అమరావతి (చైతన్య రథం): విజయనగరం జిల్లా గుర్లలో డయేరియా కేసులపై శాసన మండలిలో స్వల్ప వాగ్వాదం జరిగింది. బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందంటూ మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ చేసిన విమర్శలను మంత్రి అచ్చెన్నాయుడు తిప్పికొట్టారు. ప్రభుత్వం తరపున ఇంకా పర్యవేక్షణ లోపం ఉందని బొత్స ఆరోపించారు. మృతుల విషయంలో స్పష్టత లేదన్నారు. అనంతరం అచ్చెన్నాయుడు స్పందిస్తూ గత ఐదేళ్లలో వాటర్ ట్యాంక్లలో పిడికెడు బ్లీచింగ్ కూడా వేసిన సందర్భాలు లేవన్నారు. పంచాయతీలకు పైసా నిధులు కేటాయించకపోగా.. కేంద్రం ఇచ్చిన వాటినీ దారిమళ్లించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రూ.4వేల కోట్లతో పంచాయతీలను బలోపేతం చేసే చర్యలు చేపట్టిందన్నారు. గుర్ల ప్రాంతానికి ఇన్నాళ్లూ ప్రాతినిధ్యం వహిస్తున్నందున తనవల్ల కూడా ఇది జరిగిందని ఒప్పుకోవాలని బొత్సకు అచ్చెన్న హితవు పలికారు.