- జగన్‌రెడ్డి కుట్రలో పావుగా ఆర్.కృష్ణయ్య
- వ్యక్తిగత లబ్ది కోసం బీసీల్లో ఐక్యతను చెడగొట్టే ప్రయత్నం
- బీసీలకు జరగుతున్న అన్యాయంపై సమాధానం చెప్పగలరా?
- సిఎంకు కొల్లు రవీంద్ర బహిరంగ లేఖ
అమరావతి,చైతన్యరథం: సొంత రాష్ట్రంలోని బీసీలను ఆర్.కృష్ణయ్య గాలికి వదిలేశారని, ఆయనొక్కడి వ్యక్తిగత లబ్దికోసం జగన్‌రెడ్డి కుట్రలో పావుగా మారి ఏపీ బీసీల్లో ఐక్యత చెడగొట్టేందుకు దిగజారాడాని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు,మాజీ మంత్రి కొల్లు రవీంధ్ర ధ్వజమెత్తారు. నాలుగున్నరేళ్ల పాలనలో బీసీలకు అన్యాయం, దగా తప్ప చేసిందేంటి ప్రశ్నించారు. రాష్ట్రంలోని బీసీలు ఏం మంచి జరిగిందో ఆర్.కృష్ణయ్య గానీ, జగన్ రెడ్డి గానీ సమాధానం చెప్పగలరా అంటూ సిఎం జగన్‌రెడ్డికి కొల్లు రవీంద్ర బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో రూ.75,760 కోట్ల బీసీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించారని, ఆదరణ లాంటి 30కి పైగా బీసీ సంక్షేమ పథకాలు రద్దు చేశారని, రిజర్వేషన్లు 34% నుండి 24%కి తగ్గించి 16,800 రాజ్యాంగబద్ద పదవులు దూరం చేశారని, 14 లక్షల ఎకరాల అసైన్డ్ భూములు కబ్జా చేస్తున్నారని, అందులో అత్యధిక భాగం బీసీలవేనని తెలిపారు. 70వేలకు పైగా బీసీ బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయలేదని, 74 మంది బీసీలను హత్య చేశారని, వేల మందిపై తప్పుడు కేసులు పెట్టి, దాడులు చేసి వేధించారని చెప్పారు. 13 బీసీ భవనాలు, 1187 కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలను నిలిపివేశారని, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ రద్దుకు సుప్రీంకోర్టుకు వెళ్లి చీవాట్లు తిన్నారని, విదేశీ విద్య, పెళ్లి కానుకలు, చంద్రన్న బీమా వంటి పథకాలు రద్దు చేశారని చెప్పారు.
మద్యం ధరలు పెంచి, నాసిరకమైన మద్యం పోసి 35 లక్షల మంది ఆరోగ్యాన్ని పాడుచేసి, 30వేల మంది ప్రాణాలు తీసి వారి భార్యల మాంగళ్యాలు తెంచారని, మద్యం బాధితుల్లో అత్యధికులు బీసీలేనని, ధరలు, ఛార్జీల బాదుడుతో ఒక్కో కుటుంబంపై రూ.2.80లక్షల భారం వేశారని, రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వకపోవడంతో కేంద్ర నిధులు రూ.16వేల కోట్లు పోయాయని, 16 యూనివర్శిటీల్లో వీసీలుగా ఒక్కరే బీసి అని, మిగిలిన వాటిలో సొంత సామాజిక వర్గంతో నింపారని గుర్తు చేశారు. నామినేటెడ్ పదవుల్లో 90 శాతం సొంత వర్గమేనని, సలహాదారుల్లో ఒక్క బీసీ కూడా లేడని తెలిపాడు. అమరావతిలో 10 ఎకరాల్లో జ్యోతిరావుపూలే విగ్రహం, మెమోరియల్ ఏర్పాటును రద్దు చేశారని, 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసినా, నిధులు ఇవ్వకుండా వాటి ఛైర్మన్లను ఉత్సవ విగ్రహాలుగా మార్చారని తెలిపారు. టీడీపీకి చెందిన బీసీ నేతలు కింజరాపు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, చింతకాయల అయ్యన్న పాత్రుడు, కిమిడి కళా వెంకట్రావు, కొల్లు రవీంద్ర, బీదా రవిచంద్ర యాదవ్, కాలవ శ్రీనివాసులు, బండారు సత్యన్నారాయణమూర్తి, కూన రవికుమార్, పల్లా శ్రీనివాస్ యాదవ్, ఆదిరెడ్డి అప్పారావు కుటుంబం, పంచుమర్తి అనురాధ, గౌతు శిరీష లాంటి వారిపై కేసులు పెట్టి వేధించారని తెలిపారు. పైన పేర్కొన్న అంశాలన్నింటిపై సిఎం జగన్ గానీ, ఆర్.కృష్ణయ్య గానీ సమాధానం చెప్పగలరా అని కొల్లు రవీంద్ర ప్రశ్నించారు.