- పోలీసు విచారణలో వైసీపీ నేతల సమాధానాలు
- టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసు
- మంగళగిరి రూరల్ పీఎస్‌లో పాస్‌పోర్టులు అప్పగించిన నేతలు
అమరావతి(చైతన్యరథం): టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన కేసులో వైసీపీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురామ్, పార్టీ నాయకుడు దేవినేని అవినాష్, న్యాయవాది గవాస్కర్ శనివారం మంగళగిరి రూరల్ పోలీసు స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. 48గంటల్లో విచారణ అధికారికి పాస్‌పోర్టులు అందజేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తలశిల రఘురామ్, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, గవాస్కర్ మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్లో పాస్‌పోర్టులు అందజేశారు. మంగళగిరి డీఎస్పీ మురళీకృష్ణ, అదనపు ఎస్పీ కొల్లి శ్రీనివాసరావు, ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వీరిని విచారించారు. ఆరోజు ఘటనలో తమకేది గుర్తులేదని వైసీపీ నేతలు చెప్పినట్లు తెలిసింది. అప్పటి సీఎం జగన్‌ను విమర్శించినందుకే కార్యకర్తలు దాడి చేసినట్లు తమకు తెలుసన్నారు. ఆరోజు తాము ఎక్కడా ప్రత్యక్షంగా పాల్గొనలేదని చెప్పినట్లు తెలిసింది. విచారణ అధికారులు ఏ విషయాలు అడిగినా తమకు తెలియదని, గుర్తు లేదని సమాధానాలు చెప్పినట్లు సమాచారం. ఈ సందర్భంగా మంగళగిరి పోలీస్ స్టేషన్ వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.