- ఉపాధికనుగుణమైన నైపుణ్య శిక్షణనివ్వాలి
- పరిశ్రమలకు మానవ వనరులు సమకూరాలి
- హైబ్రిడ్ వర్క్ విధానంపై దృష్టి పెట్టండి
- తగు ప్రణాళిక రూపొందించాలన్న ముఖ్యమంత్రి
- నైపుణ్య శిక్షణ, ఎంఎస్ఎంఈ, సెర్ప్‌పై సమీక్ష
అమరావతి (చైతన్య రథం): ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఎన్నికలలో ప్రజలకు మాటిచ్చాం. ఆ హామీని నెరవేర్చుకునేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుని.. పని చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. రాష్ట్రానికి ఎన్నో పరిశ్రమలు రానున్నాయని, నైపుణ్య శిక్షణ ద్వారా ఆయా ప్రరిశ్రమలకు అవసరమైన మానవ వనరులు సమకూర్చేలే ప్రణాళికలు రూపొందించాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలో వివిధరంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే అంశంపై సంబంధిత అధికారులతో గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. నైపుణ్య శిక్షణ శాఖ, ఎంఎస్ఎంఇ విభాగం, పరిశ్రమలు, సెర్ప్ అధికారులతో సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. నైపుణ్య శిక్షణ ద్వారా పరిశ్రమలకు అవసరమైన విధంగా మానవ వనరులు సమకూర్చాలని సూచించారు.
నైపుణ్యపెంపు ద్వారా పెద్దఎత్తున అవకాశాలు ఇవ్వగలుగుతామని సీఎం అభిప్రాయపడ్డారు. హైబ్రిడ్ విధానంలో ఇంటివద్దనుంచే పనిచేసే కార్యక్రమానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. బహుళజాతి కంపెనీలతో ట్రైనింగ్ సెంటర్ల ఏర్పాటు ప్రక్రియ చేపట్టాలన్నారు. విజయవాడలో వరదల్లో మునిగి సర్వం కోల్పోయిన బాధితులు తమకు ఉపాధి చూపించాలని కోరారని… ఆ ప్రాంతంలో ఎటువంటి ఉపాధి కల్పన చేపట్టవచ్చనే అంశంపై పరిశీలన జరిపి కార్యాచరణ అమలు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. వివిధ కారణాలతో గ్రామాల్లో ఉండిపోయిన వారికి పనిచేసేందుకు అవసరమైన అవకాశాలను కల్పిస్తే మంచి ఫలితాలు వస్తాయని, ప్రభుత్వం, పారిశ్రామికవేత్తలు కలిసి ఈ పనిచేయాలన్నారు. ఉద్యోగ, ఉపాధి కల్పనకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై యాక్షన్ ప్లాన్‌తో రావాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఆయా శాఖల ఉన్నతాధికారులు, పలువురు పరిశ్రమరంగ నిపుణులు పాల్గొన్నారు.