తెనాలి, వినుకొండ (చైతన్యరథం): కార్యకర్తల కుటుంబాలకు ఇబ్బంది వస్తే ఆదుకునేందుకు ఎంత దూరమైనా వెళతామని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి గుంటూరు జిల్లా తెనాలి, వినుకొండ నియోజకవర్గాల్లో గురువారం భువనేశ్వరి పర్యటించి కార్యకర్తల కుటుంబాలను పరామర్శించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక మనస్తాపానికి గురై గుండెపోటుతో మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శించి, ధైర్యం చెప్పేందుకు నిజం గెలవాలి పేరుతో భువనేశ్వరి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. నిజం గెలవాలి తుది విడత పర్యటన గురువారం మొదలు కాగా.. తెనాలి, వినుకొండ నియోజకవర్గాల్లో రెండు కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించారు. మృతి చెందిన కార్యకర్తల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
తనను చూసి ఉద్వేగానికి గురైన మృతుల కుటుంబసభ్యులను ఓదార్చి, ధైర్యం చెప్పారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్నుండి వచ్చిన భువనేశ్వరికి గన్నవరం విమానాశ్రయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుండి ఆమె తెనాలి నియోజకవర్గం కొలకలూరు చేరుకుని గత ఏడాది సెప్టెంబర్ 13న మృతి చెందిన దాచేపల్లి శివరామయ్య కుటుంబాన్ని పరామర్శించారు. తరువాత వినుకొండ నియోజకవర్గం, శావల్యాపురం మండలం, వేల్పూరు గ్రామంలో గత ఏడాది సెప్టెంబర్ 10న మృతి చెందిన బోయపాటి మణికంఠ (24) కుటుంబాన్ని పరామర్శించారు.