- నాల్గవ రోజూ అవిశ్రాంత పర్యటన
- వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు
- ఇళ్ల వద్దకు వెళ్లి ధైర్యం చెప్పిన ముఖ్యమంత్రి
- ప్రభుత్వ సాయంపై ఆరా తీసిన వైనం
- ఆహారం, నీళ్లు, పాలు, పండ్లు అందాయన్న బాధితులు
- నిత్యవసరాలూ అందిస్తానని సీఎం హామీ
- పరిస్థితులు చక్కదిద్దేవరకూ విజయవాడలోనే..
- బాధితులకు సీఎం చంద్రబాబు భరోసా
విజయవాడ (చైతన్య రథం): వదర ప్రభావిత ప్రాంతాల్లో నాల్గవ రోజు బుధవారం కూడా సీఎం చంద్రబాబు విస్తృతంగా పర్యటించారు. బాధితుల ఇళ్లవద్దకు నేరుగా వెళ్లి వారిని పలకరించి ధైర్యం చెప్పారు. ఇప్పటికీ తీవ్రతవున్న కొన్ని ప్రాంతాల్లో వరద నీరు ఉండటంతో జేసీబీపైనే తిరిగారు. కలెక్టర్లు, మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం మధ్యాహ్నం కలెక్టరేట్ నుండి బయలుదేరి సింగ్‌నగర్ ఫ్లైఓవర్, జక్కంపూడి వెళ్లేమార్గం గుండా పైపుల రోడ్డు, వాంబే కాలనీల్లో పర్యటించారు. ఇందిరమ్మ కాలనీ వాసులనుంచి ఇబ్బందులు అడిగి తెలుసుకుకున్నారు. అక్కడినుండి అజిత్‌సింగ్ నగర్, జీఎం టవర్ వద్దకు చేరుకుని బాధితులతో మాట్లాడారు. పాలు, ఆహారం, నీళ్లు అందాయా? అని బాధితులను ఆరా తీశారు. ఉదయాన్నే అల్పాహారం, మధ్యాహ్నం భోజనంతోపాటు పళ్లు అందాయని సీఎంకు వరద బాధితులు తెలిపారు. ఇళ్లలో బురద చేరి ఇబ్బందులు పడుతున్నామని సీఎంతో మహిళలు చెప్పగా… ఫైర్ ఇంజన్లతో ఇళ్లన్నీ క్లీన్ చేయించే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. ఎవరూ అధైర్య పడొద్దని భరోసా కల్పించేందుకే నాలుగు రోజులుగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నాని తెలిపారు. గురువారం నుంచి నిత్యావసర సరకులు కూడా అందిస్తామని, ప్రతి ఒక్కరినీ ఆదుకునే బాధ్యత తనదని భరోసానిచ్చారు. జీఎం టవర్ వద్ద పలువురు వస్త్ర, షోరూం నిర్వహకులు కలిసి తమ సమస్యను విన్నవించుకున్నారు. షాపుల్లో వస్త్రాలు, ఇతర సామాగ్రి అంతా పాడైపోయిందని, తాము అన్ని విధాలా నష్టపోయామని వాపోయారు. మిమ్మల్ని ఆదుకోవాలన్న ఉద్దేశ్యంతోనే ఇప్పటికే 23 బీమా సంస్థలతోనూ చర్చిస్తున్నామని, ఏ విధంగా ఆదుకోవాలో చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. పరిస్థితులన్నీ చక్కదిద్ది అందరినీ యధాస్థితికి తీసుకొచ్చాకే విజయవాడ నుండి తాను కదులుతానని బాధితులకు సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు.