అమరావతి(చైతన్యరథం): వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి సత్యకుమార్ యాదవ్ బుధవారం శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖను మరింత బలోపేతం చేసేందుకు సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. అధికారులు పూర్తిస్థాయిలో పారదర్శకంగా పనిచేయాలని సూచించారు. మరింత మెరుగైన సేవలు అందించేందుకు విధుల్లో ఎలాంటి రాజకీయ ఒత్తిడులకూ తలొగ్గవద్దన్నారు. ప్రజలకు పూర్తి స్థాయిలో సేవలందించడమే ప్రధానమన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేయాలని సూచించారు. 2014-19లో అమలు చేసిన పథకాలు, కార్యక్రమాలను అధికారులు మంత్రికి వివరించారు.
కూటమి ప్రభుత్వం ప్రజల అభీష్టానికనుగుణంగా పనిచేయాలని నిర్ణయించుకున్నందున ఆ దిశగా అధికారులు అడుగులు వేయాలని మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి మంజుల, కమిషనర్ సి.హరికిరణ్, ఏపీఎంఎస్ ఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్, ఎన్టీఆర్ వైద్యసేవ సీఈవో జి.లక్ష్మీషా, సెకండరీ హెల్త్ డైరెక్టర్, ఏపీ శాక్స్ పీడీ అట్టాడ సిరి, డీఎంఈ నరసింహం, ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ పద్మావతి, జాయింట్ డైరెక్టర్ బి.వి.రావు, డీడీలు అప్పారావు, గణపతిరావు, రాజశేఖర్‌రెడ్డి, ప్రకాశరావు, సెకండరీ హెల్త్ జాయింట్ కమిషనర్ రమేష్ పాల్గొన్నారు.