30వ తేదీన తిరిగి ప్రారంభఉండవల్లి లోని నివాసానికి చేరుకున్న లోకేష్
వచ్చీరాగానే మహానాడు ఏర్పాట్లపై సమీక్ష
నేడు రాజమహేంద్రవరం వెళ్లనున్న లోకేష్
……
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జరుపుతున్న యువగళం పాదయాత్ర గురువారంతో 110 రోజులు పూర్తి చేసుకున్నది. ఈనెల 27, 28 వ తేదీలలో రాజమహేంద్రవరంలో తెలుగుదేశం పార్టీ మహానాడు జరుగనున్న సందర్భంగా యువగళం పాదయాత్రకు నాలుగురోజుల పాటు తాత్కాలిక విరామం ప్రకటించారు. ఈనెల 26,27,28,29 తేదీలలో పాదయాత్రకు విరామం ఇచ్చారు. తిరిగి యువగళం 111 వ రోజు పాదయాత్ర ఈనెల 30 వ తేదీన జమ్మలమడుగు బైపాస్ రోడ్డు క్యాంప్ సైట్ నుంచి ప్రారంభం అవుతుంది.
లోకేష్ గురువారం 12.3 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేసి వివిధ వర్గాల ప్రజలను కలుసుకొని వారి సమస్యలను తెలుసుకున్నారు. దీంతో 110 రోజులలో గురువారం నాటికి 1423.7 కిలోమీటర్ల దూరం పాదయాత్ర నిర్వహించారు. పాదయాత్ర పూర్తి చేసుకున్న అనంతరం గురువారం సాయంత్రం లోకేష్ ఉండవల్లి లోని తన నివాసానికి చేరుకున్నారు. నిర్విరామంగా పాదయాత్ర చేస్తున్న లోకేష్ స్వగృహానికి తిరిగివచ్చిన వెంటనే విశ్రాంతి తీసుకోకుండా వెంటనే మహానాడు ఏర్పాటు కమిటీలతో సమావేశమై సమీక్ష జరిపారు. మహానాడు వేదిక అయిన రాజమహేంద్రవరంకు 26 వ తేదీన బయలుదేరి వెళ్లనున్నారు.