.తప్పు చేసినవాడిని జగన్ సమర్థించడమా?
.చర్యలు తీసుకోకపోవడం వల్లే నేతల్లో బరితెగింపు
.టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా
అమరావతి: ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి నైతిక విలువలు లేవని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా మండిపడ్డారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్ రెడ్డికి నైతిక విలువలు ఉంటే ఓ మహిళను అరగంట రావాలన్న అవంతి శ్రీనివాస్ ను మంత్రి పదవి నుంచి తొలగించి, మరో మహిళను గంట రావాలన్న అంబటి రాంబాబుకు మంత్రి పదవి ఇచ్చారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తమ నాయకులు చేసే తప్పులు సమర్థిస్తున్నందునే మిగతా నాయకులు పదేపదే తప్పులు చేస్తున్నారని మండిపడ్డారు. గోరంట్ల మాధవ్ చేసిన నీచపు పనిని జగన్‌రెడ్డి ఎందుకు సమర్థిస్తున్నారని ప్రశ్నించారు. ‘‘ఇటువంటి నీచపు పనులు చేసే వ్యక్తులను నేను క్షమించను’’ అని జగన్ నోటి వెంట ఎందుకు రావడంలేదని అడిగారు. తప్పు చేసిన గోరంట్ల మాధవ్ కంటే ఆ తప్పును సమర్థిస్తున్న ముఖ్యమంత్రిదే పెద్ద తప్పని ధ్వజమెత్తారు. జగన్‌రెడ్డికి ఆ వీడియో గోరంట్లదేనని ఇంటెలిజెన్స్ నివేదిక వచ్చినా కూడా అతనిని వెనకేసుకురావడంలో ఆంతర్యం ఏమిటని అడిగారు. తను చేసిన తప్పలకు మించి తమ నాయకులు చేయడంలేదని భావిస్తున్నారా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి మహిళల పట్ల చిత్తశుద్ధి లేదని అర్థమౌతోందన్నారు. దేశ వ్యాప్తంగా ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, మహిళా కమిషన్, రాజకీయ పార్టీలు విమర్శలు చేస్తున్నా, ఖండిస్తున్నా ముఖ్యమంత్రికి చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియోను చూసిన ప్రజాస్వామ్య వాదులు, మహిళా సంఘాల వారు తమకు ఏమిటీ దౌర్భాగ్య పరిస్థితి అని వాపోతున్నారని చెప్పారు. గోరంట్ల మాధవ్ కి చిత్తశుద్ధి ఉంటే ఆ విడియోని కేంద్ర ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపి నివేదిక తెప్పించగలరా అని సవాల్ విసిరారు. ఎంపీ మాధవ్‌పై ఎందుకు కేసు నమోదు చేయలేదని పోలీస్ శాఖను ప్రశ్నించారు.
తెలుగుదేశం పార్టీ వాళ్లు ఏదైనా చిన్న పోస్టు పెట్టినా వెతికి వెతికి పట్టుకుంటున్నారని, ఎంపీ ఒరిజినల్ వీడియోని జగన్ రెడ్డి ప్రభుత్వం పట్టుకోలేదా అని ప్రశ్నించారు. ఒరిజినల్ వీడియోని సంపాదించాలంటే సమయం పడుతుందని, వెతుకుతు న్నామని ఎస్పీ ఫకీరప్ప చెప్పటం కాలయాపన కోసమేనన్నారు. గోరంట్ల మాధవ్ మాత్రం నిజం తేలిపోయినట్లు కడిగిన ముత్యంలా బయటికి వచ్చినట్లు కితాబిచ్చుకుంటున్నారని విమర్శించారు. ప్రజలు గోరంట్ల మాధవ్‌ను అత్యున్నతమైన పార్లమెంటులో కూర్చోబెట్టింది బట్టలు లేకుండా నగ్నంగా వీడియో కాల్స్ మాట్లాడటానికాఅని ప్రశ్నించారు. బీసీ అని చెప్పుకుంటున్న గోరంట్లను బీసీలే ఛీదరించుకు ంటున్నారని చెప్పారు. దయచేసి బీసీ అని చెప్పుకోవద్దని బీసీ నాయకులు కోరుతున్నారన్నారు. ప్రజలు 151 ఎమ్మెల్యేలను, 22 మంది ఎంపీలను ఇస్తే నువ్వు చేసే నిర్వాకం ఇదా జగన్ రెడ్డీ అని ప్రశ్నించారు. నేడు పార్లమెంటుకి మాధవ్ వెళితే 539 మంది సభ్యులు ఉమ్మేసే పరిస్థితి ఉందన్నారు. గోరంట్ల మాధవ్ నోటిని అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. దేశ వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ గోరంట్ల బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇటువంటి వారిపై చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో ప్రజలే జగన్ రెడ్డికి సమాధానం చెబుతారని నాగుల్ మీరా హెచ్చరించారు.