- అందుకు జగనాసుర వధే నినాదం
- 5 కోట్ల ప్రజల ఉజ్వల భవితే అజెండా
- మెరుగైన సంక్షేమం, పరుగులిడే అభివృద్ధే లక్ష్యం
- 2014-19 లో చేసిన పనులే సాక్ష్యం
- జగన్ చీకటి అధ్యాయానికి చరమగీతమే తొలి అడుగు
- కూటమి ప్రభుత్వం కోసం ఆతృతతో ప్రజలు
- తీవ్ర నైరాశ్యంలో జగన్ శిబిరం
- విష ప్రచారంతో దిగజారుడు రాజకీయం
పోగాలము దాపురించిన వారు దీప నిర్వాణ గంధమును ఆఘ్రాణించలేరు. అరుంధతీ నక్షత్రమును చూడలేరు. మిత్ర వాక్యమును వినలేరు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి శిబిరం ఇదే పరిస్థితిలో ఉంది నేడు. త్వరలో జరగనున్న ఎన్నికలలో పరాజయం తప్పదని తెలిసి పూర్తి నైరాశ్యంలో కొట్టుమిట్టాడుతోంది. దింపుడు కళ్లెం ఆశలతో అబద్ధాలకు దిగజారుతోంది. ఈ వైరాగ్యం జగన్‌రెడ్డి అవినీతి మానస పుత్రిక ‘సాక్షి’ (12.4.2024) సంచికలో ‘ఆరోపణలే అజెండా’ అన్న పతాక శీర్షికతో ప్రచురితమైన కథనంలో నగ్నంగా వెల్లడైంది. ఆ వార్త సారాంశమేమంటే.. చంద్రబాబుకు ఓ విధానమూ లేదట.. నినాదమూ లేదట. ఈ వార్తను కపట ‘సాక్షి’ వండివార్చిన తీరే అందులోని అసంబద్ధతను బట్టబయలు చేసింది.
నవ్యాంధ్ర వడివడి అడుగులు
ఉమ్మడి రాష్ట్ర విభజనానంతరం ఏర్పడిన నవ్యాంధ్ర ప్రజలు ఎంతో నమ్మకంతో 2014 ఎన్నికల్లో కొత్త రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడుని ఎన్నుకున్నారు. తండ్రి శవం పక్కనే సింహాసనం కోసం తహతహలాడిన జగన్‌రెడ్డిని నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. ఎందుకు..? పురిటి కష్టాలతో జన్మించిన నవ్యాంధ్రను సరైన మార్గంలో, సరైన రీతిలో, సరైన వేగంతో ఇతరులతో పోటీపడి నడిపించగల సత్తా ఉన్న నాయకుడు చంద్రబాబు అని 2014లో జనం ఆయన వెంట నడిచారు.
ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేందుకు నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు 2014`19 కాలంలో రేయింబవళ్లు కష్టపడి అధికార యంత్రాంగాన్ని పరుగులెత్తించి, వివిధ పథకాలు, కార్యక్రమాలతో కొత్త రాష్ట్రానికి ఒక గుర్తింపు తెచ్చారు. వినూత్న విధానాలతో భారీ శ్రమతో అమరావతి రాజధాని ప్రాజెక్టును పరుగులెత్తించారు. సగటు మనిషి ఇల్లు కట్టుకోవటానికి కనీసం రెండు సంవత్సరాలు పడుతుంది. లోతైన పరిశీలనతో, విస్తృత చర్చల నేపథ్యంలో, ప్రముఖ అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యం, సహకారాలతో రాజధాని ప్రణాళికను రూపొందించి, నిర్మాణాలు చేపట్టి రూ.15వేల కోట్ల పనులను శరవేగంతో నడిపించారు. దేశ, విదేశాల నిపుణులు అబ్బురపోయేలా చేశారు. నవ్యాంధ్ర ప్రజల నమ్మకాన్ని నిలబెడుతూ వారిలో ఓ బలమైన ఆశను, భవితపట్ల విశ్వాసాన్ని, ధైర్యాన్ని నింపారు. చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన పలు నిర్మాణాలు, పూర్తయి వినియోగంలోవున్న పలు భవనాలు చంద్రబాబు పాలనా దీక్షకు సజీవ తార్కాణాలుగా ఉన్నాయి. అవే జగన్‌రెడ్డి గత ఐదేళ్ల పాలనకు ప్రధాన ఆధారంగా మిగిలాయి.
కొత్త పుంతలు తొక్కిన సంక్షేమం
సంక్షేమం, అభివృద్ధిలను రెండు కళ్లుగా భావించే చంద్రబాబు 2014`19లో ఈ రెండింటిని సమన్వయం చేసుకుంటూ పలు వినూత్న పథకాలను ప్రారంభించారు. అవ్వాతాతల నెలవారీ పింఛనును రూ.200 నుంచి పదిరెట్లు పెంచి రూ.2000 చేశారు. వివిధ సామాజిక వర్గాల ప్రత్యేక ప్రయోజనాల నిమిత్తం ఎస్సీలకు 27 పథకాలు, ఎస్టీలకు 16, బీసీలకు 30, మైనారిటీలకు 10 ప్రవేశపెట్టారు. ఆదరణ, డా.అంబేద్కర్ విదేశీవిద్య, బెస్ట్ అవైలబుల్ సూళ్లు, చంద్రన్న బీమా, స్కిల్ డెవలప్‌మెంట్, స్వావలంబనతో కూడిన సాధికారతకు మున్నెన్నడూ చూడని పథకాలను రూపొందించారు.
ప్రజలు.. ముఖ్యంగా గ్రామీణ పేదల రేపటి కోసం ఎంతో కీలకమైన ఆర్థికాభివృద్ధికి మూలమైన మౌలిక రంగాల అభివృద్ధికి కృషి చేశారు నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు.
ఇందుకు రాష్ట్ర జీవనాడి పోలవరమే ఉదాహరణ. ఈ పథకం పనులను పరుగులెత్తించి 72 శాతం పూర్తి చేశారు. కీలకమైన సాగునీటి రంగంపై రూ.68వేల కోట్ల వ్యయం చేశారు. రహదారులు, రవాణా రంగంలో పలు మార్పులు తెచ్చారు. చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్‌తో లక్షలాది కోట్ల పెట్టుబడులతో 6 లక్షల ఉద్యోగాలు అందించారు. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇవి చాలవా ముఖ్యమంత్రిగా చంద్రబాబు 2014`19లో చేసింది చెప్పుకోవటానికి? అయినా చెప్పుకోవడానికి ఏమీలేక మఖ్యమంత్రి జగన్ రెడ్డిపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని కపట ‘సాక్షి’ జగన్‌రెడ్డి తరఫున శుక్రవారం సంచికలో పతాక వార్తలో వాపోయింది. అంతటి ఘనత కలిగిన చంద్రబాబు ముందు జగన్‌రెడ్డి నిలబడలేకపోవటాన్ని చూసి తమ శిబిరంలో నెలకొన్న నైరాశ్యానికి తానే అద్దం పట్టింది.
జగన్‌కి ఏముంది చెప్పుకోవటానికి?
అధికారంలోకి వచ్చిన అనతి క్షణాల్లోనే చేసిన ‘ప్రజావేదిక’ విధ్వంసమా? శిథిóలమైన అమరావతా? రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయిన నవ్యాంధ్రా? గోదాట్లో మునిగిపోయిన పోలవరమా? పారిపోయిన పరిశ్రమలు, పెట్టుబడులా? నిర్వీర్యమైన యువతా? అనునిత్యం హత్యలకు గురవుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలా? ఆత్మహత్యల్లో దేశంలోనే ముందున్న రైతాంగమా? మాన, ప్రాణ రక్షణలేని రాష్ట్ర మహిళలా? ప్రభుత్వ నిర్వాకాలను ప్రశ్నించటానికి, తమ హక్కులను కాపాడుకోవటానికి నోరు విప్పటానికి కూడా భయపడుతూ బిక్కుబిక్కుమని బతుకుతున్న ప్రజానీకమా?
సంక్షోభంలో పడిపోయిన సంక్షేమమా? జగన్ ఇచ్చిన హామీలు పూర్తిస్థాయిలో అమలుకాకపోవడంతో మోసపోయిన రైతులు, మహిళలు, విద్యార్థులా? చంద్రబాబు ప్రవేశపెట్టిన వివిధ సంక్షేమ పథకాల రద్దుతో తీవ్రంగా నష్టపోయిన ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ వర్గాల వారా? జగన్ బృందం ఇసుక దోపిడీతో బతుకు బజారుపాలైన 40 లక్షలమంది నిర్మాణరంగ కార్మికులా? గుంతలమయమైన రోడ్లా? కనుచూపుమేరలో కానరాని అభివృద్ధా? అప్పుల కుప్పగా మారిన రాష్ట్రమా?
సకాలంలో జీతాలందక ఐదేళ్లుగా కష్టాలు పడుతున్న వివిధ కేటగిరీల ఉద్యోగులు, ఉపాధ్యాయులా? పంచాయితీ రాజ్ వ్యవస్థ నిర్వీర్యంతో నిష్క్రియాపరులైన వైసీపీ స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులా? ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి దర్శన భాగ్యం గత ఐదేళ్లుగా లభించని అధికారపార్టీ శాసన సభ్యులా? గత ఐదేళ్లలో తానేమి చేశాడని చెప్పుకోగలడు ఈ ముఖ్యమంత్రి? ఏమీ లేదు కనుకనే చంద్రబాబుపై పడి ఏడవడం.
కపట ‘సాక్షి’ వండివార్చిన సదరు అసత్యపు కథనంలో.. ముఖ్యమంత్రి తరఫున వకాల్తా పుచ్చుకుని ఇంకొన్ని అవాస్తవాలను అచ్చువేసింది. అవి కూడా పూర్తిగా డొల్లే. జగన్‌రెడ్డి బడులను బాగుచేసి, విద్యావ్యవస్థను మార్చేస్తే.. 6 లక్షలమంది విద్యార్థులు పభుత్వ బడులను ఎందుకు వీడినట్టు? పేదలందరికీ వైద్యాన్ని అందిస్తే నెట్‌వర్క్ ఆస్పత్రులకు వందల కోట్ల బకాయిలు ఎందుకు పేరుకున్నాయి? కొండ ప్రాంతాల్లో మహిళలు ఆస్పత్రులకు పోతూ దారిలో ఎందుకు ప్రసవిస్తున్నారు. సరైన వైద్యం అందక అనారోగ్యంతో ప్రాణాలు వదిలిన వారిని కిలోమీటర్ల కొద్దీ భుజాలపై ఎందుకు మోసుకుపోవాల్సి వస్తోంది? సాగును బాగుచేస్తే ఆత్మహత్యల్లో మన రైతన్నలు దేశంలోనే ఎందుకు అగ్రస్థానంలో ఉన్నారు? లక్షలాది ఉద్యోగాలిస్తే నిరుద్యోగంలో మనమే ఎందుకు ముందున్నాం? అధికారం కోసం 730 హామీలిచ్చిన జగన్‌రెడ్డి 85 శాతం ఎందుకు అమలు చేయలేదు?
చెప్పుకునేందుకు ఏమీలేక తెదేపా `భాజపా `జనసేన కూటమిపై ఏడుపు. కేంద్రంలో రెండుసార్లు ప్రధానమంత్రి అయిన మోదీ లోక్‌సభలో సొంతంగానే మెజార్టీ పొందినా పొత్తులు పెట్టుకోలేదా? విజయం తథ్యమని తెలిసినా మూడోసారి కూడా పొత్తులతో సాగడంలేదా? పొత్తులు రాజ్యాంగ విరుద్ధమా? అనైతికమా? కనుక.. ఇవన్నీ ఎన్నికల ముంగిట పోగాలము దాపురించిన వారు పలికే నిస్సహాయ మాటలు, నైరాశ్యపు చేష్టలు. జగన్ బృందానికి తెలుసు. ఆయన దెబ్బకు విధ్వంసమైన రాష్ట్ర పునర్నిర్మాణమే చంద్రబాబు విధానమని.. జగనాసురవధే నినాదమని…ఐదుకోట్ల ప్రజల ఉజ్వల భవితే అజెండా అని!