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్
- రూ.60 లక్షల ట్రస్ట్ నిధులతో కొనుగోలు
- పంచాయతీ పేరిటే స్థలం రిజిస్ట్రేషన్
అమరావతి (చైతన్య రథం): ‘బలమైన శరీరం ఉంటేనే.. బుద్ధి బలంగా ఉంటుంది. అప్పుడే.. మెరికల్లాంటి భావితరాలు తయారవుతాయి. ఏ దేశానికైనా అదే నిజమైన సంపద. అయితే మెరికల్లాంటి భావితరాలను తయారు చేయడానికి అవసరమైన ఆట స్థలాలు పాఠశాలలకు అందుబాటులో లేవు. మైసూరవారిపల్లి గ్రామసభకు వెళ్లిన సందర్భంలో అక్కడి స్కూలు పిల్లల తల్లిదండ్రులు ఆ విషయాన్నే నా దృష్టికి తెచ్చారు. దసరాలోపు ఆటస్థలం ఏర్పాటు చేస్తామని మాటిచ్చాను. ఇచ్చిన మాటమేరకు సొంత ట్రస్ట్ నుంచి రూ.60 లక్షలు వెచ్చించి ప్రభుత్వ స్కూలుకు ఆటస్థలం కొనిచ్చాను’ అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడిరచారు. మైసూరవారిపల్లిలో మొదలుపెట్టిన ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా తీసుకువెళ్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆట స్థలాలులేని పాఠశాలల గుర్తింపు ప్రక్రియ ప్రారంభించి ప్రతి పాఠశాలలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసే ప్రక్రియకు సీఎం చంద్రబాబు నాయకత్వంలో ముందుకు తీసుకెళ్తామన్నారు. బుధవారం రాత్రి మంగళగిరిలోని డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రైల్వేకోడూరు నియోజకవర్గం మైసూరవారిపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేసిన భూమిని అన్నమయ్య జిల్లా కలెక్టర్, రాజంపేట సబ్‌కలెక్టర్ సమక్షంలో గ్రామ పంచాయతీకి అందజేశారు.
పవన్ కళ్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ ట్రస్ట్ నుంచి రూ.60 లక్షలు వెచ్చించి పాఠశాలకు సమీపంలో ఎకరం స్థలాన్ని కొనుగోలు చేశారు. ఈ స్థలాన్ని మైసూరవారిపల్లి గ్రామ పంచాయతీ పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ సందర్భంగా పవన్‌కళ్యాణ్ మాట్లాడుతూ ‘‘రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు గ్రామసభలు నిర్వహించిన సందర్భంగా మైసూరవారిపల్లి గ్రామసభలో స్వయంగా పాల్గొన్నాను. సభలో ప్రభుత్వ పాఠశాలకు ఆటస్థలం లేదంటూ విద్యార్ధుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నా దృష్టికి తెచ్చారు. మైసూరవారిపల్లికి సెంటు ప్రభుత్వ భూమి కూడా లేదు. ఆటస్థలం ఇచ్చేందుకు ఊళ్లోవాళ్లూ ముందుకు రాలేదు. రాజకీయాల్లోకి రాకముందే ఏర్పాటు చేసిన ట్రస్ట్ నుంచి రూ.20 లక్షలు కేటాయిస్తూ.. మిగిలిన మొత్తం దాతల సహకారం తీసుకోమన్నాం. రెండు రోజుల క్రితం కార్యాలయం అధికారులు కలిసి ఆటస్థలం విషయంలో ముందుకు వెళ్లలేకపోతున్న విషయాన్ని చెప్పారు. దసరాలోపు అని మాటిచ్చాను కనుక.. రూ.60 లక్షలు సొంత ట్రస్టు నుంచే ఇస్తూ.. పగడాల పద్మావతినుంచి భూమిని కొనుగోలు చేశాము. ఆమె కూడా పెద్దమనసుతో పిల్లల కోసం భూమి విక్రయించేందుకు ముందుకు రావడంతో పాఠశాలకు ఆటస్థలం సమకూర్చగలిగాము’ అని పవన్ వివరించారు.
స్థల విక్రేతలకు సత్కారం.. విద్యార్ధులకు క్రీడా పరికరాలు
భూమి విక్రయించిన పద్మావతిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సత్కరించారు. పాఠశాల విద్యార్ధులకు క్రికెట్ కిట్లు, వాలీబాల్, ఫుట్‌బాల్, చెస్ బోర్డు తదితర క్రీడా పరికరాలు రెండుసెట్లు బహూకరించారు. విద్యార్ధులు, స్థల విక్రేతలతోపాటు ఆటస్థలం ఏర్పాటుకు సహకరించిన పార్టీ నాయకులు, అధికారులను అభినందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి, మైసూరవారిపల్లి సర్పంచ్ కారుమంచి సంయుక్త తదితరులు పాల్గొన్నారు.