- పీఎంశ్రీ నిధుల వినియోగంలో ముందంజ
- కస్తూర్బా హాస్టళ్లలో బాలికలకు పూర్తిగా బెడ్స్
- కడప మోడల్లో 844 స్మార్ట్ కిచెన్ల నిర్మాణం
- పీటీఎం నాటికి పూర్తిస్థాయిలో విద్యార్థిమిత్ర కిట్లు
- జూనియర్ కళాశాల విద్యార్థులకు పంపిణీకి చర్యలు
- ఇక నుంచి అనాథ పిల్లలకు తల్లికి వందనం నిధులు
- విద్యాశాఖ అధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష
అమరావతి (చైతన్యరథం): ప్రభుత్వ పాఠశాలల ఆధునికీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎంశ్రీ పథకం నిధుల వినియోగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఉండవల్లి నివాసంలో విద్యాశాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పీఎంశ్రీ పథకంలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపిన అధికారులను అభినందించారు. కడప మోడల్ ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 844 స్మార్ట్ కిచెన్ల నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీ కార్యక్రమం ఇప్పటికీ ప్రారంభించామని, మెగా పీటీఎం నాటికి పూర్తిస్థాయిలో కిట్ల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
రాష్ట్రంలోని 430 కేజీబీవీల్లో విద్యనభ్య సిస్తున్న 1,06,360 మంది విద్యార్థినులకు 53,180 బంక్ బెడ్స్ ఏర్పాటుకు తక్షణమే చర్యలు చేపట్టాలని సూచించారు. కేజీబీవీల తో పాటు ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీల్లో కూడా బంక్ బెడ్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియ ర్ కళాశాలల్లో చదువుకునే 2,03,430 మంది విద్యార్థులకు కూడా కిట్ల పంపిణీ చేపట్టినట్లు చెప్పారు. ప్రైవేట్ అన్ ఎయిడెడ్ స్కూళ్ల అనుమతుల్లో అనవసరమైన నిబంధనలను తొలగించాలని సూచించారు. ప్రైవేటు స్కూళ్లలో నిర్ణయించిన ఫీజులను స్కూళ్ల వెలుపల బోర్డులపై ప్రదర్శించడంతో పాటు పబ్లిక్ డొమైన్ లో పొందుపర్చాలని ఆదేశించారు.
అనాథ పిల్లలకూ తల్లికి వందనం
రాష్ట్రంలోని అనాథ పిల్లలకు కూడా తల్లికి వందనం పథకం డబ్బులు అందేలా పక్కా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ పథకం అమలు కోసం పిల్లల గార్డియన్ల వివరాలను కచ్చితంగా సేకరించాలని, ఒకవేళ ఎవరూ లేని పక్షంలో ఆ నిధులను నేరుగా జిల్లా కలెక్టర్కు వంపి అక్కడ నుంచి పిల్లలకు అందేలా చూడాలని స్పష్టం చేశారు. అంతేకాకుండా అనాథ పిల్లల బ్యాంక్ ఖాతాలకు నేరుగా డబ్బులు జమ చేసి వారి చదువు పూర్తయిన తర్వాత ఆ సొమ్మును స్వతంత్రంగా వినియోగించుకునేలా ఒక శాశ్వత విధా నం ఆలోచన చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అటువంటి నిర్ణయం తీసుకోవడం వల్ల తల్లిదండ్రులు లేని పిల్లల చదువుకు ఆటంకం కలగకుండా వారి భవిష్యత్తుకు బలమైన ఆర్థిక భరోసా లభిస్తుందని తెలిపారు.
ఆన్లైన్లో తెలుగు అకాడమీ పుస్తకాలు
తెలుగు అకాడమీ ముద్రించే టెక్స్ట్ బుక్స్ ప్రజలకు సులభంగా అందుబాటులోకి వచ్చేలా అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ప్రముఖ ఈ-కామర్స్ ఆన్లైన్ ప్లాట్ఫార్మ్స్ ద్వారా విక్రయించాలని ఆదేశించా రు. ప్రజలు నేరుగా ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసే సదుపా యాన్ని వీలైనంత త్వరగా కల్పించాలని స్పష్టం చేశారు. రాష్ట్రం లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరచడంతో పాటు వారి హాజరుశాతాన్ని పెంచడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ముఖ్యంగా చదువులో వెనుక బడిన కర్నూలు, అనంతపురం, మార్కాపురం, అల్లూరి సీతారామ రాజు, మరియు పోలవరం తదితర జిల్లాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఆయా జిల్లాలలో ఉపాధ్యాయుల లభ్యతను సమీక్షి స్తూ విద్యార్థుల సామర్థ్యాల పెంపునకు ఒక ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. వీటితో పాటు రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల పాఠశాల హాజరు 96. శాతానికి తగ్గకుండా పక్కా చర్య లు తీసుకోవాలని, మధ్యాహ్న భోజన పథకాన్ని నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా అత్యంత పారదర్శకంగా అమలు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
మాతృభాషను విస్మరించొద్దు
పబ్లిక్ పరీక్షల్లో ఫెయిలవుతున్న విద్యార్థుల్లో అధిక శాతం మ్యాథ్స్, సైన్స్, తెలుగు సబ్జెక్టుల్లో విఫలమవుతున్న విషయాన్ని అధికారులు మంత్రి లోకేష్ దృష్టికి తెచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో మాతృభాష తెలుగును విస్మరించరాదు. ఈ విషయంలో ఉపాధ్యా యులను అప్రమత్తం చేయాలి. ఆయా సబ్జెక్టుల్లో బ్రిడ్జి కోర్సు మెటీరియల్ తయారుచేసి విద్యార్థులకు అందజేయాలి. వెనుకబడి న విద్యార్థులను గుర్తించి ఇప్పటినుంచే వారికి అదనపు తరగతులు నిర్వహించి శిక్షణ ఇవ్వాలని సూచించారు. పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని మెరుగుపర్చడంపై టీచర్లు శ్రద్ధ వహించాలి. సాధ్యమైనంత త్వరగా హైస్కూలు విద్యార్థులకు క్రోమ్ బుక్స్ తో కూడిన కంప్యూటర్ ల్యాబ్స్ అందజేతకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు, ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నారాయణ భరత్ గుప్తా, ఇంటర్మీడియట్ విద్య కమిషనర్ రంజిత్బాషా, పాఠశాల విద్య డైరక్టర్ తమీమ్ అన్సారియా, సమగ్ర శిక్ష స్పెషల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి.శ్రీనివాసరావు, విద్యామౌలిక సదుపాయాల సంస్థ ఎండీ దీవెన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
















