అమరావతి(చైతన్యరథం): అధికారులు బాధ్యతతో వ్యవహరించాలని, ప్రజలకు జవాబుదారీగా ఉండాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. గురువారం నాడు వెలగపూడిలోని సచివాలయంలో సాంఘిక సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ, ఉద్యోగాల నియామకాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితర అంశాలపై అధికారులతో మంత్రి చర్చించారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ నియామకాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలుపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని మంత్రి సూచించారు. అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉంటూ, వచ్చిన ప్రతి ఫిర్యాదు ను పరిష్కరించాలని అన్నారు. ప్రజలు ఇచ్చిన ఫిర్యాదు ఏ స్థాయిలో ఉందో తెలిపేలా, వారికి సమాచారం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఉద్యోగుల సమస్యలు తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని మంత్రి అన్నారు. ఈ సమీక్ష సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి కె హర్షవర్ధన్, తదితరులు పాల్గొన్నారు