అమరావతి,చైతన్యరథం: నిరుద్యోగ టీచర్లు గత మూడునెలలుగా ఎదురుచూస్తున్న ఎపి టెట్ ఫలితాలను మంగళవారం రాష్ట్ర విద్యా, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖా మంత్రి నారా లోకేష్ విడుదల చేశాను. ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేస్తూ ‘‘టెట్ లో అర్హత సాధిస్తేనే డిఎస్సీ రాసేందుకు అర్హులు కావడం, డిఎస్సీలో టెట్ మార్కులకు 20శాతం వెయిటేజి ఉండటంతో ఈ ఫలితాల కోసం రాష్ట్రవ్యాప్తంగా 2.35 లక్షలమంది నిరుద్యోగ టీచర్లు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. టెట్ లో అర్హత సాధించిన అభ్యర్థులకు నా శుభాకాంక్షలు. మన ప్రజాప్రభుత్వం ప్రకటించిన మెగా డిఎస్సీ కి అందరూ సన్నద్ధం కావాలని కోరుకుంటున్నాను. ఈ టెట్ లో క్వాలిఫై కాని అభ్యర్థులకు, కొత్తగా బిఈడి, డిఈడి పూర్తిచేసుకున్న వారికి అవకాశం కల్పిస్తూ త్వరలోనే టెట్ నిర్వహించబోతున్నాం. ఆ తరువాత మెగా డిఎస్సీ ఉండబోతుంది’’ అని పేర్కొన్నారు. కాగా మొత్తం 2,35,907 మంది టెట్ పరీక్ష రాయగా 1,37,004 మంది అంటే 58.4 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.