3దశాబ్దాల క్రితమే చంద్రబాబు రూపొందించిన విజన్
నాడు 200 ఎకరాల్లో హై టెక్ సిటీకి బీజం .. నేడు 15 వేల ఎకరాల సైబరాబాద్ మహానగరం గా మారిన వైనం
అదే క్రమంలో అమరావతికీ ప్రణాళిక
అమరావతిని కన్నేసిన క్షుద్ర రాజకీయ మేఘాలు
కుదేలైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ
పిపిపిపి తోనే పేదల జీవితాల్లో వెలుగు
…….
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మస్తిష్కం నుంచి ఆవిర్భవించిన పిపిపిపి ఫార్ములా ఇప్పుడు రాష్ట్రానికి సంజీవనిలా మారనున్నది. ప్రస్తుత పరిస్థితిలో చంద్రబాబు విజన్ రాష్ట్రానికి ఎంతో అవసరమన్న భావన అన్ని వర్గాల ప్రజలలో వ్యక్తం అవుతున్నది. ప్రభుత్వము, ప్రజలు, ప్రయివేటు వ్యక్తులు భాగస్వామ్యంతో అభివృద్ధి నమూనా రూపకల్పన చేయటమే పిపిపిపి ప్రధాన ధ్యేయం. ఈ విధానంలో తొలిసారిగా మూడు దశాబ్దాల క్రితమే కేవలం 200 ఎకరాల విస్తీర్ణంలో చంద్రబాబు హై టెక్ సిటీ కి బీజం వేశారు. అది శరవేగంగా అభివృద్ధి చెంది దాదాపు 15 వేల ఎకరాల విస్తీర్ణంలో సైబరాబాద్ గా రూపుదిద్దుకున్నది.
ప్రస్తుతం సైబరాబాద్ లో ఉద్యోగాలు చేస్తున్న లక్షలాదిమంది యువతకు వారు అనుభవిస్తున్న ఉద్యోగ జీవితం వెనుక చంద్రబాబు అవిశ్రాంత శ్రమ దాగి వున్న విషయం తెలియక పోవచ్చు. అయినప్పటికీ తన ముందుంచూపు లక్షలాదిమంది ఉపాధి కల్పించటంతో పాటు ఒక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు దన్నుగా వుండటం చూసి చంద్రబాబు ఎంతో గర్వంగా భావిస్తుంటారు. అప్పట్లో చంద్రబాబు రూపొందించిన విజన్ 2020 ఎంతో హేళన కు గురయింది. దేశంలోనే కాకుండా, విదేశాలలో సైతం కొంతమంది నాయకులు విజన్ 2020 ని హేళన చేసినవారే. అయినా చంద్రబాబు చెక్కుచెదరని ఉక్కు సంకల్పంతో విజన్ 2020 ని సాకారం చేశారు. అప్పుడు యావత్ ప్రపంచం దిగ్భ్రమకు గురయింది. అప్పటి వరకు రాజకీయ నాయకుల పట్ల ప్రజలకున్న భావన మారిపోయింది.
ఒక రాజకీయ నాయకుడు ఇంత దార్శనికత కలిగి వుంటారా? అన్న చర్చకు ఆస్కారం. ఏర్పడింది. ఏదేమైనా చంద్రబాబు తన విజన్ తో పాలకులకు సరికొత్త ప్రామాణికాలు నిర్దేశించారు. అప్పటివరకు చంద్రబాబు విజన్ 2020 ని అవహేళన చేసిన ప్రపంచ దేశాధినేతలు ఆంధ్రప్రదేశ్ కు క్యు కట్టారు. చంద్రబాబుతో కరచాలనాలు ఇచ్చేందుకు తహతహలాడారు. అదే క్రమంలో రాష్ట్రం విడివడిన అనంతరం పిపిపిపీ పద్ధతిలో రాజధాని అమరావతి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. చంద్రబాబు పై వున్న అపార విశ్వాసంతో రాజధాని నిర్మాణం కోసం ఒక్కరూపాయి ప్రభుత్వ ఖజానాపై భారం పడకుండా 33 వేల ఎకరాలు సేకరించగలిగారు.
రాజధాని నిర్మాణంలో భూములు ఇచ్చిన రైతులను భాగస్వాములను చేశారు. కులమతాలకు అతీతంగా ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ, పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలు వారి భూములను స్వచ్ఛందంగా రాజధాని నిర్మాణం కోసం ఇచ్చారు. చంద్రబాబు అధికారంలో కొనసాగి వుంటే ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా బహుజన, ప్రజా, రైతు రాజధాని ఏర్పడి వుండేది. అయితే క్షుద్ర రాజకీయపు కారుమేఘాలు అమరావతిని కమ్మేసాయి. ప్రస్తుతం అమరావతికి రాజకీయ గ్రహణం పట్టింది. ఆ గ్రహణం విడిచే శుభఘడియ తెలుగు ప్రజ ఎదురుచూస్తోంది.
అధికారమే పరమావధిగా భావించే రాజకీయ నాయకులకు చంద్రబాబు రూపొందించిన పిపిపిపి విధానం లో ఆంతర్యం అంటుబట్టక పోవచ్చు. అయితే ఆ విధానం ఔన్నత్యాన్ని, అది చూపే ప్రభావాన్ని తక్కువ అంచనా వేయలేమని విద్యావంతులు, మేధావులు అభిప్రాయ పడుతున్నారు. ప్రస్తుతం తలకు మించిన అప్పుల భారంతో కుంగిపోతున్న ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టాలంటే, ప్రభుత్వ ఖజానాపై భారం పడకుండా, ప్రజల పై పన్నుల భారం మోపకుండా ఆర్థిక స్వావలంబన పెంపొందించుకోవల్సిన అవసరం ఎంతైనా వుంది.
ప్రస్తుత పరిస్థితుల్లో అందుకు వున్న ఏకైక మార్గం చంద్రబాబు దార్శనికత మాత్రమే. ఇప్పటికే పలు విశ్వవిద్యాలయాలలో ‘ పబ్లిక్ పాలసీ ‘ ల పైన పాఠ్యాంశాలు రూపొందించారు. రాజకీయ పార్టీలు సాధారణంగా ఒక ప్రాంతం లేదా కులం వంటి వాటిని ప్రాతిపదికగా తీసుకుని ప్రణాళికలు రూపొందించుకుంటాయి. అయితే కాలం కంటే వేగంగా ఆలోచించే చంద్రబాబు దృక్పథం విభిన్నంగా వుంటుంది. ఒక కుటుంబాన్ని యూనిట్ గా తీసుకొని ప్రణాళిక రూపొందించాలనేది చంద్రబాబు యోచన.
ప్రతి కుటుంబం జీవన ప్రమాణాలు పెంపొందించుకునే విధంగా సూక్ష్మ ప్రణాళిక రూపొందించాలనే దిశగా చంద్రబాబు కసరత్తు జరుపుతున్నారు. చంద్రబాబు ప్రణాళిక ఆచరణ లోకి వచ్చాక రాష్ట్రంలో తలసరి ఆదాయం ఊహించని విధంగా మారిపోగలదని ఆర్థిక నిపుణుల అంచనా.ఆ శుభ తరుణం కోసం రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రజానీకం ఎదురుచూస్తోంది.