- రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశాలపై చర్చ
- వాణిజ్య, పారిశ్రామిక వర్గాలకు అనుకూల వాతావరణం సృష్టిస్తామన్న చంద్రబాబు
అమరావతి: బెల్జియం దేశానికి చెందిన వాణిజ్య, పరిశ్రమల ప్రతినిధుల బృందం సచివాలయంలో మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో భేటీ అయింది. భారత్ లో బెల్జియం రాయబారి దిదీర్ వాండెర్ హాసెల్ట్ నేతృత్వంలో వచ్చిన బెల్జియం బృందం చంద్రబాబుతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలపై చర్చించింది. దీనిపై చంద్రబాబు సోషల్ మీడియా ద్వారా స్పందించారు. బెల్జియం రాయబారి వాండెర్ హాసెల్ట్ నాయకత్వంలో వచ్చిన వాణిజ్య, పరిశ్రమల ప్రతినిధుల బృందంతో సమావేశమయ్యానన్నారు. ఏపీలో వ్యాపార వర్గాలకు అనుకూలంగా ఉండే వాతావరణాన్ని సృష్టించేందుకు మా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపారవేత్తలను ఆహ్వానిస్తున్నామని సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. ఈ మేరకు బెల్జియం బృందంతో సమావేశం తాలూకు ఫొటోలను కూడా చంద్రబాబు పంచుకున్నారు.