రాష్ట్రంలో అన్నివర్గాల లో అసహనం పెరిగిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన కొంతమంది నాయకులు, కార్యకర్తలు సైకో మనస్తత్వంతో సాగిస్తున్న అరాచకాలు సామాన్య ప్రజానీకంలో ఆందోళన కలిగిస్తున్నాయి. వివిధ ప్రాంతాలలో రౌడీ మూకలు పేట్రేగిపోతున్నాయి. గంజాయి, మద్యం మత్తులో విచక్షణ కోల్పోయి వారు చేస్తున్న ఆగడాలు ఇటీవలికాలంలో వెలుగుచూస్తున్నాయి. దీనిని కేవలం శాంతిభద్రతల సమస్యగానే పరిగణించటానికి వీల్లేదు. దాని మూలాల ను కనుగొని నిర్మూలించాల్సిన అవసరం ఎంతైనా వున్నది. ఎక్కువ సందర్భాలలో ఈరకమైన ఆగడాలకు పాల్పడే వారు అధికార పార్టీకి చెందిన వారే వుండటంతో పోలీసు యంత్రాంగం సైతం నిస్సహాయంగా వుండి పోవలసి వస్తోంది. ఈ స్థితిలో సామాన్య ప్రజానీకంలో ఆలోచన మొదలైంది. రాష్ట్రంలో తిరిగి శాంతియుత వాతావరణం నెలకొనాలి అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావలసిన అవసరముందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.
టిడిపి అహయాంలో రౌడీ మూకల ఆగడాలను సమర్థంగా అరికట్టే విధంగా పోలీసు యంత్రాంగమూ వ్యవహరించింది. అంతేగాక హైదరాబాద్ మహానగరంలో గతంలో మతకలహాలు చోటుచేసుకుని, ఆ ఘర్షణల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు తరచూ చోటుచేసుకునేవి. అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం వాటిని సమర్థంగా నియంత్రించ గలిగారు. అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు శాంతిభద్రతల విషయంలో కటినంగా వ్యవహరించే వారు. ఫలితంగా అరాచక శక్తులకు కొమ్ము కాసేందుక అధికారంలో వున్న నాయకులైనా వెనుకంజ వేసేవారు. కానీ ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా వున్నాయి. బాధ్యతాయుత పదవులలో వున్న నాయకులే వివిధ రకాలైన నేరారోపణలు ఎదుర్కొంటున్నారు. బాహాటంగా సవాళ్లు విసురుతూ శాంతియుత వాతావరణానికి భంగం కలిగిస్తున్నారు. పలు సందర్భాలలో బాధితులపైనే కేసులు నమోదు చేసి వారిని ఇబ్బందులకు గురిచేచేస్తున్న సంఘటనలు తరచూ కానవస్తున్నాయి.
దేశంలో ఎక్కడా లేనివిధంగా ఒక రాజకీయ పార్టీ కేంద్ర కార్యాలయం మీద పట్టపగలే రౌడీ మూకలు దాడికి పాల్పడ్డాయి. రాష్ట్ర పోలీసు విభాగం కేంద్ర స్థానానికి కూతవేటు దూరంలో వున్న టిడిపి కేంద్ర కార్యాలయం పై దాడులకు తెగబడినప్పటికీ, దానిపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. అదేవిధంగా గన్నవరంలో టిడిపి కార్యాలయం పై రౌడీ మూకలు యధేచ్చగా దాడికి పాల్పదుతుంటే, దానిని నివారించాల్సిన పోలీసు సిబ్బందిలో కొంతమంది వారిని బ్రతిమాలాడుకుంటూ అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో హల్ చల్ చేశాయి. కార్యాలయం ధ్వంసం చేయటం తో పాటు అక్కడ వున్న వాహనాలకు సైతం నిప్పు పెట్టారు. కార్యాలయంపై దాడిని అడ్డుకోవటానికి వెళ్లిన నాయకులపై పోలీసులు కేసు నమోదు చేయటం విశేషం. ఆ సంఘటనలో ఇప్పటికీ కొంతమందికి బెయిల్ లభించలేదు.
అంతకు ముందు పల్నాడు జిల్లాలోని మాచర్ల లోనూ ఇదే పరిస్థితి. అన్నార్తుల ఆకలి తీరుస్తున్న అన్న క్యాంటీన్ లను సైతం ఇదే రీతిలో పలుచోట్ల ధ్వంసం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ ఏదో ఒక మూలన ఈ విధమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రెండేళ్ల క్రితం జరిగిన స్థానిక సంస్థల నుంచి గత నెలలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల వరకు అధికార పార్టీ అరాచకపర్వం కొనసాగింది. ఒకవైపు అడ్డూ ఆపు లేకుండా పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోలు, డీజిల్ ధరలు, విద్యుత్, బస్ చార్జీలు, వంట గ్యాస్ ధరలు బాదుడుతో సామాన్య ప్రజానీకం కుదేలైపోయింది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మృగ్యమై నిరుద్యోగ యువత దిక్కుతోచని స్థితిలో వుంది. ప్రతి ఒక్కరూ ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనే నైరాశ్యంలో వున్నారు. ఈ స్థితి లో కనీసం శాంతియుత వాతావరణం సైతం లేకపోవటం తో సామాన్యుని బతుకు దుర్భరమైంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి, చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రంలో తిరిగి సాధారణ శాంతియుత పరిస్థితులు నెలకొనగలవన్న భావన ప్రతి ఒక్కరిలో వ్యక్తమవుతున్నది.