.కేంద్ర ఫోరెన్సిన్ ల్యాబ్ ద్వారా విచారణ జరపండి
.పార్లమెంటుకు పంపింది తప్పుడు పనులకోసమా?
.టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్
విశాఖపట్నం జిల్లా (నర్సీపట్నం): తమపై ఎంపి గోరంట్ల మాధవ్ తప్పుడు ఆరోపణలు చేశారంటూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ పరువునష్టం దావా వేశారు. ఈ మేరకు లాయర్ ద్వారా మాధవ్ కు విజయ్ శుక్రవారం నోటీసులు పంపించారు. ఏపీలో ఎంపీ గోరంట్ల మాధవ్ ఎపిసోడ్ పొలిటికల్ హీట్ పెంచింది. ఈ క్రమంలో టీడీపీ నేత చింతకాయల విజయ్, మరికొందరిపై విమర్శలు చేశారు. ఎంపీ ఆరోపణలకు విజయ్ కౌంటర్ ఇచ్చారు.. తప్పుడు ఆరోపణలు చేసిన మాధవ్‌పై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. అంతటితో ఆగని విజయ్.. అన్నంత పని చేశారు. తాను ప్రెస్ మీట్ లో చెప్పిన విధంగా.. చిత్తశుద్ధితో రూ.50 లక్షలు పరువు నష్టం దావా వేసినట్లు విజయ్ తెలిపారు. లీగల్ నోటీసును గోరంట్ల మాధవ్‌కి పంపించినట్లు చెప్పారు. ఆయనకు చిత్తశుద్ధి ఉంటే ప్రూవ్ చేసుకోవాలని సవాల్ విసిరారు. మాధవ్ చేసిన ఆరోపణలపై స్పందిస్తూ విజయ్ ఓ వీడియోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అసలు మాధవ్‌కు తానేంటో.. తన చరిత్ర ఏంటో తెలుసా అంటూ ప్రశ్నించారు. ప్రెస్ మీట్ పెట్టి మరీ తన పేరు చెప్పినందుకు పరువు నష్టం దావా వేస్తానని ప్రకటించారు.. చెప్పినట్లే నోటీస్ పంపారు. పార్లమెంటులో రాష్ట్ర సమస్యలు ప్రస్తావించి, ప్రజలకు మేలు చేయడం కోసం ఎన్నుకుంటే.. ఆయన ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. టీడీపీ ఎంపీలను చూసి నేర్చుకోవాలని.. మూడేళ్లుగా ఏపీ సమస్యలపై అలుపెరుగకుండా పోరాటం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. పార్లమెంటులో రాష్ట్రం కోసం పోరాటం చేయడకుండా.. ఇలాంటి పనులు చేస్తారా అంటూ సెటైర్లు పేల్చారు. మాధవ్ ఎవరో కూడా ఎవరికీ తెలియదని.. అలాంటి ఆయన వీడియోను మార్ఫింగ్ చేయాల్సిన అవసరం లేదన్నారు. ఒక వేళ అలా చేయాలనుకున్నా.. అందుకోసం చేసిన ఖర్చు కూడా వృథా అని ఎద్దేవా చేశారు. తాము చట్టపరంగా పోరాటం చేస్తామని.. కేంద్ర ఫోరెన్సిక్ ద్వారా విచారణ జరపాల్సిందిగా పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీకి లేఖ రాస్తానని పేర్కొన్నారు. అంతేకాదు పార్లమెంటు ప్రివిలేజ్ కమిటీకి కూడా ఫిర్యాదు చేస్తానని విజయ్ తెలిపారు.