- దర్యాప్తు సాగుతోందని సుప్రీంకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం
- గత ప్రభుత్వ తీరుపై ధర్మాసనం అసహనం
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక అక్రమ మైనింగ్ వ్యవహారంలో గత వైసీపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఇసుక అక్రమ మైనింగ్ వ్యవహారంపై హరిత ట్రైబ్యునల్ తీర్పును సవాలు చేస్తూ… జేపీ పవర్ వెంచర్స్ దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం జస్టిస్ అభయ్ ఎస్ ఓఖా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మైష్ ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పలు అంశాలను లేవనెత్తింది. ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించిన షోకాజ్ నోటీసులు, ఎఫ్ఐఆర్లు అన్నీ ఈ ఏడాది జులై, ఆగస్టులోనే ఎందుకు ఉన్నాయని ప్రశ్నించింది. తాము ఆదేశాలు జారీ చేసిన తర్వాత కూడా.. జులై, ఆగస్టు వరకు నోటీసులు జారీ చేయకపోవడం, కేసులు నమోదు చేయడంలో ఎందుకు తాత్సారం చేశారని అడిగింది. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాతే.. కేసులు నమోదు చేసి తదుపరి చర్యలు మొదలు పెట్టినట్లు కోర్టుకు రాష్ట్ర ప్రభుత్వ తరపు న్యాయవాది తెలిపారు.
ఇప్పటి వరకు 9 మందిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, అక్రమ మైనింగ్‌ను అరికట్టినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో తాజా నివేదికను నవంబర్ 14 లోపు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం మరోసారి ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్ 18న చేపట్టనున్నట్లు ధర్మాసనం ప్రకటించింది.
గతంలో ఇసుక అక్రమ మైనింగ్ వ్యవహారంలో అన్ని రకాల ఉల్లంఘనలు జరిపారని జాతీయ హరిత ట్రిబ్యునల్‌లో న్యాయవాది దండా నాగేంద్రకుమార్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో జేపీ వెంచర్స్‌కు హరిత ట్రైబ్యునల్ భారీ జరిమానా విధించింది. ట్రైబ్యునల్ ఆదేశాలను జేపీ పవర్ వెంచర్స్ సంస్థ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. జేపీ వెంచర్స్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణలో భాగంగానే రాష్ట్రంలో అక్రమ మైనింగ్ నిలుపుదల చేయాల్సిందే అని గతంలో ధర్మాసనం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అక్రమాలపై తదుపరి చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించింది.