- రాజకీయ కక్షల కోసం వ్యవస్థల దుర్వినియోగం
- టీడీపీ నేతలే లక్ష్యంగా అక్రమ కేసులు
- గతంలో సీఐడీ, ఇప్పుడు డీఆర్ఐ
- ప్రభుత్వ తప్పుడు చర్యలను అడ్డుకోవాలి
- రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు చంద్రబాబు లేఖ
అమరావతి (చైతన్యరథం): రాష్ట్ర ప్రభుత్వం వ్యవస్థలను రాజకీయ కక్షల కోసం వాడుకుంటూ తమ పార్టీ నేతలను వేధిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు, కార్యకర్తల అణచివేతే లక్ష్యంగా అధికార పార్టీ అక్రమ కేసులు పెడుతోందన్నారు. గవర్నర్ జోక్యం చేసుకుని ప్రభుత్వ చర్యలను నిలువరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు చంద్రబాబు శుక్రవారం ఒక లేఖ రాశారు. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు అక్రమ అరెస్టును ప్రస్తావిస్తూ ఏపీఎస్ డీఆర్ఐ దుర్వినియోగాన్ని లేఖలో తెలియపరిచారు. ప్రభుత్వ విభాగాల ద్వారా టీడీపీ నేతలు, కార్యకర్తలపై జగన్ అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నాడు. డీఆర్ఐ ద్వారా టీడీపీ నేతలను బెదిరించి ఆర్థికంగా, రాజకీయంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ప్రతిపక్షాలను వేధించేందుకు డీఆర్ఐని ప్రభుత్వం ఆయుధంగా వాడుకుంటోంది. అధికార పార్టీకి విధేయుడైన చిలకల రాజేశ్వరరెడ్డిని ఆ సంస్థకు ప్రత్యేక కమిషనర్‌గా నియమించుకుని టీడీపీ నేతలను లక్ష్యంగా పెట్టుకుని పని చేస్తున్నారు. పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావును కూడా ఈ విభాగం ద్వారా కేసుల పెట్టి ఇబ్బందులు పెట్టారు. మళ్లీ ఇప్పుడు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌ను కేసులో ఇరికించి అరెస్టు చేశారు. శరత్ పనిచేసిన సంస్థలో కేవలం 68 రోజులు మాత్రమే అడిషనల్ డైరెక్టర్‌గా విధులు నిర్వహించారు. అయినా డీఆర్ఐ డిప్యూటీ డైరెక్టర్ సీతారామ్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో ప్రభుత్వం జరిమానా విధించి విచారణ జరుపుతోంది. కేంద్ర సంస్థ అయిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటలిజెన్స్ విచారణ చేస్తుండగానే మళ్లీ అదే అంశాన్ని ఏపీఎస్ డీఆర్ఐ విచారణకు స్వీకరించడం ఆశ్చర్యంగా ఉంది. టీడీపీ నేతలు, కుటుంబ సభ్యులే లక్ష్యంగా తప్పుడు కేసులను ప్రభుత్వం బనాయిస్తోంది. అసలు రాష్ట్రంలో డీఆర్ఐ ఎందుకు ఏర్పాటు చేశారు…దాని లక్ష్యాలు ఏమిటి? కేవలం టీడీపీ నేతలను వేధించడమే డీఆర్ఐ పనా? రాష్ట్రంలో డీఆర్ఐ ఏర్పడ్డాక ఎన్ని కేసులు నమోదు చేసింది? ప్రభుత్వం సీఐడీని జేబు సంస్థగా మార్చుకుని ఇప్పటికే ప్రత్యర్థి పార్టీ నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తోంది. ఇప్పుడు మళ్లీ కొత్తగా డీఆర్ఐ ద్వారా ప్రత్యర్థులను ఆర్థికంగా, రాజకీయంగా బలహీనపరిచే కుట్ర చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో డీఆర్ఐ వేధింపులు భరించలేక పలువురు వ్యాపారవేత్తలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుందనే భయంతో టీడీపీ నేతలను టార్గెట్ చేసి వేధిస్తున్నారు. ఇలాంటి చట్టవ్యతిరేక పనులు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. గవర్నర్ తక్షణం జోక్యం చేసుకుని ఏపీఎస్ డీఆర్ఐని దుర్వినియోగం చేసే ప్రభుత్వ చర్యలను అడ్డుకోవాలని చంద్రబాబు కోరారు.