- ఉద్యోగుల నైపుణ్యాల పెంపుపై సీఎం దిశానిర్దేశం
- రెండున్నరేళ్లలో గృహ నిర్మాణం లక్ష్యాల పూర్తికి కార్యాచరణ
- రాష్ట్రంలో 20 లక్షల ఇళ్లకు సౌర విద్యుత్ కనెక్షన్లు లక్ష్యంగా ప్రణాళిక
- ఆర్టీజీఎస్ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి (చైతన్యరథం): ప్రజలకు అందించే ప్రభుత్వ సేవల్లో నాణ్యత పెరగాలంటే ఉద్యోగులు వారి సామర్థ్యాన్ని నిరంతరం పెంచుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు కొత్త విషయాలను నేర్చుకుంటూ తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు. కెపాసిటీ బిల్డింగ్ కమిషన్, మిషన్ కర్మయోగి పోర్టల్, ఉన్నతి ద్వారా అందుబాటులో ఉన్న ఆన్లైన్ కోర్సులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆన్లైన్ తో పాటు ఐఐఎంలు, ఐఐటీలు, విశ్వవిద్యాలయాలు తదితర సంస్థల్లో ఆఫ్‌లైన్ శిక్షణ కూడా పొందాలన్నారు. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో ఆర్టీజీఎస్ సమీక్షలో భాగంగా వివిధ శాఖలు అందిస్తున్న పౌర సేవలపై ముఖ్యమంత్రి సోమవారం సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగుల సామర్థ్య పెంపునకు ఐగాట్ మిషన్ కర్మయోగి ఆన్లైన్ కోర్సులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని సీఎం తెలిపారు. ఓ సెకండరీగ్రేడ్ టీచర్ ఏకంగా 4,200 కోర్సులు పూర్తిచేసి తన సామర్థ్యాన్ని పెంచుకున్న విషయాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావించారు.
ఉద్యోగులు తమ విధులకు సంబంధించిన అంశాలతో పాటు ఆధునిక సాంకేతికత, పరిపాలన, ప్రజా సేవకు సంబంధించిన కోర్సులను అభ్యసించా లని సూచించారు. సానుకూల ప్రజాభిప్రాయాన్ని పెంచుకోవడంలో వెనుకబడిన శాఖలు, విభాగాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని చెప్పారు. సామర్థ్య పెంపుతో పాటు ప్రజల్లో ప్రభుత్వంపై సానుకూల అభిప్రాయం పెరిగేలా శాఖలు కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. త్వరలో క్షేత్రస్థాయిలో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తానని సీఎం వెల్లడించారు.
గుంతల పూడ్చివేతకు ఆధునిక సాంకేతికత
రహదారులపై గుంతల పూడ్చివేతకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గుంతలను పూడ్చడంతో పాటు రహదారుల నిర్వహణపై నిరంతరం దృష్టి పెట్టాలని సూచించారు. బిటుమిన్ లభ్యత, ప్లైయాష్ అందుబాటులో ఉన్న పరిమాణంపై అధికారులను ఆరా తీశారు. ఆర్టీసీ బస్సులు నిర్ణీత సమయానికి గమ్యస్థానాలకు చేరేలా షెడ్యూలింగ్, టైమ్ మేనేజ్మెంట్ పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం చేపట్టిన మూడు లక్షల ఇళ్ల నిర్మాణంతో పాటు మరో ఆరు లక్షల ఇళ్ల నిర్మాణానికి కార్యాచరణ రూపొందించాలని సీఎం సూచించారు. వచ్చే రెండున్నర ఏళ్లలో నిర్దేశించుకున్న గృహ నిర్మాణ లక్ష్యాలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో అర్హులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సి ఉందని, దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను త్వరగా గుర్తించాలని చెప్పారు. ఎక్కడా డూప్లికేషన్ లేకుండా వన్ ఫ్యామిలీ-వన్ హౌస్ విధానంలో అర్హులకు వేగంగా ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని ఆదేశించారు.
సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు లక్ష్యాన్ని చేరుకోవాలి
జల్ జీవన్ మిషన్ ద్వారా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా తాగునీరు అందించే లక్ష్యాన్ని రెండేళ్లలో పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో చేపడుతున్న మౌలిక సదుపాయాల కల్పన పనులను కూడా వేగవంతం
చేయాలని సూచించారు. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో మొబైల్ కనెక్టివిటీ పెంచేందుకు అవసరమైన ప్రాంతాల్లో సెల్ టవర్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పీఎం సూర్యఘర్ పథకం కింద ఇళ్లపై సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇప్పటికే 4.1 లక్షల కనెక్షన్లతో దేశంలో నాలుగో స్థానంలో ఉన్నామని అధికారులు తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలపైనా సౌర విద్యుత్ ఫలకాల ఏర్పాటుతో 200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఆస్కారం ఉందని వివరించారు.
కుప్పం నియోజకవర్గంలో మొత్తం ప్రాంతాన్ని ఇళ్లపై సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్టు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల ఇళ్లకు సోలార్ కనెక్షన్లు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని సీఎం ఆదేశించారు.
పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ
రాష్ట్రంలో రానున్న పెట్టుబడులకు అనుగుణంగా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను రూపొందించాలని సీఎం సూచించారు. ప్రస్తుత పారిశ్రామిక అవసరాల కు అనుగుణంగా యువతకు నైపుణ్యాలు అందించా లని చెప్పారు. పీఎం సేతు-ఆర్సెలార్ మిట్టల్ స్కిల్ సెంటర్ ద్వారా మెరుగైన శిక్షణ అందించాలని, ఐటీఐలు, పాలిటెక్నిక్ కళాశాలలను పరిశ్రమలతో అనుసంధానించి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. ఉద్యోగ అవకాశాల కల్పన నిరంతర ప్రక్రియగా ఉండాలని, యువతకు ఆన్లైన్ కోర్సుల ద్వారా కూడా నైపుణ్యాలు పెంపొం దించాలని సూచించారు. నైపుణ్య పోర్టల్‌ను ఇతర వ్యవస్థలతో సమగ్రంగా అనుసంధానం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ సమీక్షలో రెవెన్యూ, ఆర్థిక, ఐటీ, మహిళా శిశు సంక్షేమం, సెర్ప్, రవాణా, దేవదాయ, అగ్నిమాపక శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.













