రాష్ట్రాభివృద్ధికి ఆధారమైన వార్షిక బడ్జెట్ రూపకల్పన వెనుక కసరత్తు, దూరదృష్టి ఉంది. రాష్ట్రాభివృద్ధికి దిక్సూచిగా బడ్జెట్ నిలవనుంది. కష్టాలున్నా కర్తవ్యాన్ని మరువని బడ్జెట్ ఇది. ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన 2025-26 వార్షిక బడ్జెట్.. ప్రజల కలలకు ప్రతిరూపం. ఇది అంకెల గారడీ కాదు, ఆచరణాత్మక అభ్యుదయ బడ్జెట్ అని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే కీలక ఘట్టం ఆవిష్కృతమైంది 2026-27 వార్షిక బడ్జెట్‌లో. రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం, అభివృద్ధి, ప్రజల ఆకాంక్షల కలబోతగా మూడో పద్దు ప్రవేశపెట్టారు మంత్రి పయ్యావుల. స్వర్ణాంధ్ర `2047 లక్ష్యంగా సాగుతున్న ప్రయాణంలో బడ్జెట్ ఒక కీలక మైలురాయి. అప్పులు, వడ్డీ చెల్లింపుల భారం భయపెడుతున్నా, సంక్షేమం, అభివృద్ధి మధ్య సమతుల్యత పాటిస్తూ బడ్జెట్ రూపొందించారు. ఆర్థిక సవాళ్లు ఆకాశమంతవున్నా, పాలకుల సంకల్పం బలంగావుంటే అసాధ్యం కాదని వివిధ రంగాలకు కేటాయింపులు నిరూపిస్తున్నాయి. సంక్షేమం రూపంలో సామాన్యుడిని ఆదుకుంటూనే, అభివృద్ధి రూపంలో రాష్ట్ర భవిష్యత్తుకు భరోసా ఇస్తుంది బడ్జెట్. స్వర్ణాంధ్ర స్వప్నాన్ని సాకారంచేసే దిశగా వేసిన బలమైన అడుగుగా బడ్జెట్‌ను చూడక తప్పదు. విద్య, వైద్యం, పట్టణ పరిపాలన, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, జల వనరులు, రహదారులువంటి శాఖలకు భారీగా నిధులు కేటాయించి అభివృద్ది, సంక్షేమంపట్ల కూటమి ప్రభుత్వ నిబద్ధతను చాటుకుంది.
రాష్ట్ర ప్రగతి రథానికి ఆర్థిక వనరులే ఇంధనం. ప్రజా సంక్షేమం, మౌలిక సదుపాయాల కల్పన, ఆర్థిక స్థిరత్వం అనే మూడు ప్రధాన స్తంభాలపై రాష్ట్ర బడ్జెట్ రూపొందించారు ఆర్థిక మంత్రి. బడ్జెట్ కేవలం ఆదాయ వ్యయాల పద్దు మాత్రమే కాదు, కోట్లాది ప్రజల ఆశలు, ఆకాంక్షల ప్రతిబింబం. రాజ్యాంగంలోని 202వ నిబంధన ప్రకారం అసెంబ్లీలో ప్రవేశపెట్టే వార్షిక ఆర్థిక నివేదికే బడ్జెట్. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో భాగంగా సంక్షేమ రంగానికి సింహభాగం కేటాయించారు. నిజమైన అభివృద్ధి అంటే భవనాలు మాత్రమే కాదు, మనుషుల అభివృద్ధి అని బడ్జెట్ నొక్కి చెబుతోంది. అభివృద్ధి మూలధన వ్యయంపై దృష్టి, సంపద సృష్టి కోసం ఆర్ధిక మంత్రి గట్టి ప్రయత్నం చేసారు. అమరావతి నిర్మాణం, రాజధాని పనుల వేగవంతం కోసం ప్రత్యేక నిధులు, పోలవరం ప్రాజెక్టు నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు కేంద్ర సాయంతో కూడిన కేటాయింపులు, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక కారిడార్లు, పోర్టుల అభివృద్ధి ద్వారా ఉపాధి కల్పనపై దృష్టిపెట్టారు.
2025-26లో రూ.3,22,359 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టగా, 2026-27 ఆర్థిక సంవత్సరానికి 10వేల కోట్లు పెంచి రూ.3,32,205 కోట్లతో బడ్జెట్ పెట్టారు. ప్రాధాన్యతా రంగాలకు భారీ కేటాయింపులు జరిపి సీఎం చంద్రబాబు లక్ష్యాలకు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ రూపకల్పన చేశారు. ప్రజలే ముందు అనే నినాదాన్ని బడ్జెట్ కేటాయింపుల్లో నిజంచేసి చూపించారు. గత ప్రభుత్వ పాలనలో విధ్వంసమైన ఏపీ పునర్నిర్మాణం ప్రారంభమైంది. ఆర్ధిక వ్యవస్థను పునాదులనుంచి పునర్నిర్మించాల్సి వున్నా ప్రజలపై పన్నుల భారం మోపకుండానే వీలైనంతగా ప్రభుత్వ ఆదాయం పెంపుకు కృషి చేస్తామని బడ్జెట్‌లో వాస్తవికతను ప్రజల కళ్లకు కట్టారు. సంక్షేమంతో ఏపీలో శ్రేయోరాజ్యం స్ఫూర్తిని చాటడం ద్వారా రాజ్యాంగ నిర్మాతల ఆశయాలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నట్లు రుజువుచేశారు. రెండు అంకెల వృద్ధి రేటు కేవలం గణాంకం కాదు. రాష్ట్ర ఆర్థిక శక్తికి, సమర్థ పాలనకు, పెట్టుబడుల సాధన, ప్రజల జీవన ప్రమాణాల పెంపుకు నమ్మకమైన సంకేతం. వ్యవస్థలను గాడిలోపెట్టి 20 నెలల్లో ఏపీ బ్రాండ్‌ను పునరుద్ధరించి, జీఎస్టీపీ మొత్తంగా 11.75శాతం వృద్ధిని సాధించడంతో ప్రభుత్వ రెండంకెల వృద్ధి రేటు లక్ష్యం నెరవేరింది.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం కీలకం. బడ్జెట్‌లో సాగునీటి ప్రాజెక్టులకు కేటాయింపులు పెరగడం, రైతుల ఆదాయ పెంపుదలకు సానుకూల సంకేతం. బడ్జెట్‌లో పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, ఐటీ రంగానికి ప్రాధాన్యత, స్టార్టప్‌లకు మద్దతు, ఆర్థిక క్రమశిక్షణ నిజమైన మార్పు, మూలధన వ్యయం పెంపు, పరిపాలనా ఖర్చుల నియంత్రణ, అప్పుల నిర్వహణ ప్రత్యేకతలు. ఇది కొనసాగితే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ స్థిరపడే అవకాశముంది. సొంత ఆదాయాన్ని పెంచుకుంటూనే, సంక్షేమ పథకాలను నిర్విరామం చేయడం కత్తిమీద సామే. అందుకు `కేంద్ర సాయం, విభజన హామీలు, ప్రత్యేక ప్యాకేజీల రూపంలో కేంద్రంనుంచి ఆశించిన స్థాయిలో నిధులు రాబట్టాల్సి వుంది. ఏదేమైనా కేటాయింపులు కాగితాలకే పరిమితం కాకుండా, అవి క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకున్నప్పుడే రాష్ట్రం అభివృద్ది చెందుతుంది. పారదర్శకమైన ఆర్థిక విధానాలు, క్రమశిక్షణతో కూడిన వ్యయం ఉన్నప్పుడే బడ్జెట్ ఆశించిన లక్ష్యాలను చేరుకుని రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తుంది.
నీరుకొండ ప్రసాద్












