రామతీర్థం ఘటన జగన్ వైఖరికి పరాకాష్ట
మత ఘర్షణలు చూసి ఆనందించే సైకో జగన్
నెల్లిమర్ల వారాహి విజయభేరిలో బాబు, పవన్ ధ్వజం
జగన్ సైకోయిజాన్ని భూస్థాపితం చేద్దాం
మూడు పార్టీల కలయిక.. రాష్ట్రం కోసమే: చంద్రబాబు
పదిమంది పచ్చగా ఉంటే జగన్ ఓర్వలేడు
దోపిడీ పాలనలో రాష్ట్రం సర్వనాశనం
గంజాయి రాష్ట్రం చేసిన ఘనత జగన్‌దే: పవన్ కల్యాణ్
ఉత్తరాంధ్ర అభివృద్ధి మా బాధ్యతని ఇద్దరు నేతల ప్రకటన
నెల్లిమర్ల (చైతన్యరథం): ఎన్డీఏ సర్కారు అయోధ్యలో రామాలయం కడితే.. రాష్ట్రంలో సైకో జగన్ రామతీర్ధంలో రాముడి తల తీసివేశాడు. దుండగ చర్య అందరినీ బాధించింది. రామతీర్థం ఘటనలో ఇప్పటి వరకు నిందితులెవరో తెలీదు. ప్రభుత్వం ఆ కేసులో తీసుకున్న చర్యలు లేవు. రాష్ట్రంలో దేవాలయాల మీద, అర్చకుల మీద దాడులు చేస్తున్నారు. జగన్ పాలనలో 200కు పైగా హిందూ దేవాలయాలపై దాడులు జరిగినా, ఏ కేసులోనూ పురోగతి లేదు. దోషులు దొరకరు. జగన్‌కు కావాల్సింది మతాల మధ్య గొడవలు. ఆ గొడవల్లో పాలన గురించి ఎవరూ పట్టించుకోరని అతని దుర్మార్గపు ఆలోచన. సీపంని విమర్శిస్తే బిలబిలమంటూ వచ్చే పోలీసులు, దేవుడి తల తీసేసిన కేసులో ప్రశ్నించిన వాళ్లపైనే కేసులు పెట్టారు. శాంతిభద్రతలను కాపాడటంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర స్వరంతో విమర్శించారు. బుధవారం నెల్లిమర్ల నియోజకవర్గం సింగవరంలో నిర్వహించిన వారాహి విజయ భేరీ సభలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ సంయుక్తంగా మాట్లాడారు. సభకు అశేషంగా హాజరైన జనసందోహాన్ని ఉద్దేశించి తొలుత చంద్రబాబు మాట్లాడుతూ `ప్రజలు అధికారమిస్తే దోపిడీకి లైసెన్స్ ఇచ్చినట్టు భావించిన జగన్ `రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడన్నారు. భోగాపురంలో ఎయిర్ పోర్టుకు 2750 ఎకరాల భూమి సేకరించి శంఖుస్థాపన చేస్తే, ఆ ప్రాజెక్టునూ జగన్ ముందుకు తీసుకెళ్లలేకపోయాడని దుమ్మెత్తిపోశారు. కూటమి అధికారంలోకి రాగానే ఉత్తరాంధ్ర అభివృద్ధికి శ్రీకారం చుడతామన్నారు. 2025కి భోగాపురం విమానాశ్రయం పూర్తి చేస్తామంటూ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు పూర్తి చేస్తే ఈ ప్రాంతం సశ్యశ్యామలం అవుతుందన్నారు. అది జరగాలంటే పోలవరం పూర్తి కావాలి. ఉత్తరాంధ్రకు నీరు రావాలి. ఈ దుర్మార్గ ముఖ్యమంత్రి అందరి కలలు చెరిపేశాడని దుయ్యబట్టారు. ఉత్తరాంధ్ర ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని వ్యాఖ్యానించారు. వైసీపీ పాలనలో చిన్న పరిశ్రమ వచ్చిందా? ఒక్క నీటిపారుదల ప్రాజెక్టు పూర్తి చేశాడా? ఇళ్లు కడుతున్నానని అడవుల్లో, శ్మశానాల్లో వసతులు లేకుండా కట్టాడు. తాను మాత్రం విశాఖలో రూ.500 కోట్లతో విలాసవంతమైన భవంతి కట్టుకున్నాడు. అందరూ బాగుపడిపోయారని చెబుతున్నాడు. రాష్ట్రంలో ప్రజల ఖర్చులు పెరిగాయి. ఆదాయం మాత్రం పెరిగింది లేదు. ప్రజల జీవన ప్రమాణం తగ్గిపోయింది. దీనికి ఈ అసమర్ధుడి చేతకాని పాలనే కారణం. పరిపాలన అంటే సంపద సృష్టించడం. ఆదాయం పెంచి సంక్షేమానికి ఖర్చు చేయాలి. కాని రివర్స్ పాలనతో జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశాడన్నారు.
రాష్ట్రాన్ని దోచుకున్న బందిపోటుని తరిమికొట్టాలి
వైసీపీని ఓడిరచి ప్రజలను గెలిపించాలనే కంకణం కట్టుకున్నామని, పవన్ కల్యాణ్‌తో కలిసి వైసీపీని భూస్థాపితం చేసేవరకూ వదిలిపెట్టేది లేదని చంద్రబాబు హెచ్చరించారు. ఇప్పటి వరకూ దోచుకున్న డబ్బుతో అక్రమాలకు పాల్పడుతూ, గెలుపు కోసం శవరాజకీయాలు, గులకరాయి డ్రామాలకు దిగాడని, జగన్‌ను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
కూటమి సంకల్పం రాష్ట్రం
జనసేన, బీజేపీ, టీడీపీ కలిసింది పదవుల కోసం కాదని, రాష్ట్రం నిలబడాలని త్యాగాలకు సిద్ధపడ్డామని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మా త్యాగాల ధ్యేయం ఒక్కటే సైకో పోవాలి. రాష్ట్రం బాగోవాలి. ప్రజలు మా మీద అభిమానాన్ని ఓట్ల రూపంలో వేసి మూడు పార్టీల అభ్యర్ధులను గెలిపించాలి అని చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నదుల అనుసంధానం బాధ్యత తీసుకుని పోలవరం పూర్తి చేస్తామన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేస్తామని, తారక రామతీర్ధ సాగర్ ప్రాజెక్టు వచ్చే ప్రభుత్వంలో పూర్తి చేస్తామన్నారు. నెల్లిమర్లను పారిశ్రామిక హబ్‌గా మారుసామని, జూట్ మిల్ బాధితుల్ని ఆదుకుంటామన్నారు. సూపర్ సిక్స్‌తో ప్రజలందరికీ న్యాయం చేస్తామని, కూటమి అభ్యర్ధుల్ని గెలిపించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. లోకం మాధవిని భారీ మెజార్టీతో గెలిపించాలని, సీటు త్యాగం చేసిన బంగార్రాజు భవిష్యత్తు తాను చూసుకుంటానని హామీ ఇచ్చారు. త్యాగాలు చేసిన జనసేన నాయకులను గుర్తించి ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పిస్తామని, జనసేన, టీడీపీ, బీజేపీల్లో ఉన్న సమర్ధ నాయకత్వాన్ని గుర్తించి ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసే బాధ్యత తీసుకుంటామన్నారు.
విజయభేరి సభలో జనసేన అధినేత పవన్ మాట్లాడుతూ `ఎన్టీఆర్ యూనివర్సిటీ నిధులు రూ.450 కోట్లు దోచేశాడని, ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్‌ను వారికే తెలియకుండా రూ.800 కోట్లు మాయం చేశాడని, పంచాయతీల కోసం కేంద్రమిచ్చిన రూ.8 వేల కోట్లు నిధులు పక్కదారి పట్టించాడని, ఆఖరికి చెమటోడ్చి కష్టపడే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి నుంచి రూ.450 కోట్లు అడ్డగోలుగా తీసుకున్నాడని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడబిడ్డల అభయ హస్తం ప్రీమియం నిధులు రూ.2 వేల కోట్లు ఎప్పుడు తీసుకున్నాడో తెలియకుండా తీసుకున్నాడని, ధరల స్థిరీకరణ నిధి నుంచి రూ.500 కోట్లు కాజేశాడని దుమ్మెత్తిపోశారు. రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసిన జగన్ అనే పెత్తందారుడి పాలనలో `గంజాయి రవాణాలో నెంబర్ వన్ అయ్యింది. ఎదురించిన వారిపై దేశ ద్రోహా కేసులు పెట్టడంలో నెంబర్ వన్‌గా నిలిచింది. జాతీయ ఉపాధి పథకం నిధుల దోపిడీలో నెంబర్ వన్‌గా రికార్డులకెక్కిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు ఆత్మహత్యల్లో మూడో స్థానం, మానవ అక్రమ రవాణాలో 3వ స్థానంలో రాష్ట్రం నిలిచిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రోత్సహించేవారులేక యువ శక్తి నిర్వీర్యమైపోతోందన్నారు. మంచిని, పచ్చగా ఉండటాన్ని సహించలేని సైకో పాత్ జగన్ అంటూ, ప్రతి ఒక్కరినీ మోసం చేసిన ప్రభుత్వాన్ని గద్దె దింపకపోతే ప్రజలు నష్టపోతారనే బలమైన సంకల్పంతోనే ఇప్పుడు ఎన్నికల బరిలో బలంగా పోరాడుతున్నామని ప్రకటించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించడంలో జగన్ పూర్తిగా విఫలమయ్యాడని, ఎన్టీయే కూటమి ప్రభుత్వంతో శాంతిభద్రతల పర్యవేక్షణకు మొదటి ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించారు.
జగన్‌ది ద్వంద నీతి
భోగాపురం ఎయిర్‌పోర్టు విషయంలో ప్రతిపక్ష నేతగా ఒకలా, అధికారంలోకి వచ్చాక మరోలా ప్రవర్తించడం జగన్‌కే చెల్లిందన్నారు. ఒకరు అభివృద్ధిని సాధిస్తే సహించలేని తత్వం జగన్‌దని, తెదేపా హయాంలో ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించిన జగన్.. తాను అధికారంలోకి రాగానే అదే ప్రణాళికను అమలు చేస్తూనే భూపందేరంలో కోట్లు గడిరచాడని విమర్శించారు. అమరావతి విషయంలో ప్రతిపక్షనేతగా సమర్థించిన జగన్, గద్దెనెక్కగానే మూడు రాజధానుల డ్రామాతో రాష్ట్రానికి రాజధానే లేకుండా చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. సైకో ప్రవర్తనతో విర్రవీగుతున్న జగన్‌ను వచ్చే ఎన్నికల్లో సరైన వ్యూహం వేసి అంతమొందించాలని పిలుపునిచ్చారు.
తొమ్మిదిసార్లు కరెంటు ఛార్జీలు పెంచాడు
జగన్ పాలనలో 9 సార్లు కరెంటు ఛార్జీలను పెంచాడు. రకరకాల పేర్లతో ఛార్జీలను వేశాడు. సామాన్యుడు స్విచ్ వేయాలంటేనే భయపడుతున్నాడు. కరెంటు తీగను పట్టుకుంటే కాదు.. కరెంటు స్విచ్ షాక్ తగులుతుందని భయపడాల్సిన పరిస్థితులు వచ్చాయి. దీని కోసం ఇంట్లో ఉన్న ఏసీలను, ఫ్రిజ్‌లను వేసవిలో ఆపాల్సిన పనిలేదు. మే 13వ తేదీన ఫ్యానును ప్రజలంతా కలిసి ఆపితే.. ఈ విద్యుత్ బాదుడు తప్పుతుందని పవన్ పిలుపునిచ్చారు.
నెల్లిమర్లకు తోడుగా నిలుస్తాం
ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం తనకు తెలుసని, మూడు జిల్లాల్లో వలసలు ఆగి, స్థానికంగా ఉపాధి పెరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి చేనుకీ నీరు, ప్రతి చేతికీ పని అనేది కూటమి ఉమ్మడి లక్ష్యమన్నారు. అధికారంలోకి రాగానే తారకరామ తీర్థ సాగర్ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామన్నారు. నష్టపోయిన ప్రతి రైతుకు ఆర్ అండ్ ఆర్ ప్రోగ్రాం కింద న్యాయం చేస్తాం. మన్యాలపేటలో కిడ్నీ వ్యాధిగ్రసులను ఆదుకునేందుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పడకల ఆస్పత్రి తీసుకొస్తామన్నారు.
సబ్ ప్లాన్ నిధులు మళ్లించము
స్థానిక ఎమ్మెల్యే బొడ్డుకొండ అప్పలనాయుడి భూ అక్రమాలకు చెక్ పెడతామన్నారు. మత్స్యకారులకు చెందిన భూములు లాక్కున్నారు. ఒక్క రోడ్డు వేయలేదు. కొండలు, గుట్టలు మొత్తం దోచేశారు. 2019లో భోగాపురం కడుతున్నాం అని తెలియగానే, భూముల్లో అవకతవలు జరిగాయి. ఇతడి అక్రమాలకు కళ్లెం వేస్తాం. కూటమి ప్రభుత్వంలో సబ్ ప్లాన్ ఫండ్స్‌ను వారికే ఖర్చు చేస్తాం. ఎస్సీలకు చెందిన 27 పథకాలు తిరిగి మళ్లీ పునరుద్ధరిస్తామని పవన్ కల్యాణ్ ప్రకటించారు. 25 సంవత్సరాల భవిష్యత్తు మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. వచ్చే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి అండగా నిలబడండి అని పవన్ కల్యాణ్ కోరారు. సభలో నెల్లిమర్ల ఎమ్మెల్యే అభ్యర్థి లోకం మాధవి, విజయనగరం ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు, మూడు పార్టీల నేతలు కర్రోతు బంగార్రాజు, పడాల అరుణ, బి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.