అమరావతి (చైతన్య రథం): రాజధాని అమరావతిలో చేపట్టాల్సిన పనులకు ఆమోదం తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఆర్డీఏ ఆమోదించిన 20 సివిల్ పనులకు ఆమోదముద్ర వేస్తూ మంగళవారం ఉత్తర్వులిచ్చింది. రాజధాని పరిధిలో చేపట్టనున్న 20 సివిల్ పనులకు రూ.11,467 కోట్ల మేర వ్యయం అవుతుందని ప్రభుత్వం పేర్కొంది. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు సంయుక్తంగా ఇవ్వనున్న రుణంతో ఈ పనులు చేపట్టేలా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారులు, ఉద్యోగుల నివాస అపార్ట్మెంట్లు, ఐఏఎస్ అధికారులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నివాసాల నిర్మాణం పూర్తికి నిధుల విడుదలకు ఆమోదం తెలిపింది. న్యాయమూర్తులు, మంత్రులు, సీనియర్ ఐఏఎస్ అధికారుల బంగ్లాల నిర్మాణం కోసం నిధుల మంజూరుకు ఆమోదముద్ర వేసింది. ప్రభుత్వ కాంప్లెక్స్ నిర్మాణంలో భాగంగా సచివాలయ టవర్లు, అసెంబ్లీ, రాజధాని పరిధిలో మౌలిక సదుపాయాల నిర్మాణానికి ఈ నిధుల్ని వెచ్చించాలని నిర్ణయించింది.
హ్యాపీనెస్టుకు రూ.984 కోట్లు
అమరావతిలో కొండవీటివాగు, పాలవాగు వెడెల్పు చేయటంతోపాటు శాఖమూరు, నీరుకొండ వద్ద రిజర్వాయర్ నిర్మాణం కోసం సీఆర్డీఏ రూ.1585 కోట్లు వెచ్చించనుంది. హ్యాపీనెస్ట్ ప్రాజెక్టులో భాగంగా 12 టవర్లుతో 1200 అపార్ట్మెంట్ల నిర్మాణం కోసం రూ.984 కోట్లు కేటాయించింది. రాజధాని పరిధిలో వరద నీటి కాలువలు, డ్రెయిన్లు, నీటి సరఫరా నెట్వర్క్, సీవరేజీ, యుటిలిటీ డక్టులు, పాదచారుల బాట, సైకిల్ ట్రాక్ ఏర్పాటుకు నిధులు వెచ్చించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.