` ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతూ అబద్ధాలు వల్లెవేసిన జగన్ రెడ్డి
` సంపద సృష్టిలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలం
` చంద్రబాబు పాలనలో 100 శాతం వృద్ధి… జగన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో 66 శాతం మాత్రమే
` రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబు విజన్, సొంత ఆస్తులు పెంచుకోవటం జగన్ నైజం
అమరావతి(చైతన్యరథం): సంపద సృష్టించటం ఏ మాత్రం తెలియని జగన్‌రెడ్డి సంపద సృష్టి, అభివృద్ధిలో ఎంతో ఘనచరిత్ర ఉన్న చంద్రబాబు నాయుడిని విమర్శించటం హాస్యాస్పదంగా ఉందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ ధ్వజమెత్తారు. జగన్‌రెడ్డి ఇటీవల మేనిఫెస్టో విడుదల సందర్భంగా ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతూ చంద్రబాబుకు సంపద సృష్టించడం రాదని, చంద్రబాబు పరిపాలనలో రెవెన్యూలోటు ఎక్కువగా ఉందని, జీడీపీలో అప్పులు ఎక్కువగా ఉన్నాయని విమర్శించటాన్ని విజయ్ కుమార్ తప్పుబట్టారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నెలకు 9 వేల కోట్ల రూపాయల సంపదను సృష్టించుకోలేని స్థితిలో ఉండి, ఆదాయం ఏమాత్రం పెంచుకోకుండా, అప్పుల మీదే ఆధారపడే జగన్ రెడ్డి.. చంద్రబాబుకు సంపద సృష్టి రాదని చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు. గత ఐదు సంవత్సరాలుగా ఏపీలో లేనిది ఏమిటంటే సంపదను సృష్టించడం ఒక్కటేనన్నారు. కనీసం కాగ్ లెక్కలు చూసినా జగన్‌కు ఇది అర్థమయ్యేదేమోనని విజయ్ కుమార్ ఎద్దేవా చేశారు.
టీడీపీ దరిదాపుల్లో కూడా వైసీపీ నిలవదు
అప్పులు చేస్తూ రాష్ట్రం ఆర్థికంగా సూపర్ అని జగన్ అంటున్నారు. జీఎస్డీపీ పెరిగిందంటున్నారు. అక్కడ జీఎస్డీపీ ఆదాయం కానీ, సేల్స్ ట్యాక్స్ ఆదాయం కానీ ఏదీ పెరగలేదు. ఒక్క ఎక్సైజ్ ఆదాయం మాత్రమే పెరిగింది. కొత్త పరిశ్రమలు అసలు కనిపించవు. టీడీపీ సాధించిన వృద్ధితో పోలిస్తే వైసీపీ దాని దరిదాపుల్లో కూడా నిలవదు. అయినా గొప్పలు చెప్పుకుంటున్నారు. పరిమితికి లోబడి అప్పులు చేస్తున్నామంటున్నారు. కాగ్ ఏమో రాజ్యంగ విరుద్ధంగా అప్పులు చేస్తున్నారంటూ వైసీపీ ప్రభుత్వానికి మొట్ట్టికాయలు వేస్తుంది. జగన్ నిరంతరం అప్పుల్లో మునిగి తేలుతూ, మరోపక్క టీడీపీపై విమర్శలు చేస్తున్నారని విజయ్ కుమార్ తప్పుబట్టారు.
కేంద్రం నుండి అప్పులు తెచ్చుకోవడం ఎవరైనా చేస్తారు. రాష్ట్ర పనితనాన్ని చూపించేది రాష్ట్ర ఆదాయం మాత్రమే. 2014లో పూర్తిగా లోటు బడ్జెట్‌లో ఉన్నప్పుడు చంద్రబాబు అధికారం చేపట్టారు. మొదటి సంవత్సరంలో రూ. 29,857 కోట్లు ఆదాయం ఉంటే దాన్ని 2019 నాటికి 58,091 కోట్లకు పెంచారు. అంటే దాదాపు 98శాతం వృద్ధి సాధించారు. సంపదను సృష్టించడం చంద్రబాబుకు చేతకాదని చెప్పిన జగన్ రెడ్డి గత ఐదేళ్లో సాధించిన వృద్ధి కేవలం 66 శాతం మాత్రమే. సంపద సృష్టించడం చేతగాక 100 శాతం వృద్ధిని సాధించిన టీడీపీపై విమర్శలు చేయడం సిగ్గుచేటు. కాగ్ నివేదికలే దీన్ని స్పష్టం చేస్తున్నాయని విజయ్ కుమార్ చెప్పారు.
చంద్రబాబు దరిదాపుల్లోకి కూడా రాలేడు
సంపద సృష్టికి చంద్రబాబు ట్రేడ్ మార్క్ లాంటి వ్యక్తి. విజన్ అనేది ఆయన పేటెంట్. ఈ విషయంలో ఆయన సమీపానికి కూడా జగన్ రెడ్డి రాలేరు. ఆర్థిక ప్రణాళిక అనేది చంద్రబాబు నైజం. ముందు చూపు అనేది ఆయన నైపుణ్యత. జగన్ రెడ్డి సంపదను సృష్టించలేరు. జగన్‌రెడ్డికి రాష్ట్ర అభివృద్ధిపై ముందు చూపు లేదు కానీ కంపెనీలను పెట్టి దాని షేర్లను అమాంతం పెంచుకోవడం తెలుసునని విజయ్ కుమార్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
స్వప్రయోజనాలే జగన్‌కు ముఖ్యం
జగన్‌రెడ్డి ఆలోచనలు ఎల్లప్పుడూ ఆయన సొంత ప్రయోజనాల కోసమే సాగుతాయి. కానీ చంద్రబాబు మాత్రం ప్రజల కోసం రాష్ట్ర ఆదాయాన్ని ఎలా పెంచాలని ఆలోచిస్తారు. వ్యక్తిగత సంపద ముఖ్యం అనుకుంటే చంద్రబాబు అంబానీని దాటిపోయేవారు. చంద్రబాబు రాష్ట్ర సంపదే ముఖ్యం అనుకున్నారు. జగన్‌రెడ్డి తన కంపెనీల కోసం మాత్రమే శ్రమ పడ్డారని విజయ్ కుమార్ వివరించారు.
మద్యం ఆదాయం మాత్రమే పెరిగింది
జగన్ రెడ్డి కూల్చివేతల పర్వం చేపట్టి రాష్ట్రానికి సంపదను సృష్టించడంలో విఫలం అయ్యాడు. మద్యం ఆదాయాన్ని మాత్రం పెంచేశాడు. ఈ విషయంలో టీడీపీ కంటే రూ. 55 వేల కోట్లు అదనంగా ఆదాయం సంపాదించారు. టీడీపీ హయాంలో మద్యంపై రూ. 72 వేల కోట్ల ఆదాయం వస్తే.. వైసీపీ పాలనలో రూ. 1లక్ష 22 వేల కోట్లు వచ్చింది. మద్యపాన నిషేధమని చెప్పి చివరికి ఆ మద్యం ఆదాయం మీదే జగన్ రెడ్డి ఆధారపడ్డారు. ఆదాయం పెంచుకునేందుకు ప్రజలపై విపరీతంగా భారాలు మోపాడు. భూముల ధరలు పెంచాడు. దేశంలోనే అత్యధికంగా డీజిల్ ,పెట్రోల్ ధరలను పెంచాడు. అధిక మొత్తంలో అప్పులు తీసుకుని మూలధన పెట్టుబడులకు పెట్టింది కేవలం 30 శాతం మాత్రమే. టీడీపీ ప్రభుత్వం నాడు తీసుకున్న అప్పుల్లో సగానికి పైగా మూలధన పెట్టుబడులపై ఖర్చు చేసింది. విభజన చట్టంలో 2014 -15 లో రావాల్సిన డబ్బులు రూ. 10,800 కోట్లను కూడా వైసీపీ ప్రభుత్వమే తీసుకుని మళ్లీ టీడీపీపై విమర్శలు చేయడం సిగ్గుచేటని విజయ్ కుమార్ విమర్శించారు.
ఆ లక్షణాలేవీ జగన్‌కు లేవు
2014 -19 మధ్యకాలంలో ఏపీ సగటు వృద్ధిరేటు 10.36గా నమోదయింది. అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అదే ఎక్కువ. సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని అత్యధిక వృద్ధి రేటలు సాధించి రికార్డ్ స్థాయిలో నిలబెట్టారు. జగన్ రెడ్డి అధికారం చేపట్టి దాన్ని దిగజార్చి మళ్లీ ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతూ అబద్ధాలు చెబుతున్నారు. రాష్ట్ర ప్రజను అప్పుల ఊబిలో ముంచి.. సొంత, బినామీ కాంట్రాక్టర్లకు వేల కోట్లు దోచి పెట్టి మళ్ళీ చంద్రబాబుకు సంపదను సృష్టించడం చేతకాదని చెప్పడం సిగ్గుచేటని విజయ్ కుమార్ మండిపడ్డారు.
సంపద సృష్టి అనేది ఒక కళ. దానికి కష్టపడాలి. స్వార్థం తగ్గించుకోవాలి, ప్రజలకోసం పాటుపడాలి. ఎకనామిక్ ప్లానింగ్ కావాలి. దానికి ముందుచూపు ఉండాలి. దార్శనికత కావాలి. అన్నింటికీ మించి ప్రజల మీద మమకారం ఉండాలి. ఈ లక్షణాలన్నీ చంద్రబాబుకు ఉన్నాయి. ఇవి జగన్ రెడ్డికి లేవు. అందుకే ఉన్న వృద్ధిని దిగజార్చి ప్రజల జీవితాలో ఆడుకున్నాడు. మరోసారి ప్రజలు జగన్ రెడ్డిని నమ్మే పరిస్థితి లేదు. ఈ సారి విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబును ప్రజలు అధికారంలోకి తీసుకురావటం ఖాయమని విజయ్ కుమార్ స్పష్టం చేశారు.