- ముందుగానే ఖాతాల్లోకి మూడు సిలెండర్ల నగదు
- మూడుసార్లు పదవుల్లోవున్న మండల పార్టీ అధ్యక్షుల మార్పు
- కూటమి నేతలతో 16, 17, 18 తేదీల్లో తిరంగ ర్యాలీలు
- ప్రతినెలా సంక్షేమం అందేలా ‘ఏడాది క్యాలెండర్’
- మే నెలాఖరుకు అన్ని సంస్థాగత ఎన్నికలు పూర్తి
- 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా ముందుకి..
- మహానాడునుంచి ‘మై టీడీపీ’ యాప్ అందుబాటులోకి..
- ఏడాదిలో అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు..
- పొలిట్ బ్యూరో నిర్ణయాలు వెల్లడిరచిన మంత్రి అచ్చెన్న
- అదిరిపోయేలా కడప మహానాడు: రాష్ట్ర అధ్యక్షుడు పల్లా
- సీమకు ఉజ్వల భవిష్యత్ చూపనున్న మహానాడు: కాల్వ
అమరావతి: తెలుగుదేశం పార్టీలో ఒకే పదవిలో మూడుసార్లుకంటే ఎక్కువ ఉండరాదన్న పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రతిపాదనపై పొలిట్ బ్యూరోలో నిర్ణయం తీసుకున్నారు. మూడు పర్యాయాలు.. ఆరేళ్లుగాఉన్న మండల పార్టీ అధ్యక్షుల్ని మార్చాలని నిర్ణయించారు. మూడుసార్లు మండల పార్టీ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించిన వారికి పైస్థాయి పదవి లేదా ఇతర సమాంతర పదవి ఇవ్వాలని నిర్ణయించారు. తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. అనంతరం పొలిట్ బ్యూరో తీసుకున్న కీలక నిర్ణయాలను మంత్రి అచ్చెన్నాయుడు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు మీడియాకు వెల్లడిరచారు. ప్రజలకు ప్రతి నెలా సంక్షేమం అందేలా ఏడాది క్యాలెండర్ రూపకల్పనకు పొలిట్ బ్యూరో నిర్ణయించిందని మంత్రి అచ్చెన్న వెల్లడిరచారు. అలాగే, ఏడాదిలో మూడు సిలిండర్ల నగదును లబ్దిదారులకు ఒకేసారి చెల్లించాలని నిర్ణయించామన్నారు. లబ్దిదారులు సిలిండర్ ఎప్పుడు బుక్ చేసుకున్నా, సిలిండర్ తీసుకోకపోయినా మూడు సిలిండర్ల నగదు ఒకేసారి ఖాతాల్లో వేసేలా పొలిట్ బ్యూరో నిర్ణయించిందన్నారు.
ఏప్రిల్ 22న పహల్గాంలో 27మంది అమాయకులైన యాత్రికులను ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు. దీన్ని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం తీవ్రంగా ఖండిరచింది. మృతులకు నివాళిగా మౌనం పాటించి.. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించింది.
తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, మాజీ ఎమ్మెల్యే పాలకొండ్రాయుడు, పోతుగంటి పీరయ్య, వీరయ్యచౌదరి మరణం పట్ల పొలిట్ బ్యూరో ప్రగాడ సానుభూతి ప్రకటించింది. వారి కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. ఆపరేషన్ సింధూర్ రూపకల్పనచేసి, ఉగ్రవాద దాడుల్ని.. పాక్ సైనిక చర్యలను తిప్పికొట్టి, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టి, దేశం తరపున పాకిస్తాన్‌పై పోరాటం చేసిన ప్రధాని నరేంద్రమోడీ, త్రివిధ దళాలు, అధిపతులు, ఆపరేషన్ సింధూర్‌లో పాల్గొన్న ప్రతి సైనికుడినీ అభినందిస్తూ పొలిట్ బ్యూరో తీర్మానం చేసింది. పొలిట్ బ్యూరో సభ్యుడు నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ రావడంపట్ల అభినందిస్తూ తీర్మానం చేశాం. పహల్గాం ఘటనలో 27మంది పౌరుల మృతిపట్ల తిరంగ సభలు జరపాలని కేంద్ర ప్రభుత్వం చేసిన తీర్మానంలో భాగంగా.. తెలుగుదేశం, జనసేన, బీజేపీలు 16, 17, 18 తేదీల్లో మూడు రోజులు అన్ని నియోజకవర్గాల్లో తిరంగ ర్యాలీలు జరిపాలని తెలుగుదేశం తరపున నిర్ణయం తీసుకున్నాం. టీడీపీ సభ్యులు ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే 2 లక్షలు బీమా సౌకర్యం ఉండేది. దాన్ని 5 లక్షలకు పెంచాం. ఇప్పటికే 195మందికి రూ.9.75 కోట్లు కార్యకర్తలకు అందించాం. ఎక్కడా ఆలస్యం కాకుండా కార్యకర్త చనిపోతే ఇన్స్యూరెన్స్ కంపెనీలతో మాట్లాడి వీలైనంత త్వరగా బీమా సొమ్ము అందేలా పొలిట్ బ్యూరో సమావేశంలో చర్చించాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమానికి, వారికి ఏవైనా ఇబ్బందులుంటే ఆదుకోవడానికి అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నాం. గత 11 నెలల్లో అర్హులైన 50,235 మందికి సీఎంఆర్‌ఎఫ్ కింద సుమారు రూ.349 కోట్లు ఆర్థిక సాయం చేశాం. ఎన్టీఆర్ స్కూల్, కార్పొరేట్ స్కూల్స్‌లో 600మందికి ఉచితంగా విద్యను అభ్యసించే ఏర్పాటు చేశాం. కార్యకర్తల సంక్షేమ నిధితో కార్యకర్తలకు సహాయపడేలా పొలిట్ బ్యూరో సమావేశంలో చర్చించాం’ అని అచ్చెన్న వెల్లడిరచారు.
మే నెలాఖరుకు పార్టీ సంస్థాగత ఎన్నికలన్నింటినీ పూర్తి చేయాలని, ఇప్పటికే కేఎస్‌ఎస్, బూత్, గ్రామ కమిటీలు, క్లస్టర్, యూనిట్, మండల, నియోజకవర్గ, జిల్లాస్థాయి వరకూ మహానాడులోగా అన్ని కమిటీలు పూర్తి చేయాలని నిర్ణయించాం. మూడు సార్లు మండల పార్టీ అధ్యక్షులుగా చేసిన వారిని ఇతర పోస్ట్‌లో ఉంచేలా నిర్ణయం తీసుకున్నాం. నేడు రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఆర్థికంగా కష్టాలున్నాయి. ఎన్ని కష్టాలున్నా అభివృద్ధి, సంక్షేమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ.. ముందుకు వెళ్తున్నాం. ఇప్పటికే పింఛన్లు పెంచి ఇస్తున్నాం. వికలాంగుల పింఛన్ 15 వేలకు పెంచాం. గత ప్రభుత్వంలో భర్తలు చనిపోయిన భార్యలు పింఛన్ రానివారు లక్షమందికి పైగా ఉన్నారు. వారికి జూన్ 12న విడో పింఛన్‌లు అందించేందుకు నిర్ణయించాం. గ్యాస్ సిలిండర్లు తీసుకున్నా లేకపోయినా.. లబ్దిదారులకు ఖాతాల్లోకి ముందే డబ్బులు వేసేలా నిర్ణయం తీసుకున్నాం. మొన్ననే మత్స్యకారులకు రూ.258 కోట్ల వేట నిషేధ భృతి ఇచ్చాం. పాఠశాలలు తెరిచేలోగా తల్లికి వందనం కింద పిల్లల తల్లిదండ్రుల ఖాతాల్లో డబ్బులు వేయాలని పొలిట్ బ్యూరోలో నిర్ణయించాం.
కేంద్రం అన్నదాత సుఖీభవ కింద ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ ఇచ్చే రోజు మనం కూడా రైతుల అకౌంట్లలో డబ్బులు వేసేందుకు నిర్ణయించాం. త్వరలోనే ఒక్కొక్క నెలలో ఒక్కొక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయాలని సంక్షేమ క్యాలెండర్‌ను కూడా వీలైనంత త్వరగా ఇచ్చేందుకు చర్చించాం. 11 నెలల్లో రూ.8.50 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి. అవన్నీ అమలు జరిగే విధంగా చూసి 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నాం. దీంతోపాటు ఈనెల 27, 28, 29న కడప జిల్లాలో మూడు రోజులు మహానాడును జరపాలని నిర్ణయించాం. రెండు రోజులు తీర్మానాలు ఉంటాయి. 27న జాతీయ పార్టీ అధ్యక్షులు నామినేషన్ వేస్తారు. 28న మళ్లీ జాతీయ పార్టీ అధ్యక్ష ఎన్నికతోపాటు మా వ్యవస్థాపక అధ్యక్షుల జన్మదిన వేడుకల పండుగను నిర్వహిస్తాం. కనీవినీ ఎరుగని విధంగా మహానాడును జరపాలని నిర్ణయించాం. మూడో రోజు బహిరంగ సభ ఉంటుంది’ అని అచ్చెన్నాయుడు వివరించారు.
‘2014 -2019లలో నీరు-చెట్టు పనులు చేసిన తెలుగుదేశం కార్యకర్తలకు గత ప్రభుత్వం ఒక పైసా కూడా బిల్లు రిలీజ్ చేయలేదు. మేము అపోజిషన్‌లో ఉన్నప్పుడు న్యాయస్థానంలో పోరాడి కొంత ఇప్పించాం. ఇంకా చాలా బిల్లులు పెండిరగ్ ఉంటే ఫస్ట్ విడతలో కొంతఇచ్చాం. నీరు చెట్టులో రూ.445 కోట్లు, నరేగాలో రూ.211 కోట్లు బిల్లులు చెల్లించాలి. మహానాడులోపు బిల్లులను చెల్లించాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. పొలిట్ బ్యూరోలో దీనిపైనా చర్చించడం జరిగింది. దుర్మార్గ ప్రభుత్వం మా కార్యకర్తలపై అక్రమంగా 2,887 కేసులు పెట్టారు. ఈ అక్రమ కేసులపై న్యాయపరంగా ముందుకు వెళ్తున్నాం. తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో ఎక్కువమంది యానాదులున్నారు. వారికి రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు కూడా లేవు. వారి కోసం ప్రత్యేక డ్రైవ్‌పెట్టి ఈ యానాది కమ్యునిటీకి కార్డులతోపాటు అన్ని సంక్షేమ పథకాలు అందించేందుకు పొలిట్ బ్యూరో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇకపై ఏ కార్యక్రమం జరిగినా ఒకే యాప్‌లో ప్రతి కార్యక్రమాన్నీ చూసేలా మై టీడీపీ యాప్‌ను తీసుకు రావడం జరిగింది. ఇటువంటి యాప్ దేశంలో ఏపార్టీకి లేదు. జాతీయ పార్టీ అధ్యక్షుల నుండి యాక్టీవ్ పార్టీ మెంబర్ వరకు దాదాపు కోటిమంది ఈ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకునేలా పొలిట్ బ్యూరోలో చర్చించాం. ఈ యాప్‌ను మహానాడు నుండే ఉపయోగంలోకి తీసుకురావాలని అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు వన్ ఇయర్‌లో నిర్మించాలి. దానికి రాష్ట్రస్థాయిలో త్రిమెన్ కమిటీ, జిల్లాస్థాయిలో త్రిమెన్ కమిటీ వేస్తారు. రాష్ట్రస్థాయిలో రాష్ట్ర అధ్యక్షులు నాయకత్వం వహిస్తారు. జిల్లాల్లో జిల్లా మంత్రి నాయకత్వం వహిస్తారు’ అని పొలిట్ బ్యూరో నిర్ణయాలను అచ్చెన్నాయుడు వివరించారు.
అదిరిపోయేలా మహానాడు: పల్లా
‘టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లాశ్రీనివాసరావు మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటినుంచి ప్రతి ఏడాది మహానాడును క్రమం తప్పక నిర్వహించడం జరుగుతోంది. యుద్ధ వాతావరణ నేపథ్యంలో మహానాడుపై మిమాంసలో ఉండి కొంత ఆలస్యమైంది. యుద్ధం ఆగిపోయిన నేపథ్యంలో మహానాడును నిర్వహించాలని పొలిట్ బ్యూరో నిర్ణయించింది. కనుక ఈనెల కడప జిల్లా సీకే దిన్నె మండలంలో 27, 28, 29 తేదీల్లో ఘనంగా మహానాడు నిర్వహించబోతున్నాం. ఇందులో మొదటి, రెండు రోజులు మండలస్థాయితోపాటు యూనిట్, క్లస్టర్ నాయకుల వరకు కార్యక్రమానికి పిలుస్తున్నాం. మొదటి రెండు రోజులు సుమారు 23 వేలమందిని ఆహ్వానిస్తున్నాం. మూడో రోజు గ్రామస్థాయి కమిటీ వరకు సుమారు 50 వేలమందికి ఆహ్వానం పంపుతున్నాం. ఇది కాకుండా చుట్టుపక్కల నియోజకవర్గాల్లోని కుటుంబ సాధికార సమితి కమిటీలకూ ఆహ్వానం పంపుతున్నాం. 2024 ఎన్నికల్లో కడప ప్రజలు తెలుగుదేశం పార్టీని బాగా ఆదరించారు. ఈ మహానాడును అందరూ కలిసి విజయంతం చేయాలి. ఇందుకోసం ప్రతి నియోజకవర్గంలో క్యాడర్‌ను పిలిచి ట్రైనింగ్ ఇస్తున్నా’మని వివరించారు.
సీమకు ఉజ్వల భవిష్యత్: కాల్వ
మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ.. మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీ కడప గడ్డపై టీడీపీ తన మూడు రోజుల మహానాడును నిర్వహించుకోబోతుంది. రాయలసీమలో ఈరోజు అభివృద్ధి ఫలాలను ప్రజలు, రైతులు, పేదలు చూడబోతున్నారంటే దానికి కారణం మహనీయుడు ఎన్టీఆర్ చేసిన ఆలోచనలు.. చంద్రబాబు చేసిన ఆచరణ. రాయలసీమకు ఈరోజు నీళ్లు వచ్చాయన్నా, పరిశ్రమలు వచ్చి ఉద్యోగాలు వచ్చాయన్నా వీరి కృషే కారణం. శతాబ్ధాల రాయలసీమ వెనుకుబాటు తనానికి శాశ్వతమైన పరిష్కార మార్గాలు కనుగొనడానికి కడప మహానాడుకు వేదిక కాబోతుంది. ఎందుకంటే చేసే తీర్మానాలు, జరిగే చర్చల్లో దాదాపు 60 శాతం రాయలసీమకు సంబంధించి మాట్లాడుకోబుతన్నాం. ఇది మా యువనాయకుడు నారా లోకేష్ చేసిన తీర్మానం. రాయలసీమలో తరాల వెనుకుబాటుతనానికి, శతాబ్ధాల దారిద్య్రానికి శాశ్వతమైన పరిష్కారం మహానాడు చూపెట్టబోతుంది. అదే కడపగడ్డపై నారా లోకేష్ రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించారు. ఆ డిక్లరేషన్ అమల్లో భాగంగానే ఈరోజు డ్రిప్ సబ్సీడీగాని, పరిశ్రమల ఏర్పాటుగాని, సాగునీటి రంగంలో హంద్రీనీవాకు రూ.3700 కోట్లు ఇవ్వడం.. ఇవన్నీ కూడా చంద్రబాబు తీసుకునే ప్రత్యే శద్ధగా తెలియజేస్తున్న.
ఈ నేపథ్యంలో కడపలో జరుగుతన్న మహానాడు ద్వారా రాయలసీమకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని రాయలసీమ ప్రజలకు చెబుతున్నాం. ఈ మహానాడు చారిత్రాత్మక ఘట్టంగా చరిత్రలో నిలిచిపోతుంది. అదే విధంగా చేసే తీర్మానాల్లో 11 నెలల్లో సాధించిన విజయాలతో పాటు.. ప్రజలపట్ల ఎంత బాధ్యతతో పనిచేశాం.. ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చడానికి ఆర్థిక సమస్యలను ఏవిధంగా అధిగమిస్తున్నాం. చంద్రబాబు నాయుడి పరిపాలన దక్ష్యత, పాలనా అనుభవంతో విదేశాల్లో ఆయనకున్న పరిచయంతో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్గదామంగా మార్చగలుతున్నాం. లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించగలుతున్నాం. ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు పెద్ద ఆస్తి. ఆయన మార్గదర్శకత్వంలో రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి అసలు సిసలు చిరునామాగా మారుతుందని ఒక స్పష్టమైన సంకేతాన్ని కడప మహానాడు ద్వారా ప్రజలకు ఇవ్వబోతున్నాం’ అన్నారు.