- అసత్యాలను ప్రచారం చేయడం తొలి ఎత్తు
- దానిపై ప్రశ్నలు సంధించడం మలి ఎత్తు
- జారుడుమెట్ల రాజకీయంలో జగన్ దిట్ట
- మెడికల్ కాలేజీల యాగీ అందులో భాగమే..
- ఐదేళ్లలో రాష్ట్రానికి ద్రోహం చేసిందే జగన్..
- వైసీపీ అసమర్థ విధానాలే అందుకు నిదర్శనం
- ప్రజా ప్రభుత్వంపైకి నెపం నెడుతూ ప్రచారం
అమరావతి (చైతన్య రథం): రాష్ట్రంలో చిత్రమైన రాజకీయం నడుస్తోంది. కనీసం ప్రతిపక్ష హోదాలేని 11మంది ఎమ్మెల్యేల పార్టీ.. కుట్ర రాజకీయలకు పదేపదే పదునుపెడుతుంది. ముందుగా ప్రభుత్వంపై విష ప్రచారాన్ని సాగించి.. తరువాత ప్రభుత్వమే ప్రజలకు ద్రోహం చేస్తున్నట్టు ప్రశ్నలు సంధించి.. ప్రభుత్వం వాటికి సమాధానం చెప్పకపోతే ఆ ద్రోహం నిజమేనంటూ మరోసారి ప్రచారంలోకి తేవడం.. ఇదీ వైసీపీ సాగిస్తోన్న సరికొత్త కుట్ర రాజకీయం. మెడికల్ కాలేజీలు, అదనపు సీట్ల సాధన విషయంలో.. వైసీపీ విషపుత్రిక సాక్షి వేదికగా కొద్దిరోజులుగా సాగుతోన్న దగుల్బాజీ రాజకీయమిదే. ఇలాంటి భ్రష్ట రాజకీయ చర్యలతోనే జగన్‌రెడ్డి తన అజ్ఞానాన్ని తానే బయటపెట్టుకుంటున్నాడు. రాష్ట్ర ప్రభుత్వంపై విషంజిమ్మడం తప్ప.. తనలో విషయంలేదని పదేపదే నిరూపించుకుంటున్నాడు. రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలు, అదనపు సీట్లపై అదేపనిగా చేస్తోన్న యాగీ.. జగన్ రాజకీయ కుట్రపూరిత ఆలోచనలను తేటతెల్లం చేసేదే. ఐదేళ్లుగా రాష్ట్రంలో తాను సృష్టించిన విధ్వంసాన్ని.. ఐదు రోజుల్లో కొత్త ప్రభుత్వం చక్కదిద్దాలన్న బుర్రతక్కువ వితండ వాదనలను ప్రచారంలోకి తేవడం జగన్ పైశాచిక రాజకీయాలకు పరాకాష్ట. ఐదేళ్లపాటు ఏపీవాసులకు తాను రుచి చూపించిన దుర్మార్గపు పాలననే ఎన్డీయే సర్కారూ అనుసరించాలని.. లేదంటే చంద్రబాబు ప్రభుత్వం అత్యంత దుర్మార్గపాలన చేస్తున్నట్టేనన్న పిచ్చి వాదనలకు పదును పెట్టడం.. జగన్ మానసిక అస్థిమితానికి నిదర్శనం.
పక్క రాష్ట్రాలు కొత్త మెడికల్ కాలేజీలు, ఎంబీబీఎస్ సీట్ల కోసం ప్రదక్షిణలు చేస్తున్న పరిస్థితుల్లో మన రాష్ట్రానికి వచ్చిన సీట్లను తిప్పిపంపడం ఏ తరహా పరిపాలనకు నిదర్శనమంటూ జగన్ ప్రశ్నించడం వెనుక కుట్ర రాజకీయమే కనిపిస్తోంది. నిజానికి ఆ ప్రశ్న జగన్‌కు జగనే వేసుకోవాలి. ప్రజలకు సమాధానం చెప్పాల్సింది కూడా జగనే. వైసీపీ ప్రభుత్వ హయాంలోనే అంటే.. 2020లోనే కేంద్రం 17 వైద్య కళాశాలలను రాష్ట్రానికి మంజూరు చేసింది. ఐదేళ్లు అధికారంలో ఉండి మెడికల్ కాలేజీల నిర్మాణాలు పూర్తి చేయలేకపోయిన అసమర్థ జగన్.. అధికారంలోకి వచ్చి మూడు నెలలు కూడా కాని ప్రభుత్వాన్ని ప్రశ్నించడం చిత్రాల్లోకెల్లా విచిత్రం. గద్దెనెక్కిన కొత్త ప్రభుత్వం మెడికల్ సీట్ల భర్తీ విషయంలో ఇంకా ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోకముందే.. సీట్లను అమ్మకానికి పెట్టారంటూ అభూత కల్పనలు, అసత్యాలను విషపుత్రిక సాక్షిలో ప్రచారానికి పెట్టింది జగన్‌రెడ్డే.
ప్రజలు, ప్రభుత్వం మధ్య అగాథాన్ని సృష్టించాలనుకుట్ర పారలేదు. అయినా కుట్రవీడకుండా.. ప్రభుత్వంపై బురదచల్లే ప్రయత్నాలకు అదేపనిగా పురిపెడుతూ వచ్చాడు. మెడికల్ కాలేజీల్లో సీట్ల భర్తీపై ఏవిధమైన పాలసీ అనుసరించాలన్న అంశంపై ప్రభుత్వం ఇకా అధ్యయనాల దశలో ఉన్నపుడే.. సీట్లు అమ్మకానికి పెడుతున్నారంటూ పైశాచిక ప్రచారాన్ని గావించింది జగన్‌రెడ్డే. జగన్‌రెడ్డి పిచ్చి ప్రచారాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో.. అహం దెబ్బతిన్న జగన్ మరో అబద్ధానికి తెరలేపాడు. తాజాగా, ఎన్డీయే సర్కారు మెడికల్ కాలేజీలనే అమ్మకానికి పెట్టినట్టు తప్పుడు కథనాలను ప్రచారంలోకి తేవడం క్షమించరాని దుర్మార్గం. సార్వత్రిక ఎన్నికలలో ప్రజలిచ్చిన ఘోర పరాభవాన్ని మానసికంగా తీసుకోలేకపోతున్న వైసీపీ నేత జగన్‌రెడ్డి.. కొత్త ప్రభుత్వం తన పాలసీని ప్రకటించకముందే విషపూరిత పాలసీలను ప్రచారంలోకి పెట్టడం.. ప్రభుత్వం ప్రజాద్రోహం చేస్తుందంటూ అసత్యాలను గుప్పించడం రివాజుగా మారింది.
నిజానికి `మెడికల్ కాలేజీలు మంజూరు చేసింది కేంద్రం. మెడికల్ కాలేజీలు కట్టేదీ కేంద్రమే. కేంద్రం పాలసీ ప్రకారం.. కళాశాలల నిర్మాణానికి 60 శాతం నిధులు కేంద్రమే ఇస్తుంది. కేంద్ర ప్రాయోజిత పథకం కింద ఒక్కో కళాశాల ఏర్పాటుకు రూ.195 కోట్ల చొప్పున కేంద్రం రాష్ట్రానికి ఇస్తోంది. కానీ, రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు తానే తెచ్చినట్టు.. తన జేబునుంచే నిర్మించేసినట్టు ఇప్పటి వరకూ జగన్ డబ్బాలు కొట్టుకున్నాడు. జగన్ చెప్తున్నట్టు 17 మెడికల్ కాలేజీల్లో.. 80శాతంమేర పనులు పూర్తైన కాలేజీలు 5 మాత్రమే. పాడేరు, పులివెందుల, మదనపల్లి, ఆదోని, మార్కాపురం. ఐదేళ్ల జగన్ పాలనా కాలంలో మిగతా 12 కాలేజీలు పునాదులస్థాయి కూడా దాటలేదు. కాలేజీ భవనాలు కట్టలేదు. విద్యార్థులకు హాస్టల్ భవనాల నిర్మాణాలు సాగలేదు. బోధన, భోధనేతర సిబ్బందిని నియమించలేదు. ఇవన్నీ చేయకుండా.. అనుమతులు ఎవరిస్తారు? ఎలా ఇస్తారన్న ఆలోచన జగన్‌కు లేదు. ఇవేమీ లేకుండానే.. 17 మెడికల్ కాలేజీలు కట్టేసినట్టు.. అందులో సీట్లు కొత్త ప్రభుత్వ అమ్మేసుకుంటున్న అసత్య ప్రచారాలు సాగించడం జగన్ మార్క్ రాజకీయం. 20-30 శాతం పనులు కూడా పూర్తవ్వని భవనాలను పూర్తి చేయాలంటే, సిబ్బందిని నియమించుకుని అడ్మిషన్లకు రెడీ అవ్వాలంటే, రెండేళ్ల పైనే పట్టినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు రూ.8,480 కోట్లు అవసరమని కేంద్రానికి నివేదించింది గత ప్రభుత్వం. ఇందులో 60 శాతం నిధులు నాబార్డు, సీఎస్‌ఎస్, కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక నిధినుంచి వస్తాయి. తాజా లెక్కల ప్రకారం.. ఐదేళ్లకాలంలో 25శాతం పనులే పూర్తిచేసింది జగన్ సర్కారు. అంటే, రూ.2,120 కోట్ల పనులు పూర్తి చేసి, రూ.1,451 కోట్లు చెల్లింపులే జరిపింది. పీజీ వైద్య సీట్ల కేటాయింపులకు తగ్గట్టు కేంద్రమిచ్చిన రూ.700 కోట్లనూ జగన్ సర్కారు దారి మళ్లించుకోవడమే.. అసలు వివాదానికి కారణం. కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేపట్టకపోవడంతో నిర్మాణ పనులు ఆపేశారు. భవనాల పనులు పూర్తికాకపోవడం, ఫ్యాకల్టీని సిద్ధం చేసుకోలేకపోవడంతో.. 2024`25 సంవత్సరానికి ఆడ్మిషన్లు చేపట్టే అవకాశం లేదని జాతీయ వైద్య మండలి నిర్దద్వంగా తిరస్కరించింది. 21 ఎంపీ సీట్లతో కేంద్రం మెడలు వంచేస్తామని ప్రగల్పాలు పలికిన జగన్‌రెడ్డి.. తన అధికారాన్ని స్వార్థానికి వాడుకున్నారే తప్ప.. రాష్ట్రంకోసం వాడలేకపోయాడు.
పొరుగు రాష్ట్రం తెలంగాణ కేంద్రంనుంచి 17 మెడికల్ కాలేజీలకు అనుమతులు తెచ్చుకుంటే, అవినాష్‌రెడ్డి బెయిల్ కోసం సాగిలపడిన జగన్.. కేవలం 5 మెడికల్ కాలేజీలకు అనుమతులు తెచ్చుకుని రాష్ట్రానికి ద్రోహం చేశాడు. అక్కడికీ మెడికల్ కాలేజీల నిర్మాణానికి కేంద్రమిచ్చిన నిధులను దారి మళ్లించుకున్న జగన్.. తన చేతగానితనాన్ని కొత్త ప్రభుత్వంపై రుద్దాలని ప్రయత్నించడం సిగ్గుచేటు. ఐదేళ్లకాలంలో అడుగు ముందుకు వేయలేకపోయిన జగన్.. నెలరోజుల్లో ప్రజా ప్రభుత్వం మెడికల్ కాలేజీల పనులు పూర్తి చేయకపోవడం వల్ల సీట్లు వెనక్కి పోతున్నాయని.. అది రాష్ట్రానికి ద్రోహం చేయడమేనని బరితెగింపు విమర్శలకు దిగడం కుట్ర రాజకీయమే.
మరింత లోతుల్లోకి వెళ్తే.. ఈ ఏడాది 5 మెడికల్ కాలేజీలకు ఎన్‌ఎంసి అనుమతులు తెచ్చుకోవటంలో గత జగన్‌రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఎన్‌ఎంసి నోటీసులకు సమాధానం చెప్పలేక మౌనం వహించింది. భవన నిర్మాణాలు పూర్తి కాలేదు. కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వకపోవటంతో, వాళ్ళు మధ్యలో వదిలి వెళ్ళిపోయారు. క్షేత్రస్థాయిలో భవనాల పరిస్థితి పరిశీలించిన ఎన్‌ఎంసి, ఇప్పటికీ నిర్మాణాలు పూర్తి కాలేదని, వైద్య, బోధన సిబ్బంది కొరత 64శాతం పైనే ఉందని, బ్లడ్ బ్యాంక్‌కు అనుమతులు లేవని తేల్చింది. ఈ ఏడాది మే, జూన్‌లో మదనపల్లి, మార్కాపురం, పాడేరు, పులివెందుల, ఆదోని వైద్య కళాశాలల్లో తనిఖీలు నిర్వహించిన ఎన్‌ఎంసీ.. బోధకులు, మౌలిక సదుపాయాల కొరత ఉందని పేర్కొంటూ అనుమతులు నిరాకరించింది.
సగం సగం పనులు.. ఆర్భాటాలు.. అబద్ధాలు…
2024-25 విద్యా సంవత్సరంలో పాడేరు, పులివెందుల, మదనపల్లి, ఆదోని, మార్కాపురంలోని వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్‌లో ప్రవేశాల అనుమతి కోరుతూ వైకాపా ప్రభుత్వం ఎన్‌ఎంసీకి దరఖాస్తుచేసింది. కానీ.. తరగతుల నిర్వహణకు తగ్గట్లు నిర్మాణాలు జరగకపోవడం, బోధన సిబ్బంది కొరత తీవ్రంగా ఉన్నందున తనిఖీల అనంతరం ప్రవేశాల నిర్వహణకు ఎన్‌ఎంసీ నిరాకరించింది. దీనిపై అప్పీలు చేస్తే, కేవలం రెండు కాలేజీలపై స్పందించింది. పులివెందుల కళాశాలలో 50 సీట్ల భర్తీకి ఆమోదం తెలుపుతామని, అయితే లోపాలు సరిదిద్దుతామని రాష్ట్ర ప్రభుత్వం ‘అండర్ టేకింగ్’ ఇవ్వాలని స్పష్టంచేసింది. అదేవిధంగా పాడేరు వైద్య కళాశాలలో 50 ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి ఆమోదం తెలుపుతూ లోపాలు సరిదిద్దుతామని రాష్ట్ర ప్రభుత్వంనుంచి అండర్ టేకింగ్ కోరింది. పాడేరు వైద్య కళాశాలకు పూర్తిగా కేంద్రం నిధులిస్తున్నందున అందులో సీట్ల భర్తీకి వీలుగా ఎన్‌ఎంసీకి అండర్ టేకింగ్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
పులివెందుల మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తి కాలేదు. 48శాతం బోధనా సిబ్బంది లేరు. బోధనా సిబ్బంది, మౌలిక సదుపాయాలను వెంటనే సమకూర్చే అవకాశం లేనందున పులివెందుల కళాశాలకు అండర్ టేకింగ్ ఇచ్చే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఇదే సమయంలో మిగిలిన మదనపల్లి, ఆదోని, మార్కాపురం కళాశాలల్లో అసలు కనీసం భవనాల నిర్మాణం కూడా జరగక పోవటంతో, అసలు తరగతులు ప్రారంభమయ్యే అవకాశాలు లేవు. నిజానికి ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి `కొత్త ప్రభుత్వం తన పాలసీని ఇంకా రూపొందించలేదు. అయినప్పటికీ `తన వైఫల్యాలన్నీ కొత్త ప్రభుత్వం చేతగానితనంగా ప్రచారం చేస్తూ.. ప్రభుత్వంపై బురదజల్లుతున్నాడు జగన్‌రెడ్డి. కేంద్ర ప్రభుత్వమిచ్చిన నిధులు మింగేసి, కనీస పనులు కూడా చేయకుండా, ఏమి తెలియని నంగనాచిలాగా, ఇప్పుడు బెంగళూరులో కూర్చుని విష ప్రచారం చేస్తూ.. కుప్పిగంతులు వేస్తున్నాడు జగన్‌రెడ్డి!