- రూ.88.41 కోట్లతో ఆహార పరీక్షల ప్రయోగశాలలు
- తిరుమల, కర్నూలులో రూ.40 కోట్లతో ఏర్పాటు
- ఒంగోలు, ఏలూరులో ప్రాథమిక పరీక్షల ల్యాబ్‌లు
- 22 జిల్లాల్లో ఫుడ్ టెస్టింగ్ లేబోరేటరీలకు చర్యలు
- మంత్రి సత్యకుమార్ సమక్షంలో ఎంవోయూపై సంతకాలు
అమరావతి(చైతన్యరథం): రాష్ట్రంలో ఆహార భద్రతా ప్రమాణాలను మరింత పెంపొం దించడానికి భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ(ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ)తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.88.41 కోట్లతో మంగళవారం న్యూఢల్లీిలో ఒప్పందం (ఎంవోయూ) కుదు ర్చుకుంది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సమక్షంలో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జి.కమలవర్ధనరావు, ఏపీ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ సి.హరికిరణ్, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇనోషి శర్మ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ చొరవతో రాష్ట్రంలో ఆహార భద్రతా ప్రమాణాలను బలోపేతం చేసేందుకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ ముందుకొచ్చిందని, ఇందుకోసం పూర్తి సహకారం అందిస్తా మని కమలవర్ధనరావు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ప్రధానంగా ఏపీలో ఆహార పరీక్షల ప్రయోగశాలలు(ఫుడ్ టెస్టింగ్ లేబోరేటరీస్) ఏర్పాటు చేసేందుకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సుముఖత వ్యక్తం చేసింది. రూ.20 కోట్లతో తిరుమల, మరో రూ.20 కోట్లతో కర్నూలులో ఇంటిగ్రేటెడ్ ఫుడ్ ల్యాబ్‌లను నెలకొల్పేందుకు ఒప్పందం కుదిరింది. అలాగే ఏలూరు, ఒంగోలులో ప్రాథమిక ఆహార పరీక్షల ప్రయోగశాలలు(బేసిక్ ఫుడ్ టెస్టింగ్ లేబోరేటరీస్) ఒక్కొక్కటి రూ.7.5 కోట్లతో మొత్తం రూ.13 కోట్లతో నెలకొల్పనున్నారు. రాష్ట్రంలో ఆహార శాంపిళ్ల సేకరణ, విశ్లేషణ కోసం రూ.12 కోట్లు, ఆహార భద్రతా ప్రమాణాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు రూ.11 కోట్లు కేటాయించేందుకు ఒప్పందం కుదిరింది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న 4 మొబైల్ ఫుడ్ టెస్టింగ్ లేబోరేటరీలతో పాటు అదనంగా మరో 22 లేబోరేటరీలను టర్న్ కీ విధానంలో వినియోగించేందుకు రూ.15 కోట్లు కేటాయిం చేందుకు సూత్రప్రాయంగా అంగీకారం కుదిరింది.
ప్రతి జిల్లాకొక ఆహార పరీక్ష ప్రయోగశాల
రాష్ట్రంలో ఆహార భద్రతా ప్రమాణాల చట్టాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను అమలుచేస్తామని మంత్రి సత్యకుమార్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. అవసర మైన మానవవనరులు, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, తాజాగా కుదుర్చుకున్న ఒప్పం దం ఇందుకు దోహదం చేస్తుందన్నారు. ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్‌లో దేశంలోనే ఏపీ సముచిత స్థానం పొందేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆహార భద్రతా అధికారులతో తరచూ సమీక్షలు నిర్వహించి భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేస్తామని తెలిపారు. ప్రతి జిల్లాకొక ఆహార పరీక్ష ప్రయోగశాల కావాలని మంత్రి కోరగా అందుకు రూ.15 కోట్లు కేటాయి స్తామని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సీఈవో కమలవర్ధనరావు అంగీకరించారు. రూ.140 కోట్లతో రాష్ట్రంలో ఆహార భద్రతా ప్రమాణాలను మెరుగుపర్చడం ద్వారా గణనీయమైన అభివృద్ధిని సాధించామని ఫుడ్ సేఫ్టీ కమిషనర్ సి.హరికిరణ్ పేర్కొన్నారు. అతి త్వరలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల నియామక ప్రక్రియను ప్రారంభించి పూర్తిస్థాయిలో సిబ్బందిని అందుబాటులోకి తీసుకొస్తామని వివరించారు.