- సీఎం జగన్, స్పీకన్ తమ్మినేనిపై విరుచుకుపడిన వైనం
- జగన్ దోపిడీ విధానంపై ‘చంద్ర’నిప్పులు
- తప్పుడుగాళ్లకు ప్రజాక్షేత్రం శిక్ష తప్పదని హెచ్చరిక
- ఉత్తరాంధ్రకు జగన్ ఏంచేశాడో చెప్పాలని నిలదీత
- పవన్‌పై మాట జారితే జనం తాట తీస్తారని హెచ్చరిక
- నాగావళి, వంశధారపై వంతెనలు నిర్మిస్తానని హామీ
- ఆముదాలవలసలో ఎటుచూసినా ‘ప్రజాగళమే’!
ఆముదాలవలస (చైతన్యరథం): ‘కనుచూపు మేరలో కిక్కిరిసిన జనాన్ని చూస్తుంటే రేపు ఎన్నికల్లో తమ్మినేనికి చూపించబోయే సినిమా ఇక్కడే కనిపిస్తోంది. ప్రజాగళానికి ఆముదాలవలస కదిలొచ్చింది. యుద్ధానికి సిద్ధమా? అని అడుగుతున్నా’ అంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు రెట్టించిన ఉత్సాహాన్ని కనబర్చారు. మంగళవారం రాత్రి ఆముదాలవలసలో నిర్వహించిన ప్రజాగళం సభకు ఎటు చూసినా జనమే కనిపించారు. కేరింతలు కొడుతూ, చంద్రబాబుకు జేజేలు పలుకుతూ సభకు హాజరైన జనం ఉత్సాహాన్ని కనబర్చారు. జనసంద్రపు కెరటం ఆముదాలవలస గట్టుదాటి వచ్చినట్టు నలుదిక్కులా ప్రభం‘జనం’ కనిపించటంతో పార్టీ అధినేత చంద్రబాబులో ఉత్సాహం కట్టెలు తెంచుకుంది. సముద్రపు ఘోష మార్మోగుతున్నట్టు చంద్రబాబు ఉపన్యాసం గంభీరంగా సాగింది. కేరింతలు కొడుతున్న యువతను ఉత్సాహపర్చేందుకు మధ్యమధ్యలో ఛలోక్తులు విసురుతూ తన ఉపన్యాసంతో చంద్రబాబు ఆకట్టుకున్నారు.
‘ఇక్కడి డమ్మాబుస్ నేత పనైపోయింది. తమ్మినేని ఎన్ని డ్రామాలైనా ఆడనీ. ఇంక 19 రోజులే. జనం కొట్టే దెబ్బకు, జనమిచ్చే తీర్పునకు ఒడిశాకు పారిపోవడం తధ్యం. ఎక్కడకు పోయినా పట్టుకొస్తా. చేసిన పాపాలు, తప్పులకు ప్రజాకోర్టులో శిక్షించడం తధ్యం’ అని చంద్రబాబు వ్యాఖ్యానించటంతో `ప్రజాగళం సభలో ఉత్సాహం వెల్లివిరిసింది. నియోజకవర్గ ప్రజలకు తమ్మినేనిపై ఎంత ఆక్రోశముందో అర్థమైంది. ‘సీఎం ఒక పనికిమాలిన దద్దమ్మ. ఇలాంటి ముఖ్యమంత్రిని నా 40యేళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడలేదు. దద్దమ్మ ముఖ్యమంత్రి చెప్పే పనులకు గంగిరెద్దులా తలూపడం తమ్మినేని పని. ఇంతకుమించి తమ్మినేని చేసిందేమైనా ఉందా? సైకో మాటలకు తలూపి స్పీకర్ స్థానాన్ని అప్రతిష్టపాలు చేశాడు.
తమ్మినేని నియోజకవర్గం మొత్తాన్ని ఊడ్చేశాడు. ఏ పని చేయాలన్నా ఇంట్లోవాళ్లకు బంగారు కానుకలు సమర్పించాల్సిందే. నాగావళి, వంశధార నదుల్లోని ఇసుక మొత్తం ఊడ్చేస్తున్నాడు. ఉద్యోగుల బదిలీలకు రేట్ ఫిక్స్ చేశాడు. చెప్పేవన్నీ నీతులు.. చేసేవన్నీ బూతులు. ఇలాంటి దుర్మార్గ, నీచ నాయకులు నా రాజకీయ జీవితానుభవంలో ఎప్పుడూ, ఎక్కడా తారసపడలేదు’ అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో ప్రజాగళం దద్దరిల్లిపోయింది. ‘ఆముదాలవలస బుల్లెట్ మన కూన రవికుమార్. అతనికి ప్రజల్లో ఉన్న అభిమానం ఇక్కడికొచ్చిన జనాన్ని చూస్తేనే అర్ధమైపోయింది. ప్రజలు ఎంత కసిగా ఉన్నారంటే.. ఎప్పుడు పోలింగ్ వస్తుందా? ఎంత కసి చూపిద్దామా? అని ఎదురు చూస్తున్నట్లుంది’ అంటూ చంద్రబాబు ప్రజలను మరింత ఉత్సాహపర్చారు.
సైకో బస్సుదిగి సమాధానం చెప్పాలి
‘సైకో బస్సు వేసుకుని వస్తున్నాడు. ధైర్యముంటే ఆముదాలవలసలో ఇలాంటి సభ పెట్టు. ప్రజలడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పు. తరువాత ఓట్లడుగు. బిర్యానీపెట్టి, హాఫ్ బాటిలిచ్చి, రూ.500కూలికి జనాన్ని తెచ్చుకుంటే ఓట్లు పడవని తెలుసుకో’ అంటూ జగన్‌ను ఏకిపారేశారు. ఈ సైకో ఉత్తరాంధ్రకు ఏం చేశాడని ఇక్కడకు వస్తున్నాడో సమాధానం చెప్పాలని నిలదీశారు. ‘ఒక ఎకరాకు నీరిచ్చాడా? ఒక గ్రామానికి తాగునీరిచ్చాడా? మహేంద్రతనయ ఆఫ్ షోర్ ప్రాజెక్టుకు రూ.550 కోట్లు ఇచ్చి సగానికి పైగా పనులు పూర్తి చేస్తే.. జగన్‌రెడ్డి రూపాయి ఖర్చు చేయకుండా ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్లు వదిలేశాడు.
టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చివుంటే వంశధార నాగావళి అనుసంధానం పూర్తయ్యేది. ఆముదాలవలసలో ప్రతి ఎకరానికీ నీరిచ్చే అవకాశం ఉండేది. గతంలో ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులపై రూ.2000 కోట్లకు పైగా ఖర్చు చేశాను. మిస్టర్ జగన్ రెడ్డీ.. ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై ఎంత ఖర్చు చేశావో సమాధానం చెప్పు. ఒక్క రోడ్డేశావా? ఒక్క పరిశ్రమ తెచ్చావా? ఒక్క కాలేజీ పెట్టావా? బటన్ నొక్కి రూ.10 ఇచ్చి రూ.100 నొక్కేస్తున్న దొంగ, గజదొంగ నువ్వు’ అంటూ చంద్రబాబు తన ప్రశ్నలతో జగన్‌ను తపానులా కమ్మేశారు.
జగన్‌రెడ్డి అరాచకాన్ని సహించలేని గుంటూరు మహిళ కోవూరు లక్ష్మి పోరాటానికి దిగిందని, ప్రధాని, రాష్ట్రపతి, సుప్రీంకోర్టు జడ్జిని కలిసేందుకు ఢల్లీి వెళ్లినా ఫలితం లేకపోవడంతో బొటనవేలు నరుక్కుని నిరసన తెలిపిందని చంద్రబాబు ప్రస్తావించారు. బొటన వేలు పోయినా బాధపడలేదు కానీ, ఆడబిడ్డలకు జరిగిన అన్యాయంపై ఇంకా ఆవేదన చెందుతోందని అన్నారు. జగన్‌లాంటి పాలకులు మళ్లీ అధికారంలోకి వస్తే మన ధన మాన ప్రాణాలకు రక్షణ ఉంటుందా? అని ప్రశ్నిస్తూ.. ఒక విధ్వంసకారుడు, ఒక అహంకారి, ఒక సైకోని కలిపితే జగన్‌రెడ్డి అని నిప్పులు చెరిగారు.
పవన్‌పై మాట జారితే తాట తీస్తారు
పవన్ కళ్యాణ్ గురించి జగన్‌రెడ్డి ఏదేదో వాగుతున్నాడని అంటూ, నెత్తిన రూపాయి పెడితే దమ్మిడీకి అమ్ముడుపోని వ్యక్తి జగన్‌రెడ్డి అని వ్యాఖ్యానించారు. జగన్‌రెడ్డి బలుపు తీర్చే బాధ్యత ప్రజలు తీసుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. కూటమి నాయకులంతా కలిసి వస్తున్న రాష్ట్ర పునర్నిర్మాణం కోసమే తప్ప, రాజకీయం కోసం కాదన్న విషయాన్ని ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలదొక్కుకోవాలనే లక్ష్యంతో కలిసి వస్తున్నామన్నారు.
నాగావళి, వంశధారపై వంతెనలు నిర్మిస్తా
నాగావళిపై వంతెన, పురుషోత్తపురం వద్ద వంశధారపై వంతెన, ఆముదాలవలసలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ నిర్మిస్తాం. నారాయణపురం రీ మోడ్రనైజేషన్ పనులు పునరుద్దరిస్తా. నాగావళి నుంచి పొందూరు మండలానికి తాగునీటి కోసం రూ.42 కోట్లు ఇచ్చాం. బూర్జ మండలానికి రూ.48 కోట్లు, ఆమదాలవలసకు రూ.40 కోట్లు కేటాయించాను. కానీ జగన్‌రెడ్డి ఆ పనులన్నీ నిలిపేశాడు. అధికారంలోకి రాగానే వాటిని పునరుద్దరిస్తాం. వంశధార-నాగావళి అనుసంధానం, వంశధార ఫేజ్-2 పూర్తి చేసే బాధ్యత తీసుకుంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు.
కూటమి అభ్యర్థుల గెలుపు బాధ్యత మీదే
ఆముదాలవలస బుల్లెట్ కూన రవి ఒకవైపు, ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ ఎర్రన్న వారసుడు రామ్మోహన్‌నాయుడు మరోవైపున్నారు. వీరిద్దరినీ మరోసారి చట్ట సభలకు పంపించేందుకు సిద్ధం కావాలని కోరుతున్నా. మీ స్పందన చూస్తే.. అటువైపు వ్యక్తికి గుండె వణకాలి. ప్రజాగళం సభల్ని చూస్తుంటే జనం.. జగన్‌రెడ్డిపై ఎంత కసితో ఉన్నారో కళ్లకు కనిపిస్తోంది. కొండనైనా బద్దలు చేస్తాననే ధైర్యం కలుగుతోంది. నాకు పదవి కాదు.. ప్రజల జీవితాలు ముఖ్యం. వారి జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా పని చేస్తా. దేశంలో, ప్రపంచంలో తెలుగువారిని అగ్రస్థానంలో నిలపాలన్నదే ఆకాంక్ష. ప్రతి క్షణం నా ఆలోచన రాష్ట్ర అభ్యున్నతి కోసమే. కూటమిని గెలిపించండి. ప్రజాస్వామ్యాన్ని, ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందాం అని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.