- బయో సింథటిక్ ఉడ్, హైడ్రో ఫోయిల్ బోట్ల తయారీ కంపెనీల ఏర్పాటుకు సంసిద్ధత
- రూ. 300 కోట్లు పెట్టుబడి పెడతామని వెల్లడి
- మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డితో కంపెనీ ప్రతినిధులు భేటీ
- ముఖ్యమంత్రితో చర్చించి అన్నివిధాలా సహకరిస్తామన్న మంత్రి
అమరావతి(చైతన్యరథం): రాష్ట్రంలో బయో సింథటిక్ ఉడ్ తయారీ యూనిట్, హైడ్రో ఫోయిల్ బోట్లు తయారు చేసే కంపెనీలు ఏర్పాటు చేసేందుకు ఆరియా గ్లోబల్ సంస్థ ముందుకు వచ్చింది. ఈ కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంపత్ కుమార్ గురువారం రాష్ట్ర రోడ్లు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలశాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డిని సచివాలయంలోని ఆయన కార్యాలయంలో కలిశారు. సహజసిద్దమైన చెక్కకు ఏ మాత్రం తీసిపోని విధంగా ప్లాస్టిక్ వ్యర్థాల నుండి తయారు చేసే బయో సింథటిక్ ఉడ్‌ను తాము చేయారు చేస్తున్నామని మంత్రికి వివరించారు. ఇది ప్రాక్టికల్ గా అనేక చోట్ల విజయవంతమయిందని మంత్రికి తెలిపారు. ఈ బయో సింథటిక్ ఉడ్ వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదని పేర్కొన్నారు. వివిధ రంగాల్లో ఈ బయోసింథటిక్ వినియోగం వల్ల అడవుల సంరక్షణతో పాటు, నిర్వహణ ఖర్చు కూడా తగ్గించేందుకు అవకాశాలు ఉన్నాయని వివరించారు. అదేవిధంగా అధునాతన టెక్నాలజీతో హైడ్రో ఫోయిల్ బోట్లు తాము తయారు చేస్తున్నామని మంత్రికి తెలిపారు.
ఈ బోట్లను ఇండియన్ నేవీకి త్వరలో సరఫరా చేయడానికి ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయని, తుది నిర్ణయం నేవీ ఉన్నతాధికారుల పరిశీలనలో ఉందని పేర్కొన్నారు. ఈ బోట్లు తయారు చేసే కంపెనీని ఏపీలో నెలకొల్పి, ఇక్కడి నుండే బోట్లు తయారు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ బోట్లు సాధారణ బోట్ల కంటే వేగంగా, సురక్షితంగా ఉంటాయని పేర్కొన్నారు. ఇవి కోస్టల్ పెట్రోలింగ్ కు చాలా ఉపయోగకరమని వివరించారు. అందుకే ఇండియన్ నేవీ వీటిని తీసుకోవాలని చూస్తోందని తెలిపారు. ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందిస్తే రాష్ట్రంలో బయో సింథటిక్ ఉడ్ తయారీ, బోట్ల తయారీ కంపెనీలను రూ.300కోట్ల పెట్టుబడితో పెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మంత్రి జనార్ధన్ రెడ్డికి సంపత్ కుమార్ నివేదిక సమర్పించారు. దీనిపై మంత్రి జనార్ధన్ రెడ్డి స్పందిస్తూ…ఈ విషయాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళతామని తెలిపారు. ఉన్నతాధికారులతో మాట్లాడి కంపెనీలు పెట్టేందుకు పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టం చేశారు. మంత్రి స్పందన పట్ల సంపత్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు.