- ఎయిర్‌పోర్టు నిర్మాణంతో 6 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు
- ఉత్తరాంధ్రకు గుండెకాయ భోగాపురం ఎయిర్‌పోర్టు
విజయనగరం(చైతన్యరథం): ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధిలో ఎంతో కీలకమైన, ఈ ప్రాంతానికి గుండెకాయ వంటి భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మాణాన్ని 2026 నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తిచేయాలని నిర్మాణ సంస్థ జీఎంఆర్ ప్రతినిధులను కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆదేశించారు. ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులను మంగళవారం పరిశీలించిన ఆయన ఎయిర్‌పోర్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ శాఖల ద్వారా అవసరమైన అనుమతులన్నీ సత్వరమే మంజూరుచేసి పూర్తి సహకారాన్ని అందజేస్తామని చెప్పారు. నిర్ణీత కాలవ్యవధిలో ఈ విమానాశ్రయ పనులను పూర్తిచేసేందుకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు చెప్పారు. డిసెంబరు 2026 నాటికి పూర్తిచేయాల్సి వుండగా గడువు కంటే 6 నెలల ముందుగా పూర్తిచేయాలని జీఎంఆర్ సంస్థను కోరారు. ఎయిర్‌పోర్టు నిర్మాణంతో 6 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు.
ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాలవారు కూడా ఇక్కడికే వస్తారు. దీన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోగలిగితే, భవిష్యత్తులో ఉత్తరాంధ్రకు ఎన్నో కంపెనీలు వస్తాయని తెలిపారు. గత ప్రభుత్వం నిర్మాణం పూర్తి చేయలేక, గడువులు పెంచుకుంటూ పోయిందని, కానీ తాము అధికారంలోకి వచ్చాక మొదటి నెలలోనే ప్రాజెక్టును సందర్శించి, గడువు తేదీ చెబుతున్నామని, ఈ విషయాన్ని తాము ఓ బాధ్యతగా తీసుకుంటున్నామని రామ్మోహన్ నాయుడు వివరించారు. ప్రస్తుత విశాఖ ఎయిర్‌పోర్టు ద్వారా ఏడాదికి 28 లక్షల మంది ప్రయాణిస్తుండగా 2026 నాటికి కొత్తగా ప్రారంభించే భోగాపురం ఎయిర్‌పోర్టు ద్వారా ప్రారంభంలోనే 50 లక్షల మంది ప్రయాణిస్తారని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. ఈ విమానాశ్రయాన్ని 60 లక్షల మంది ప్రయాణించే సామర్ధ్యంతో నిర్మిస్తున్నామని చెప్పారు. ప్రయాణికులతో పాటు 50వేల టన్నుల కార్గో హ్యాండ్లింగ్ చేసే విధంగా కార్గో టెర్మినల్ కూడా నిర్మిస్తున్నట్టు చెప్పారు. ఎయిర్‌పోర్టుతోపాటు ఎం.ఆర్.ఓ. విభాగం కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు.
దేశంలోనే నెంబర్‌వన్ ఎయిర్‌పోర్టుగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని రూపొందించే దిశగా కృషిచేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఈ ఎయిర్‌పోర్టును సమీప ప్రాంతాల నుంచి అనుసంధానం చేసి త్వరగా, సులభంగా చేరుకునే విధంగా కనెక్టివిటీ రోడ్లను కూడా నిర్మించనున్నట్టు తెలిపారు. కేంద్ర పౌరవిమానయాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మంగళవారం తొలిసారిగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన రామ్మోహన్ నాయుడుకు ఎయిర్ పోర్టు ట్రంపెట్ వద్ద స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, జీఎంఆర్ సంస్థ ప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. అనంతరం విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి, విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి గజపతిరాజు, జిల్లా కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్, జాయింట్ కలెక్టర్ కెే కార్తీక్ లతో కలసి రామ్మోహన్ నాయుడు విమానాశ్రయ నిర్మాణం పనులను పరిశీలించారు.
ముందుగా ట్రంపెట్ నిర్మాణం, జాతీయ రహదారి నుంచి ఎయిర్‌పోర్టు అనుసంధాన రోడ్డు నిర్మాణం గురించి, అందుకు అవసరమైన భూసేకరణపై కేంద్ర మంత్రికి జిల్లా కలెక్టర్ అంబేద్కర్, జాతీయ రహదారుల సంస్థ అధికారులు వివరించారు. అనంతరం ఎయిర్‌పోర్టు టెర్మినల్ భవనం నిర్మాణం పనులను పరిశీలించారు. నిర్మాణం పనులపై ఏర్పాటు చేసిన ప్రజంటేషన్ను పరిశీలించారు. రన్‌వే పనులను కూడా కేంద్ర మంత్రి పరిశీలించారు. ఈ పర్యటనలో రెవిన్యూ డివిజనల్ అధికారి ఎంవీ సూర్యకళ, జీఎంఆర్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మన్మోయ్ రాయ్, ప్రాజెక్టు హెడ్ బీహెచ్ఏ రామరాజు, తదితరులు పాల్గొన్నారు.