.వీడియో మార్ఫింగ్ చేయవలసిన అవసరం టీడీపీకి లేదు
.వైసీపీ నేతల వీడియోలపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలి
.మాజీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్ డిమాండ్
అమరావతి: వీడియో కాల్‌లో ఒక మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌పై పార్లమెంటులో చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్ డిమాండ్ చేశారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గోరంట్ల మాధవ్ వీడియో మార్ఫింగ్ చేసి విడుదల చేయాల్సిన అవసరం టీడీపీకి పట్టలేదన్నారు. వైసీపీ నాయకులు రోజూ ట్విటర్, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియాలో ఏదో ఒక అబద్ధపు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. అనంతపురం జిల్లాకు గోరంట్ల మాధవ్ వస్తున్నాడంటే ఏ అఘాయిత్యానికి పాల్పడతాడో అని జనం భయపడే పరిస్థితి ఏర్పడిరదన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం టీడీపీ ఉందని, దిగజారుడు రాజకీయాలు చేయాల్సిన అవసరం టీడీపీకి లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ లోపాలు, అవినీతిపై వాట్సాప్, సోషల్ మీడియాలో ఏదైనా పోస్టు పెడితే, పెట్టిన వారి ఇళ్లకు సీబీసీఐడి వారు వెతుక్కుంటూ వెళుతున్నారని చెప్పారు. వైసీపీ నాయకులు ఎన్ని దుర్మార్గాలు చేసినా వారిపై కేసులుండవన్నారు. కలెక్టరేట్ కు వెళ్లి నిరసన తెలిపే స్వేచ్ఛ ప్రజలకు లేదని, హౌస్ అరెస్టులు చేస్తున్నారని పేర్కొన్నారు. పోలీసులు లా అండ్ ఆర్డర్ వదిలేసి వైసీపీకి కొమ్ముకా స్తున్నారని ధ్వజమెత్తారు. పోలీసుల అండ చూసుకుని వైసీపీ నాయకులు బరితెగించి విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
భయబ్రాంతులకు గురవుతున్న మహిళలు
వైసీపీ నాయకులు అచ్చోసిన ఆంబోతుల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళలు భయబ్రాంతులకు గురౌతున్నారని చెప్పారు. అనిల్ కుమార్‌యాదవ్ అసెంబ్లీలో జిప్ విప్పి చూపించాడు, అరగంట చాలు పనికానిచ్చి పంపిచేస్తా అని అవంతి శ్రీనివాస్ ఓ మహిళకు చెప్పాడు, గంట చాలన్నాడు మరో వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు అని వారి చిట్టా విప్పారు. ఆ పార్టీ నేతలు కోడిపందాలు, క్లబ్బులు పెట్టినా, గ్యాంబ్లింగ్ నడిపినా, పేకాట, క్యాసినో నిర్వహించినా ఎవరూ ఏమీ మాట్లాడకూడదని అన్నారు. ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో రిలీజ్ అయ్యాక వైసీపీ నాయకులు నోటికొచ్చినట్లు మాట్లాడు తున్నారని చెప్పారు. రాసలీలల్లో అడ్డంగా దొరికిపోయి అడ్డగోలుగా బుకాయి స్తున్నారని పేర్కొన్నారు. వైసీపీ నాయకులకు సంబంధించి ఇప్పటి వరకు వచ్చిన ఆడియోలు, వీడియోలపై జగన్ రెడ్డి ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్టీరామారావు కుమార్తె మరణాన్ని కూడా నీచ రాజకీయాలకు వాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు నీచ, నికృష్ట వ్యవహారాలకు అలవాటుపడి పోయారని బీద రవిచంద్ర యాదవ్ పేర్కొన్నారు.