- టీడీపీ`జనసేన పొత్తుపై ప్రజల్లో పూర్తి విశ్వాసం
- ప్రజలు మార్పు కోరుకుంటున్నారని నవశకం సభతో స్షష్టమైంది
అమరావతి: యువగళం పాదయాత్రను దిగ్విజయంగా నిర్వహించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఎక్స్ వేదికగా అభినందించారు. విజయనగరం జిల్లా పోలిపల్లి సమీపంలో లక్షలాదిమంది ప్రజలు హాజరైన యువగళం – నవశకం సభను పరిశీలిస్తే ఏపీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారనే విషయం స్పష్టంగా తెలుస్తోందన్నారు. రాష్ట్ర పునర్వైభవాన్ని, పునర్నిర్మాణాన్ని ప్రజలు కోరుకుంటున్నారని తెలిసిపోతోందన్నారు. ప్రజా సమస్యలపై చేస్తున్న పోరాటానికి మద్దతు పలికిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ, జనసేన పొత్తుపై ప్రజలు సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారని తేలిపోయిందన్నారు. ప్రజల ఆకాంక్షలు మేరకు రాష్ట్ర పునర్నిర్మాణానికి రెండు పక్షాలూ కట్టుబడి ఉంటాయని చంద్రబాబు తెలిపారు. యువగళం – నవశకం బహిరంగ సభలో పాల్గొన్న వారందరికీ ప్రత్యేకంగా చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో మార్పు కోసం ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారని పేర్కొన్నారు.