హిందూపూర్: మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. మంగళవారం హిందూపురంలో మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మెకు బాలకృష్ణ సంఫీుభావం తెలిపారు. రెండు వారాలుగా మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. సూర్యుడు ఉదయించినప్పటి నుంచి అస్తమించే వరకు పారిశుద్ధ్య పనులు చేస్తున్న కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం తగదన్నారు. జగన్ పాదయాత్రకు ముందు ఇచ్చిన హామీలు ఇప్పుడు ఎందుకు అమలు చేయటంలేదని నిలదీశారు. పైశాచిక ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని మండిపడ్డారు. మహిళలకు ఎన్టీఆర్, చంద్రబాబు పెద్దపీట వేశారని చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు సాగనంపుదామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి త్వరలోనే గుణపాఠం చెబుతామని నందమూరి బాలకృష్ణ హెచ్చరించారు.
అంగన్వాడీలపై ఇంత వివక్ష ఎందుకు?
హిందూపురం పట్టణములో అంగన్వాడీలు నిరవధిక సమ్మెకు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంఫీుభావం తెలిపారు. దాదాపు నెలరోజులనుండి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని మహిళలు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించు కోకుండా వారిపై వివక్ష చూపడం దేనికి సంకేతం అని ప్రశ్నించారు. అండగా ఉంటానని వారికి భరోసా ఇచ్చారు. శ్రమజీవుల కష్టాలను పరిగణలోకి తీసుకొని వారిని ఆదుకునే భాద్యత ప్రభుత్వానిదేనని బాలకృష్ణ పేర్కొన్నారు.