- చెత్తపన్నును రద్దు చేస్తున్నాం
- పచ్చదనం ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలి
- పుట్టిన రోజున ఓ చెట్టు పెట్టండి
- ఆరోగ్యాన్ని కాపాడేది స్వచ్ఛ సేవకులే..
- వారిన గౌరవించడం మన విధి
- 2025 డిసెంబర్ నాటికి బందరు పోర్టు
- గత పాలకుల నిర్లక్ష్యంతోనే పనులు ఆలస్యం
- గాంధీ సిద్ధాంతాలు భావితరాలకు ఆదర్శం…
- ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేద్దాం
- పింగళి వెంకయ్య పేరిట మెడికళ కళాశాల
- ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
- స్వచ్ఛతా హీ సేవను ఆరంభించిన ముఖ్యమంత్రి
- పారిశుధ్య కార్మికులను సత్కరించిన చంద్రబాబు
మచిలీపట్నం (చైతన్య రథం): ప్రతి ఒక్కరూ స్వచ్ఛ సేవకులుగా మారి 2029నాటికి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సాధనకు సంకల్పం తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌ను ఆశయంగా పెట్టుకుని అందరూ ముందుకు రావాలన్నారు. ‘పారిశుధ్య కార్మికులు స్వచ్ఛ సేవకులు. వారిని ప్రతి ఒక్కరూ గౌరవించాలి. తక్కువచేసి ఎవరూ మాట్లాడకూడదు. మనం ఆరోగ్యంగా ఉన్నామన్నా, శుభ్రమైన రోడ్లపై తిరుగుతున్నామన్నా దానికి కారణమైన పారిశుధ్య కార్మికులే. వారి సేవలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. వరద సమయంలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు మర్చిపోలేం. మనం చేసే మంచి పనే ఎప్పుడూ శాశ్వతంగా ఉంటుంది’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు కార్మికులను ప్రశంసించారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా బుధవారం మచిలీపట్నంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. తొలుత ఆ ప్రాంతంలో గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. విద్యార్థులతో కలిసి చెత్తను ఊడ్చారు. మచిలీపట్నంలోని డంపింగ్ యార్డ్‌ను పరిశీలించారు. అనంతరం పారిశుధ్య కార్మికులతో కూర్చుని స్వయంగా వారికి తేనీటిని అందించి కాసేపు ముచ్చటించారు. అనంతరం నిర్వహంచిన కార్యక్రమంలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు.
పింగళి వెంకయ్య పేరుతో మెడికల్ కాలేజీ నిర్మాణం
‘జాతీయోద్యమంలో మహాత్మాగాంధీ దేశాన్ని కదిలించారు. అహింసా పద్ధతిలో పోరాడారు. ఆయన సిద్ధాంతాలు భావితరాలకు ఆదర్శం. గాంధీ ఆశయాలకు అనుగుణంగా పని చేస్తున్నామంటే అందుకు కారణం ప్రజాహితమైన ఆలోచనలే. 1919లో గాంధీజీ మొదటిసారి కృష్ణా జిల్లాలో నిర్వహించిన సత్యాగ్రహ సభలో పాల్గొన్నారు. 1921లో అఖిల భారత మహాసభల్లో పాల్గొన్నారు. ఆ సమయంలో ఈ గడ్డపై పుట్టిన పింగళి వెంకయ్య తాను రూపొందించిన జాతీయ జెండాను గాంధీజీకి అందించారు. స్వాతంత్య్ర ఉద్యమం, పోరాటంలో పింగళి వెంకయ్య ముందుండి పోరాడారు. ప్రతి భారతీయుడు సగర్వంగా చెప్పుకునే శక్తినిచ్చిన పింగళి వెంకయ్య ఈ గడ్డపై పుట్టిన వ్యక్తి కావడం మనందరికీ గర్వకారణం. స్వాతంత్య్ర పోరాటానికి ఊతమిచ్చిన ప్రాంతమిది. ఆంధ్ర జాతీయ కళాశాలలో ఎందరో మహానుభావులు విద్యనభ్యసించారు. కానీ కొందరు స్వార్థపరులు ఆ కాలేజీని కబ్జా చేయాలని చూశారు. మహనీయుల స్ఫూర్తిని కాపాడతాం. ఆంధ్ర జాతీయ కళాశాలను ప్రభుత్వ ఆధీనంలో నిర్వహిస్తాం. పింగళి వెంకయ్య పేరుతో మెడికల్ కాలేజీ నిర్మిస్తాం’ అని సీఎం చంద్రబాబు ప్రకటించారు.
రాజకీయ నేరస్తుల ఆటకట్టిస్తా
‘గత పాలకుల శాపంతో బుడమేరుకు గండ్లు పడి వరదలు వచ్చాయి. ఎప్పుడూ లేనివిధంగా వరదలు రావడంతో విజయవాడ అతలాకుతలమైంది. లక్షలాది ప్రజలు ఇబ్బంది పడ్డారు. అందుకే వరద ప్రాంతాల్లో పర్యటించి బాధితులను సాధారణ స్థితికి తీసుకొచ్చాం. పారిశుద్ధ్య కార్మికుల సేవల వల్లే వరద ప్రభావిత ప్రాంతాల్లో అంటువ్యాధులు రాలేదు. ఇదే మానవ సేవ అంటే. వరద బాధితులకు ఎవప్పుడూ లేని విధంగా ప్యాకేజీ ప్రకటించి ఇచ్చాం. ఒక్కో ఇంటికి రూ.25 వేలు అందించాను. మానవతా దృక్పదంతో ఆలోచించి సాయం అందించాం. పాడైపోయిన ద్విచక్రవాహనాలకు రూ.3 వేలు, మిగతా వాహనాలకు రూ.10 వేలు అందించాం. బాధితులకు సాయం అందించేందుకు దాతలు పెద్ద ఎత్తున స్పందించారు. రూ.450 కోట్లు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలుగా అందించారు. అనంతపురం జిల్లాలో వైసీపీ నేతలు రథం తగలబెట్టి నెపం మనపై వెయ్యాలని చూశారు. నేరం చేసిన రెండు నిమిషాల్లోనే పట్టుకునే వ్యవస్థ ప్రభుత్వం వద్ద ఉంది. రాముడి తల నరికితే నిందితులను పట్టుకోలేదు. దుర్గమ్మ వెండి సింహాలు మాయం చేసిన వారిపై చర్యలు లేవు. అందుకే రాష్ట్రంలో మళ్లీ అవసరమైన చోటల్లా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం. నేరస్తులు రాజకీయ ముసుగులో ఉంటే ఎదురు దాడి చేస్తారు. అందుకే నేరస్తుల ఆట కట్టిస్తాం’ అని సీఎం హెచ్చరించారు.
నా తల్లి పడిన కష్టం ఏ ఆడబిడ్డా పడకూడదని..
‘నా చిన్నతనంలో మా తల్లి వంటగదిలో పడిన కష్టాలు చూశాను. నా తల్లి పడిన కష్టం ఏ ఆడబిడ్డ పడకూడదని ఆలోచించి దీపం పథకం ద్వారా ఉచిత గ్యాస్ పథకానికి శ్రీకారం చుట్టాను. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు దీపావళి నుండి 3 గ్యాస్ సిలిండర్లు యేటా ఉచితంగా ఇస్తాం. ప్రతి ఇంటికి గ్యాస్, విద్యుత్ అందిస్తాం. 2025 మార్చి నాటికి మరుగుదొడ్లు లేని ఇళ్లకు మరుగుదొడ్లు నిర్మిస్తాం. 2027 నాటికి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షిత మంచి నీళ్లిస్తాం. జల్ జీవన్ మిషన్ పథకానికి కేంద్రం ఇచ్చిన నిధులను గత ప్రభుత్వం వినియోగించలేదు. మూడేళ్లలో రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ నీరందే లక్ష్యంతో నా మిత్రుడు పవన్ కళ్యాణ్, నేను కూర్చుని నిర్ణయించి…డీపీఆర్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించాం. 2025 నాటికి ప్రతి గ్రామంలో ఘన వ్యర్థాల ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తాం. 2029 నాటికి అవసరమైన చోటల్లా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తాం. పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తాం. ప్రతి ఒక్కరూ మీ పుట్టిన రోజు నాడు లేదా శుభకార్యం రోజున ఒక చెట్టు నాటండి. చెట్టు నాటడం మన నాగరికత. రెండేళ్లలో పోలవరం పూర్తి చేస్తాం. అమరావతి రాజధానిని కూడా నిర్మిస్తాం’ అని చంద్రబాబు ప్రకటించారు.
మచిలీపట్నం బీచ్‌కు మహర్దశ
మచిలీపట్నంలో డ్రెయినేజీ 100 శాతం మంచిగా ఉండేలా చేస్తాం. గుంతలు పడిన రోడ్లకు మరమ్మతులు చేస్తాం. డంపింగ్ యార్డు క్లీన్ చేస్తాం. బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మిస్తాం. మచిలీపట్నం బీచ్‌ను స్వదేశీ దర్శనం పథకం కింద అభివృద్ధి చేస్తాం. మత్య్సకారులకు ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేస్తాం. బందరు లడ్డు, రోల్డ్‌గోల్డ్ నగల తయారీ పరిశ్రమను అభివృద్ధి చేస్తాం. ఈ రెండిరటి కోసం ఎమ్ఎస్ఎమ్ఈ క్లస్టర్ ఏర్పాటు చేస్తాం. కళంకారీ వస్త్ర పరిశ్రమకు న్యాయం చేస్తాం. ప్లెక్సీలను కంట్రోల్ చేయడానికి ఏపక్షంగా నిర్ణయం తీసుకోలేను. అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. 2047 నాటికి స్వర్ణాంధ్ర మన లక్ష్యం. ప్రతి ఒక్కరూ ఇంటిపై సోలార్‌ను పెట్టుకుని విద్యుత్ తయారు చేయొచ్చు. వినియోగానికి పోను మిగిలిన విద్యుత్ ప్రభుత్వానికి విక్రయించవచ్చు’ అని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు.
ముఖ్యమంత్రికి ఘనస్వాగతం
కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా గుంటూరు జిల్లా తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరిన సీఎం చంద్రబాబు, బుధవారం ఉదయం 11 గంటలకు మచిలీపట్నం చేరుకున్నారు. ఏజె కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన హెలిపాడ్‌లో దిగిన సీఎం చంద్రబాబుకు రాష్ట్రమంత్రులు పొంగూరు నారాయణ, కొలుసు పార్థసారథి, కొల్లు రవీంద్ర, ఎంపీ వల్లభనేని బాలసౌరి, ఎమ్మెల్సీ పంచుమర్తి అనూరాధ, ఎమ్మెల్యేలు వెనిగళ్ల రాము, కాగిత కృష్ణప్రసాద్, వర్ల కుమార్ రాజా, మండలి బుద్ధప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావు, ఏలూరు రేంజ్ ఐజీ అశోక్‌కుమార్, జిల్లా కలెక్టర్ డికె బాలాజీ, ఎస్పీ ఆర్ గంగాధర్ రావు, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ, మాజీ ఎమ్మెల్యే బూరగడ్డ వేదవ్యాస్ తదితరులు పుష్పగుచ్ఛాలు, మొక్కలు అందించి ఘనంగా స్వాగతం పలికారు.