- నిత్యావసరాల ధరలు నియంత్రించాలి
- బ్లాక్ మార్కెటీర్లపై కఠిన చర్యలు
- ధరల పెరుగుదలపై నిరంతర పర్యవేక్షణతో సత్ఫలితాలు
- పౌరసరఫరాలు, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల మధ్య సమన్వయం అవసరం
- సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి (చైతన్యరథం): నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. నిత్యావసర వస్తువుల ధరల భారం ప్రజలపై పడకుండా పౌరసరఫరాల శాఖ తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం సమీక్షించారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా సాధ్యమైనంత వరకు ప్రజలపై నిత్యావసరాల భారం పడకుండా చూడాలని అధికారులకు సీఎం సూచించారు. డిమాండ్-సప్లయి మధ్య వ్యత్యాసానికి గల కారణాలను విశ్లేషించి తగు చర్యలు చేపట్టాలన్నారు. ధరలు పెరిగిన తరువాత తగ్గించే ప్రయత్నం చేయడం, సబ్సిడీలో అందించడం కంటే…. మూడు శాఖలు నిరంతర పర్యవేక్షణ ద్వారా ధరల పెరుగుదలను ముందుగానే గ్రహించి అందుకు తగిన విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో పౌరసరఫరాల, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలు సమన్వయంతో పనిచేస్తే ఫలితాలు వస్తాయన్నారు.
నిత్యావసర వస్తువుల ధరల భారం తగ్గించేందుకు ఇప్పటి వరకు తీసుకున్న చర్యలను సీఎంకు అధికారులు వివరించారు. నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు తాత్కాలికంగా, దీర్ఘకాలికంగా చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో చర్చించి ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో జరిగిన ఈ సమీక్షలో మంత్రులు నాదెండ్ల మనోహర్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్ ఆన్లైన్ విధానంలో హాజరయ్యారు. ప్రస్తుతం రైతు బజార్లలో కౌంటర్ల ద్వారా చేపట్టిన అమ్మకాలపై సమీక్షలో వివరించారు. రైతు బజార్‌ల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి పామాయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్, కందిపప్పు, టమోటా, ఉల్లిపాయలు మార్కెట్ ధర కంటే రూ.10 నుంచి రూ.15 తక్కువకు అమ్మకాలు చేస్తున్నట్లు తెలిపారు.
విజిలెన్స్ డిపార్ట్మెంట్ క్రియాశీలకంగా పనిచేయాలని, వ్యాపారులు కూడా సహకరించేలా చూడాలని అధికారులకు సీఎం సూచించారు. బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మన రాష్ట్రంలో పామాయిల్, కూరగాయలు, పప్పుల వంటి ఉత్పత్తులు పెంచేందుకు వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రణాళిక అమలు చేయాలని సూచించారు. పెద్ద ఎత్తున గిడ్డంగులను అందుబాటులోకి తేవడం ద్వారా రైతులకు, వినియోగదారులకు కూడా న్యాయం చేయవచ్చని సీఎం సూచించారు. ధరల నియంత్రణ విషయంలో ప్రజలకు ఉపశమనం కల్పించేలా చర్యలు ఉంటేనే వారు హర్షిస్తారని….ఆ స్థాయిలో అధికారులు ప్రణాళికలను అమలు చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు.