- ఎయిర్‌పోర్టు నిర్మాణంతో కలిసిపోనున్న విశాఖపట్నం, విజయనగరం
- 2026 జూన్ నాటికి గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ పూర్తి
- ఫేజ్-1లో భోగాపురం వరకు బీచ్ రోడ్డు, ఫేజ్-2లో శ్రీకాకుళం, ఫేజ్-3లో మూలపేట పోర్టు వరకు రోడ్డు నిర్మాణం
- ఎకనమిక్ హబ్‌గా, పారిశ్రామిక నగరంగా మారనున్న భోగాపురం
- 45 లక్షల ప్రయాణికులకు సేవలు అందించేలా ఎయిర్‌పోర్టు ప్రారంభం
- భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి
- నిర్మాణ పనులపై ప్రజెంటేషన్ ఇచ్చిన జీఎంఆర్ ప్రతినిధులు
భోగాపురం,విజయనగరం(చైతన్యరథం): ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం విమానాశ్రయం అత్యంత కీలకం కానుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ ఎయిర్‌పోర్టుతో భవిష్యత్‌లో విశాఖపట్నం, విజయనగరం కలిసిపోతాయి.. ఇక్కడ నుంచి శ్రీకాకుళం కూడా కలిసే అవకాశం ఉందన్నారు. అటు శ్రీకాకుళం 50 కిలోమీటర్లు, ఇటు విశాఖపట్నం 50 కిలోమీటర్లు..మధ్యలో ఈ ఎయిర్‌పోర్టు వస్తోందన్నారు. ఫేజ్-1లో భోగాపురం వరకు బీచ్ రోడ్డు, ఫేజ్-2లో ఇంకో 50 కిలోమీటర్లు శ్రీకాకుళం వరకు, ఫేజ్-3లో మూలపేట పోర్టు వరకు రోడ్డు నిర్మాణం జరుగుతుంది. దీంతో మూలపేట నుంచి సమాంతర హైవే, బీచ్ రోడ్డు ఇప్పుడున్న హైవేకు అనుసంధానమైతే, మధ్యలో కొన్ని కనెక్టివిటీలు పెట్టుకుంటే పారిశ్రామికాభివృద్ధికి ఇదొక అద్భుత నగరంగా మారుతుంది. మరే నగరం, ప్రాంతం కూడా దీనికి సాటిరావు. ఎప్పట్నుంచో చెబుతున్నా.. ఇదే నా కల. దానిని ఇప్పుడు సాకారం చేసుకునే అవకాశం వచ్చిందన్నారు. విజయనగరం జిల్లా భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణ పనులకు గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. ఎయిర్‌పోర్టు నిర్మాణ సంస్థ జీఎంఆర్ ప్రతినిధులు ఈ సందర్భంగా నిర్మాణపనులపై ముఖ్యమంత్రికి ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడారు.
రూ.4,700 కోట్లతో ఫేజ్-1 ప్రారంభం
ఈ ఎయిర్‌పోర్టును చూస్తే.. 2015, మే 20న రాష్ట్రంలోని అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 2016, అక్టోబర్ 7న కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది. దీనికి అప్పట్లో 2,700 ఎకరాలు కావాలని అనుకున్నాం. 2,700 ఎకరాలు సేకరించాం. 2023 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అయితే వైసీపీ అధికారంలోకి రావటంతో మొత్తం నాశనం చేశారు. మొత్తం ప్రాజెక్టుతో ఆటలాడుకున్నారు. ఇప్పుడు పరిస్థితి మొదటికి వచ్చింది. ఒక 500 ఎకరాలు తీసుకోవడం, లేనిపోని సమస్యలు సృష్టించారు. శంకుస్థాపన చేసిన దానికి మళ్లీ శంకుస్థాపన చేశారు. మొత్తానికి వారి పిల్ల చేష్టలు, పిచ్చి చేష్టలతో ప్రాజెక్టును అతలాకుతలం చేశారు. నేటివరకు 31.8 శాతం పనులు పూర్తయ్యాయి. నేను ఎయిర్ పోర్టు నిర్మాణ పనులపై సమీక్ష చేశాను. యాదృచ్ఛికంగా ఉత్తరాంధ్ర బిడ్డ రామ్మోహన్ నాయుడు కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రిగా ఉన్నారు. ఈ ప్రాజెక్టు కట్టేవాళ్లు, డెవలపర్ కూడా ఉత్తరాంధ్ర వాళ్లే. ఈ ప్రాంతం అభివృద్ధి ధ్యేయంగా ఇద్దరూ కలిసి దీనిని వేగంగా పూర్తి చేయాల్సి ఉంది. ప్రస్తుతం విశాఖపట్నం ఎయిర్‌పోర్టు ఏడాదికి 28 లక్షల మిలియన్ ప్రయాణికులకు సేవలు అందిస్తోంది. భోగాపురం ఎయిర్‌పోర్టు 45 లక్షల ప్రయాణికులకు సేవలు అందించేలా స్టార్ట్ అవుతుంది. రూ.4,700 కోట్లతో ఫేజ్-1 ప్రారంభిస్తున్నారు. 2200 ఎకరాలు ఎయిర్‌పోర్టు ఆధీనంలో ఉన్నాయి. మరో 500 ఎకరాలు కూడా ఇవ్వడానికి ఆమోదం తెలుపుతున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు.
ఎకనమిక్ హబ్‌గా భోగాపురం
భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రణాళికపై స్పష్టమైన యాక్షన్ ప్లాన్ రూపొందించుకోవాలి. ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తారు.. ఏ యాక్టివిటీస్ తీసుకొస్తారు.. ఎలా అభివృద్ధి చేస్తారనే దానిపై నిర్మాణసంస్థ నుండి నివేదిక కోరాం. ఈ ఎయిర్‌పోర్టు పూర్తయితే ఒడిశాలోని రాయగఢ్, కోరాపూట్, మల్కన్‌గిరి, మన రాష్ట్రంలోని ఈస్ట్‌గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి ప్రాంతాలకు అనుసంధానం ఏర్పడుతుంది. సమీక్ష సందర్భంగా కొన్ని చిన్న చిన్న సమస్యలను కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. ఒకటి నేషనల్ హైవే నుంచి 6 కిలోమీటర్ల మేర రోడ్ కనెక్టివిటీ, పాత నేషనల్ హైవేలో 12 చోట్ల కనెక్టివిటీ, జంక్షన్లను అభివృద్ధి చేయాలి. ఏ ఎయిర్‌పోర్టుకైనా కనెక్టివిటీ చాలా ముఖ్యం. హైదరాబాద్‌కు ఔటర్ రింగ్ రోడ్డు తీసుకొచ్చాం. ఔటర్ రింగ్ రోడ్డు వల్ల ఎక్కడ నుంచి బయలుదేరినా నేరుగా విమానాశ్రయానికి చేరుకోవచ్చు. ఈ భోగాపురం ఎయిర్‌పోర్టును కూడా అదేవిధంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. దీంతో ఈ ప్రాంతం ఒక ఎకనామిక్ హబ్ గా తయారవుతుంది. ఇక్కడి యువత ఉద్యోగాల కోసం వేరే ప్రాంతాలకు వెళ్లే పరిస్థితులు రావు. గతంలో అలాంటి ప్రాజెక్టులు చాలా చేశామని సీఎం చంద్రబాబు అన్నారు.
ఉత్తరాంధ్ర రుణం తీర్చుకుంటాం
ఈ రోజు నేను ఇక్కడకు ప్రధానంగా వచ్చింది కూడా ఇక్కడి ప్రజలకు ఒక సందేశం ఇవ్వాలనే. మా ఎన్డీఏ కూటమికి ఉత్తరాంధ్ర ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఓట్ల వర్షం కురిపించారు. రాష్ట్రమంతా సునామీ, ఆ సునామీలో నెంబర్ వన్ ఉత్తరాంధ్ర. ఎప్పుడూ కూడా ఓట్లు వేసిన వర్గాలను, ప్రాంతాలను మర్చిపోవడం సబబు కాదు. అందరికీ న్యాయం చేస్తాం కానీ ఉత్తరాంధ్రకు అదనంగా చేయాల్సి ఉంది. ఆ నమ్మకం కూడా ఇక్కడి ప్రజలు మామీద పెట్టుకున్నారు. నా పర్యటనల షెడ్యూల్ కూడా మీరు చూస్తే జిల్లాల పర్యటనలో మొదటగా ఉత్తరాంధ్రకే వచ్చాను. తర్వాత రాయలసీమకు వెళ్తున్నాను. నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను. నిర్మాణసంస్థ 2026 జూన్ నాటికి పూర్తి చేస్తామంటున్నారు. నేను ఇంకా ముందే పూర్తి చేయమంటున్నాను. అందుకు పూర్తిగా సహకరిస్తాం. ఈ ప్రాజెక్టును పరిగెత్తిస్తాం. రామ్మోహన్ నాయుడికి చెప్పాను.. నేను పోలవరాన్ని ఎలా అయితే రెగ్యులర్‌గా సమీక్షిస్తానో, మీరు కూడా అలా చేయమని కోరాను. అన్నీ సిద్ధంగా ఉన్నాయి.. దీనిని పూర్తి చేసే బాధ్యత తీసుకోవాలి. విమానాయానశాఖ మంత్రిగా మీ అనుభవం కూడా ఉపయోగపడుతుంది. అన్ని ఎయిర్‌పోర్టులను చూసినతర్వాత యూజర్స్ ఫ్రెండ్లీ, లేటెస్ట్ టెక్నాలజీస్‌తో ఒక మోస్ట్ మోడరన్ ఎయిర్‌పోర్టు.. విశాఖపట్నానికి రావాలి.. అందుకు అనుగుణంగా పనిచేయాలని కోరినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు.
ఇది ప్రారంభం మాత్రమే..
మొదట ఎయిర్‌పోర్టును జీఎంఆర్ సంస్థకు ఇచ్చినప్పుడు చాలా పరీక్షలు చేశాను. 20-30 నమూనాలు తయారు చేశారు. అప్పుడే దేశంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టులు వచ్చాయి. హైదరాబాద్‌తో ప్రారంభమైన తర్వాత ఈ సంస్థ అభివృద్ధి చెందింది..తద్వారా దేశం అభివృద్ధి చెందింది. అభివృద్ధికి మూలకంగా, గ్రోత్ ఇంజన్‌గా విమానాశ్రయాల డెవలప్ రూల్ తయారైంది. అవసరమైతే మళ్లీ వస్తాను. భోగాపురం ఎయిర్‌పోర్టుకు సమాంతరంగా రాష్ట్రంలో మరో 5-6 ఎయిర్‌పోర్టులు వస్తాయి. కుప్పం, దగదర్తి, నాగార్జునసాగర్ అలాగే మూలపేట కూడా ఆలోచిస్తున్నాం. ఇది ప్రారంభం మాత్రమే.. విశాఖపట్నం రుణం తీర్చుకుంటాం. వీళ్లు చూపించిన అభిమానానికి ఎన్ని సమస్యలున్నా సపోర్ట్‌గా ఉంటాం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి కూడా పూర్తి సపోర్ట్‌గా ఉండే ప్రాంతమిది. అందుకే టీడీపీ, బీజేపీ, జనసేన కలిసిన తర్వాత ఒక సునామీ సృష్టించారు. చారిత్మ్రాతక విజయం లభించింది. చాలా సంతోషంగా ఉందని చంద్రబాబు అన్నారు.