.మూడువారాల నుంచి అంధకారంలో ఉన్నామన్న బాధితులు
.ఇది దయలేని ప్రభుత్వమని మండిపడ్డ చంద్రబాబునాయుడు
.పోలవరం పరిహారంపై పోరాటానికి నాయకత్వం వహిస్తా
.చేతగాకపోతే రాజీనామా చేసి ఇంటికెళ్లు… పూర్తిచేసి చూపిస్తా!
.గోతుల రోడ్లపై తిరిగి నడుంనొప్పులొచ్చాయి… మీకోసం భరించా!
.8లక్షల కోట్ల అప్పులో పునారావాసానికి రూ.22వేలకోట్లు ఇవ్వలేరా?
.జగన్ రెడ్డి ప్రభుత్వంపై టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ధర్మాగ్రహం
అల్లూరి జిల్లా: గోదావరి వరదల కారణంగా సర్వస్వం కోల్పోయిన పోలవరం ముంపు గ్రామాలప్రజల ఇక్కట్లను కళ్లారా చూసిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు చలించిపోయారు. రెండు రోజుల పాటు విలీన మండలాల్లోని గోదావరి ముంపు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించిన టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు వేలేరుపాడు, కుక్కునూరు, ఎటపాక, కూనవరం, విఆర్ పురం మండలాల్లో పలు గ్రామాల్లో బాధితులను చంద్రబాబు పరామర్శించిన చంద్రబాబునాయుడు ఇంటింటికీ వెళ్లి బాధితుల కష్టాలు తెలుసుకున్నారు. వరదల్లో ముంపునకు గురై మట్టిదిబ్బలుగా మారిన ఇళ్లను చూసి తీవ్ర ఆవేదనకుగురైన టిడిపి అధినేతకు ముంపు గ్రామాల బాధితులు తమ బాధలు చెప్పుకున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం కోతుల గుట్ట గ్రామంలో వరద ముంపు బాధితుల్ని చంద్రబాబు పరామర్శించారు. 3వారాల నుంచి విద్యుత్ సరఫరా లేక అంధకారంలోనే ఉంటున్నామని చంద్రన్న ఎదుట బాధితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ నెల 12నుంచి ఇళ్లు వదిలిన తాము పునరావాస కేంద్రాల్లోనే తలదాచుకుంటున్నామని, అక్కడ తమకు కనీస సౌకర్యాలు లేవని బాధితులు విలపించారు. ప్రభుత్వం సరిగ్గా ఆహారం అందించకపోగా నిత్యావసరాలు అరకొరగా అందించిందని ఆవేదన వ్యక్తంచేశారు.
శుభ్రంచేయడానికి రూ.12వేలు ఖర్చవుతుంటే 2వేలు ఇస్తున్నారు
ఒక్కో ఇల్లు శుభ్రం చేసుకునేందుకే రూ.12వేలు ఖర్చవుతోందని, ప్రభుత్వం కేవలం రెండువేలు ఇచ్చి చేతులు దులుపుకుంటోందన్నారు. వరదపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ముందస్తు సమాచారం లేకపోవడంతో సగం చచ్చి బతికామని ఆవేదన చెందారు. వరద బాధితుల కష్టాలను పరిష్కరించడంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. వరద బాధితుల్ని కనీసం మనుషుల్లా కూడా ఈ ప్రభుత్వం చూడలేదన్నారు. ముఖ్యమంత్రి కి మనసనేది ఉంటే వరద బాధితుల కష్టాలను వారి కళ్ళతో చూడాలని అన్నారు. తాగేందుకు మంచినీళ్లు కూడా ఇవ్వలేని అసమర్ధ ప్రభుత్వమని నిప్పులు చెరిగారు. పశువులకు గడ్డి కూడా పెట్టించలేని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి… పశువులకు నోరుంటే జగన్మోహన్ రెడ్డిని కుమ్మి వదులుతాయని అన్నారు. తెలుగుదేశం నేతలు సొంత డబ్బులతో పశువుల దాణా పంపి వాటి ప్రాణాలు కాపాడుతున్నారని చెప్పారు.
వరదబాధితులను గాలికొదిలి ప్యాలెస్ లో పడుకుంటారా?
వేలేరుపాడు మండలం రేఖపల్లిలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ… వరదల సమయంలో ఇంత దారుణంగా వ్యవహరించిన ప్రభుత్వాన్ని చూడలేదన్నారు. వాలంటీర్లు, సచివాలయాలు పనిచేయలేదని, సిఎం తాడేపల్లి ప్యాలెస్‌లో పడుకున్నారని దుయ్యబట్టారు. నాలుగు బంగాళదుంపలు, నాలుగు టమాటాలు ఇచ్చి ఇదే ప్రభుత్వ సాయం అంటారా అని మండిపడ్డారు. పోలవరం కట్టలేను….ఆర్ అండ్ ఆర్ ఇవ్వలేను అని సిఎం చెప్పేశాడు… జగన్ ముద్దులు సమస్యలు పరిష్కారం కావు… ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైన కోపం, అసంతృప్తి ఉన్నాయని తెలిపారు. వరదల్లో బాగా పని చేసిన కొందరు పోలీసులను ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు అభినందించారు. పోలవరం పరిహారం కోసం కేంద్రాన్ని అడుగుతూనే ఉంటా అని జగన్ దీర్ఘాలు తీస్తున్నాడు… 25 మంది ఎంపిలను ఇస్తే కేంద్రం మెడలు వంచుతా అని చెప్పిన జగన్ తన కేసుల కోసం అన్నీ తాకట్టు పెట్టాడని మండిపడ్డారు. పరిహారం కోసం పోరాటానికి ప్రజలు సిద్దంగా ఉంటే…తాను నాయకత్వం వహిస్తానని తెలిపారు. పోలవరం పూర్తి చేసే బాధ్యతనే కాదు….పరిహారం బాధ్యత కూడా టిడిపి తీసుకుంటుందని చెప్పారు.
రాష్ట్రం బాగుపడాలంటే ఫ్యాన్ సిచ్చాఫ్ చేయాలి
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం వీఆర్ పురం మండలంలోని వివిధ గ్రామాల్లో వరద ముంపు బాధితుల్ని పరామర్శించిన చంద్రబాబు నాయుడు ఆయా గ్రామాల ప్రజల నుద్దేశించి మాట్లాడుతూ… రాష్ట్రం బాగుపడాలంటే ‘‘ఫ్యాన్’’ ను స్విచ్చాఫ్ చేయాలని అన్నారు. వరద బాధితులకు శాశ్వత పరిష్కారం చూపే ప్రణాళిక నా దగ్గర ఉంది. కలిసి పోరాడదామని పిలుపునిచ్చారు. వరద బాధితులకు 29రకాల నిత్యావసరాలు ఇవ్వాలని హుద్ హుద్ సమయంలో ఇచ్చిన జీవో స్పష్టం చేస్తుంటే సీఎం ఇచ్చేది 4ఉల్లిపాయలు, 4కుళ్ళిన టమోటాలు, 4 ఆలుగడ్డలా అని మండిపడ్డారు. తాను చెబుతున్న నిర్దిష్టమైన డిమాండ్లు అంగీకరించి వరద బాధితుల్ని ఆదుకోవాలి… తరచూ బటన్ నొక్కుతున్నానని చెప్పుకునే సిఎం… వెంటనే పోలవరం పరిహారం బటన్ నొక్కాలంటూ చురకలు వేశారు. దెబ్బతిన్న ప్రాంతాలు ఫోటోలు తీసి పెట్టండి… వాటిని చూపి ప్రభుత్వాన్ని నిలదీద్దామని అన్నారు. ప్రభుత్వ సాయం కోసం పోలవరం ముంపు ప్రాంతాల్ని స్తంభింపచేసే కార్యక్రమానికి త్వరలోనే ప్రణాళిక ప్రకటిస్తామని చెప్పారు. పోరాటానికి నిర్వాసితులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రప్రభుత్వం తరపున రూ.8లక్షల కోట్ల అప్పులో రూ.1.75లక్షల కోట్లు కొట్టేసిన ముఖ్యమంత్రి పోలవరం నిర్వాసితులకు రూ.22వేల కోట్లు ఇవ్వలేడా అని నిలదీశారు. పోలవరం పూర్తిచేయటం చేతకాకుంటే ముఖ్యమంత్రి రాజీనామా చేసి ఇంటికెళ్లాలని డిమాండ్ చేశారు. పోలవరం తాను పూర్తి చేసి చూపిస్తానని చెప్పారు. పోలవరం నిర్వాసితులకు పరిహారం ఎగ్గొట్టేందుకు సీఎం కొత్త బాంబులు వేస్తున్నాడు… కాంటూర్ లెవల్ పై కుట్రలు ఇందులో భాగమేనని అన్నారు. దెబ్బతిన్న రహదారుల పై తిరిగి నాకూ ఒళ్ళ నొప్పులొచ్చాయి… నడుం నొప్పి బాధిస్తున్నా, మీ కష్టాలు పంచుకునేందుకే నిర్విరామంగా తిరుగుతున్నానని అన్నారు.