- బాధ్యులైన అందరినీ విచారిస్తాం
- మూడు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు
- సిట్ చీఫ్ త్రిపాఠి వెల్లడి
- టీడీపీ ఈవోతో భేటీ
తిరుపతి(చైతన్యరథం): తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ వాడకంపై లోతైన విచారణ చేస్తామని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తెలిపారు. తిరుపతి తూర్పు పోలీసు స్టేషన్ లో నమోదైన కేసు కూడా సిట్‌కు బదిలీ అయిందని చెప్పారు. నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డెయిరీపై విచారణ చేస్తామని పేర్కొన్నారు. సిట్ అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు నిర్వహిస్తున్నారని వివరించారు. కల్తీ నెయ్యికి బాధ్యులైన అందరినీ విచారిస్తామన్నారు. నివేదిక సమర్పించడానికి కాలపరిమితి లేదని తెలిపారు.
కల్తీ నెయ్యి వ్యవహారంపై రెండో రోజు ఆదివారం ‘సిట్’ విచారణ సాగింది. తిరుపతి పోలీసు అతిథి గృహంలో మరోసారి సిట్ సభ్యులు భేటీ అయ్యారు. మూడు బృందాలుగా ఏర్పడి విచారణ చేపడుతున్నారు. డీఐజీ గోపీనాథ్ జెట్టీ, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, అదనపు ఎస్పీ వెంకటరావు నేతృత్వంలో దర్యాప్తు చేస్తున్నారు. టీటీడీ ప్రొక్యూర్మెంట్ జీఎం ఇచ్చిన ఫిర్యాదులోని అంశాలను సిట్ బృందం పరిశీలిస్తోంది. టీటీడీ బోర్డు దగ్గర నుంచి అధికారులు, సిబ్బంది పాత్ర వరకు అన్ని అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఆదివారం ఈవో శ్యామలరావును వారు కలిసి, పూర్తి వివరాలు తెలుసుకున్నారు. తిరుపతిలోని ఈవో బంగ్లాలో ఈ సమావేశం జరిగింది. అనంతరం, సిట్ చీఫ్ సర్వశ్రేష్ట త్రిపాఠి మీడియాతో మాట్లాడారు.
కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ సభ్యులు పలు ప్రాంతాలకు వెళ్లి విచారణ చేపట్టనున్నారు. తమిళనాడులోని దుండిగల్ లో ఏఆర్ డెయిరీ ఫుడ్స్ సంస్థను పరిశీలించనున్నారు. తిరుమలలో లడ్డూపోటు, విక్రయ కేంద్రాలను మరో బృందం పరిశీలించనుంది. లడ్డూ తయారీ ముడి సరుకులపై ఆరా తీయనున్నారు. తయారీలో పాల్గొంటున్న శ్రీవైష్ణవులను ప్రశ్నించనున్నారు. తితిదే పరిపాలన భవనంలో మరో బృందం విచారణ చేపట్టనుంది. నెయ్యి కొనుగోలు, ఒప్పందాలు పరిశీలించనుంది. దీనికి సంబంధించి తితిదే, ఏఆర్ డెయిరీ మధ్య ఒప్పందాలపై ఆరా తీయనున్నారు.