- నేను పర్యటనకు వస్తున్నానని తెలిసి నేడు జగన్ బయటకొచ్చాడు
- అహంకారంతో విర్రవీగితే తెలంగాణ పరిస్థితే ఇక్కడా
- ఈ ప్రభుత్వం పరిహారం పెంచి ఇవ్వకపోతే.. 3 నెలల తర్వాత నేనే ఇస్తాను
- తప్పు చేయకున్నా నన్ను జైలుకు పంపి క్షోభపెట్టారు
- కాలువల్లో పూడికలు తీయలేదు, రైతులకు గోనె సంచులు ఇవ్వలేదు
- తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి రైతులకు భరోసా ఇచ్చిన టీడీపీ అధినేత
ఉమ్మడి గుంటూరు జిల్లా: ప్రకృతి విపత్తుకు మానవ తప్పిదం తోడవటం వల్లే రైతులు తీవ్రంగా నష్టపోయా రని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు అన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా రేవేంద్రపాడు, నందివెలుగు, అమర్తలూరు గ్రామాల్లో మిచౌంగ్ తుఫాన్ తో దెబ్బతిన్న పంటలను టీడీపీ నేతలతో కలిసి శుక్రవారం చంద్రబాబు పరిశీలించా రు. రైతులతో మాట్లాడి వారి కష్టాలు తెలుసుకున్నారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్‌కు ఉల్లిగడ్డకు, ఆలుగడ్డకు తేడా తెలియదని ఎద్దేవా చేశా రు. పొటాటో అంటే ఏంటని రైతుల్ని అడుగుతున్నా రు.. ఇంతకంటే దారుణం ఏమైనా ఉందా? జగన్‌రెడ్డికి తప్పుడు పనులు చేయటం తప్ప ఇంకేం తెలియదు. ఇలాంటి ముఖ్యమంత్రికి రైతుల కష్టాలు ఎలా తెలుస్తా యని ప్రశ్నించారు. విపత్తులు వచ్చినప్పుడే ప్రభుత్వ సమర్థత బయటపడుతుందన్నారు. మిచౌంగ్ తుఫాన్ తో వైసీపీ చేతకాని తనం బయటపడిరది. తుఫాన్ తో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. కౌలు రైతుల్ని చూస్తుంటే మనసు తరుక్కుపోతోంది. చేతికి వచ్చే సమయంలో పంట నీళ్ల పాలైంది, ఈ ఏడాది కరువు వల్ల సగం మంది రైతులు పంటలు సాగు చేయలేదు. వేసిన వారు కష్టపడి పంట నిలబెట్టుకుంటే ఇప్పుడు ఈ తుఫాన్ మింగేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
పంట బీమా ప్రీమియం కూడా చెల్లించలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం
వేసిన పంట నీళ్ల పాలైంది, నష్టపోయిన వారిలో ఎక్కవ మంది కౌలు రైతులే. ఎకరాకు రూ.20 వేలు కౌలు, పెట్టుబడికి మరో రూ.20 నుంచి రూ.40 వేలు ఖర్చు చేశారు. మరో 15రోజులుంటే పంట చేతికొచ్చేది కానీ తుఫాన్‌తో పంట అంతా నీటి పాలైంది. ప్రకృతి విపత్తులు సాధారణం.. కానీ ఇందులో మానవ తప్పి దం కూడా కూడా ఉంది. తుఫాన్ వస్తుందని ముందు గానే సమాచారం ఉన్నా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టలేదు. కనీసం గోనె సంచులు కూడా ఇవ్వలేదు. నేడు నేనొస్తున్నానని తెలిసి చిరిగిపోయిన సంచులు ఇస్తున్నారు. డ్రెయినేజీ వ్యవస్ధకు నాలుగున్నరేళ్లలో ఒక్క రూపాయి ఖర్చు చేయలేదు, మురుగు కాలువలు గాలి కొదిలేశారు. టీడీపీ హయాంలో ఎప్పటికప్పుడు పంట కాలువల్లో పూడిక తీశాం. కానీ నేడు ఎక్కడైనా పంట కాలువల్లో పూడిక తీశారా? డ్రెయిన్స్ శుభ్రం చేశారా? మురుగునీరు పొలాల్లోకి వెళ్లి పొలాలు మునిగిపోయా యి. పంటలు మునిగి రైతులు అల్లాడుతుంటే ఇంత వరకు ప్రభుత్వ యంత్రాంగం వచ్చి నస్టాన్ని పరిశీలించ లేదు. ఇక బీమా సంగతి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచింది. పసల్ బీమా ఒక్కరికైనా వచ్చిందా? ఖరీఫ్ పంటలకు సంబంధించి జూలై 15 కి పసల్ బీమా ఖరారు చేయాలి. పోర్టల్ లో చూస్తే కేవలం 16 మంది రైతులకే పసల్ బీమా ఉంది. కనీసం పంట బీమా ప్రీమియం కూడా చెల్లించలేని దుస్ధితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇలాంటి సమయంలో ముఖ్యమంత్రి ప్రతిపక్షాల కంటే ముందే రైతుల వద్దకు వచ్చి సమస్య లు తెలుసుకోవాలి.తుపాను ప్రభావిత ప్రాంతాల్లో తాను పర్యటనకు వెళ్తున్నానని తెలిసే ఇప్పుడు సీఎం జగన్ హడావుడిగా బయల్దేరారన్నారు. తన పర్యటన ఖరారైతే తప్ప జగన్‌లో కదలిక రాలేదని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి నేడు చుట్టపు చూపుకోసం పర్యటనకు వెళ్లారు. తుఫాన్ బాపట్ల తీరంలో క్రాస్ అయితే జగన్ మాత్రం తిరుపతిలో తిరుగుతున్నాడు. 2014లో ఇన్ పుట్ సబ్సిడీ ఎకరాకు రూ.10 వేలుంటే మేము రూ. 20 వేలకు పెంచాము. జగన్ వచ్చి దానిని తగ్గించేశా డు. ఐదేళ్లలో రైతులకు జగన్‌రెడ్డి ఏంచేశారు? రైతుల కు ఇన్‌పుట్ సబ్సిడీ కూడా సక్రమంగా ఇవ్వలేదు. జగన్ ప్రభుత్వం పరిహారం పెంచి ఇవ్వకపోతే మూడు నెలల తరువాత అధికారంలోని వచ్చే తామే ఇస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.
తప్పు చేయకున్నా నన్ను జైలుకు పంపి క్షోభపెట్టారు!
45 ఏళ్ల రాజకీయ జీవితంలో నేను ఏ తప్పు చేయ లేదు, అలాంటి నన్ను అక్రమ కేసు పెట్టి జైల్లో పెట్టి వేధించారు. చేయని తప్పుకు ఎంతో క్షోభ అనుభవించా ను. అధికారం ఉందికదా విర్రవీగొద్దు. 3నెలల తర్వాత మీ పరిస్ధితి ఏంటో ఆలోచించండి. అహంకారంతో విర్రవీగిన తెలంగాణలో పరిస్ధితి ఏమైందో చూడండి. రేపు రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి వస్తుంది. ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రశ్నించిన నాయకులు, ప్రజలపై అక్రమ కేసులు పెట్టి జైలులో వేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు.
ఎక్కువ అప్పులున్న రైతుల పరంగా మన రాష్ట్రం దేశంలోనే నెం.1 స్ధానంలో, కౌలు రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే 2 స్దానంలో ఉంది. రైతులు ఎలా బతకాలి, ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలి. నష్టపోయినవా రందకీ న్యాయం చేయాలి. మీకు జరిగిన అన్యాయంపై పోరాడుదాం, మీకు నేను అండగా ఉంటా…అందరం కలిసి పోరాడుదామని హామీ ఇచ్చారు.
అంతకు ముందు మార్గమధ్యంలో మంగళగిరి నియోజకవర్గం రేవేంద్రపాడులో దెబ్బతిన్న పంటలను చంద్రబాబు పరిశీలించారు. తుఫాన్‌తో తీవ్రంగా నష్టపోయామంటూ ఉరి తాళ్లు మెడలో వేసుకుని చంద్రబాబు ఎదుట రైతులు వాపోయారు. ఈ సంద ర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ…చేతికొచ్చిన పంట మునిగిపోయి అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఆరుగాలం శ్రమించి పండిరచిన పంట ప్రభుత్వ వైఫ ల్యం వల్లే నీటి పాలైంది, తుఫాన్ వస్తుందని తెలిసినా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టడంలో విఫలమైం ది. తుఫాన్ తర్వాత బాధితులను ఆదుకోవటంలోనూ విఫలమైంది. తుఫాన్ వచ్చి ఇన్ని రోజులైనా పంటనష్టం అంచనా వేయలేదంటే ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి? రైతులంటే ముఖ్యమంత్రికి లెక్కలేదు. పంట నష్టపో యిన ప్రతి రైతును ఆదుకునేవరకు ప్రభుత్వాన్ని వదలి పెట్టమని చంద్రబాబు నాయుడు అన్నారు.
ముఖ్యమంత్రిది బాధ్యతరాహిత్యం!
తుఫాన్‌తో పంట నష్టపోయి రైతులు కన్నీరు పెడు తుంటే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి బాధ్యతరాహిత్యంగా వ్యవహరించటం సిగ్గుచేటని చంద్రబాబు మండిపడ్డా రు. తెనాలి నియోజకవర్గంలో వరి, అరటి, మినుము, పెసలు వంటి పంటలు దెబ్బతిన్నాయి. 30వేల ఎకరా ల్లో 80శాతం పంట నష్టం జరిగింది. వేమూరు నియో జకవర్గంలో 90 వేల ఎకరాల్లో పంట సాగుచేస్తే 90 శాతం పంట నష్టపోయారు. వరి అంతా నేలకొరిగింది. ఎకరాకు రూ.50వేలు ఖర్చుచేశారు, ప్రతి రైతు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇంతవరకు అధికారులు ఎవరైనా వచ్చారా? ముఖ్యమంత్రి భూమ్మీద తిరగకుండా ఆకా శంలో తిరుగుతున్నారు. రైతులు ఎవరూ కోలుకునే పరిస్ధితి లేదు. జూలైలో రైతులు నారు మళ్లు వేశారు. కానీ ప్రభుత్వం నీళ్లివ్వకపోయినా కష్టపడి నీరు పారించుకుని పంట నిలుపుకున్నారు.
చేతికొచ్చిన పంట తుఫాన్ దాటికి నేలపాలయ్యింది. రేపల్లె నియోజకవర్గంలో లక్ష ఎకరాల్లో పంట సాగు చేస్తే 60 వేల ఎకరాల్లో నష్టం జరిగింది. బాపట్ల నియోజకవర్గంలో 45 వేల ఎకరాలు సాగు చేస్తే 45 వేల ఎకరాల్లో నష్టం జరిగింది. ఒక్క ఈ ప్రాంతంలోనే ఇన్ని వేల ఎకరాల్లో నష్టం వాటిల్లిందంటే ఇక రాష్ట్రం మొత్తం ఎన్ని లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లివుంటుంది? హుదూద్ తుఫాన్ సమయంలో తుఫాన్ కంటే ముందుగా నేను విశాఖ వెళ్లి అక్కడి ఉండి పరిస్ధితులు చక్కదిద్దా. వైసీపీ మంత్రులు సాధికార యాత్ర అంటూ తిరుగుతున్నారు. వాళ్ల మాటలు కోటలు దాటుతున్నాయి తప్ప చేతలు గడప కూడా దాట లేదు. చేతకాని పాలనతో ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. నాలుగున్నరేళ్ల నుంచి పంట కాలువలు బాగుచెయ్యకుండా తవ్వకుండా ఏం చేస్తున్నారు? పంట కాలువలు తవ్వితే నేడు రైతులు నష్టపోయేవారా? నాలుగున్నరేళ్లలో ఒక్క రోడ్డు అయినా వేశారా? అన్ని వ్యవస్ధలు విచ్చిన్నం చేశారు. ప్రజా వేదికతో మొదలైన జగన్ రెడ్డి విధ్వంసం నేటికీ కొనసాగుతూనే ఉంది. మాట్లాడితే అక్రమ కేసులు పెడుతున్నారు. ఈనాడు, ఆంద్రజ్యోతి చదవొద్దు, ఈటీవీ, టీవీ 5 చూడొద్దని జగన్ అంటున్నారు, ఆయన సాక్షి మాత్రమే చదవాలి, సాక్షి టీవీనే చూడాలి అంట. జగన్ రెడ్డి అందర్నీ తన కోసం పనిచేసే బానిసలు అనుకుంటున్నారు. అంత అహంకారం ప్రజాస్వామ్యంలో పనికొస్తుందా? నాలుగున్నరేళ్లలో ప్రజలకు ఈయన చేసిందేంటి? తుఫాన్ వస్తుందని తెలిసినా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదు. ప్రతిపక్షం కంటే అధికార పక్షం బాధ్యతాయుతంగా ఉండాలి. కానీ ముఖ్యమంత్రి బాధ్యతాహిత్యంగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు.
టీడీపీ ఇచ్చిన పరిహారాన్ని తగ్గించారు!
టీడీపీ హయాంలో వరికి నష్టపరిహారం హెక్టారుకు రూ. 20 వేలిస్తే నేడు రూ. 15 వేలకు తగ్గించారు. ఎరువుల ధరలు, ట్రాక్టర్ ఖర్చులు పెరిగాయి. ఇప్పుడు నష్టపోయిన రైతులకు హెక్టారుకు రూ. 30 నుంచి రూ. 40 వేలు పరిహారం ఇవ్వాలి. ఈ ముఖ్యమంత్రి ఇవ్వకపోతే మరో 3 నెలల్లో టీడీపీ ప్రభుత్వం వస్తుంది. నష్టపోయిన వారందరినీ ఆదుకుంటా. ప్రజల్లో చైతన్యం రావాలి, ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలి. టీడీపీ హయాంలో ఆక్వా కల్చర్ కి రూ. 30 వేలు ఇస్తే దాన్ని రూ. 8200 తగ్గించారు. కనీసం రూ. 50 వేలివ్వాలి. నాడు చనిపోయిన వారికి మేం ఇచ్చిన రూ. 5 లక్షలే ఇస్తున్నారు. మేం ఉంటే రూ. 10 లక్షలు ఇచ్చే వాళ్లం. గాయపడిన వారికి రూ. 1 లక్ష ఇచ్చాం, కానీ వీళ్లు రూ. 12,500 ఇస్తున్నారు. దాన్ని రూ. 2 లక్షలకు పెంచాలి. ఇల్లు కూలిపోతే రూ.4 లక్షలతో కొత్త ఇల్లు కట్టించాం. కానీ నేడు రూ. 1 లక్షా 80 వేలిచ్చి చేతులు దులుపుకున్నారు. రూ.1 లక్ష ఇచ్చి ఉచితంగా ఇల్లు కట్టించాలి. దెబ్బతిన్న ఇళ్లకు నాడు రూ.10 వేలిస్తే నేడు రూ.5200కు తగ్గించారు. దాన్ని రూ.20 వేలకు పెంచాలి. పశువుల షెడ్డుకు నాడు రూ.10 వేలిస్తే నేడు రూ.2 వేలిస్తున్నారు. దాన్ని రూ.20 వేలకు పెం చాలి.
అరటికి మేం రూ.30 వేలిస్తే నేడు రూ. 20 వేలిస్తున్నారు, 40 వేలివ్వాలి. పత్తికి రూ. 15 వేలిచ్చాం దాన్ని తీసేశారు. రూ. 25 వేలివ్వాలి. మిరపకు మేం రూ.15 వేలిస్తే వీళ్లు దాన్ని తీసేశారు. రూ.50 వేలి వ్వాలి. నాడు వేరు శనగకు రూ. 15 వేలు ఇస్తే నేడు కూడా అంతే ఇస్తున్నారు. రూ. 25 వేలకు పెంచాలి. జొన్నకు రూ.10 వేలిస్తే రూ.6500కు తగ్గించారు. మెక్కజొన్నకు రూ. 15 వేలు ఇస్తే నేడూ రూ.15 వేలే ఇస్తున్నారు. జీడిపంటకు రూ.30 వేలిస్తే రూ.20 వేలకు తగ్గించారు, రూ.50 వేలకు పెంచాలి. మేం కొబ్బరి చెట్టుకు రూ.1500 ఇస్తే నేడు రూ. 1000కి తగ్గించారు. రూ.3 వేలివ్వాలి.మామిడికి ఎకరాకు రూ. 30 వేలిస్తే రూ.20 వేలుచేశారు, రూ. 40 వేలివ్వాలి. ఉపాధి కోల్పోయిన చేనేత కార్మికులకు రూ 10 వేలిస్తే నేడు వీళ్లు అసలు ఇవ్వడం లేదు. దాన్ని రూ.20 వేల కు పెంచాలి. మరణించిన ఆవుకు నాడు రూ.30 వేలిస్తే నేడు తగ్గించారు. రూ.40 వేలివ్వాలి. గొర్రెలకు మేకలకు రూ.3 వేలు ఇస్తున్నారు. రూ.6 వేలు చేయా లి. తోపుడు బండ్లకు రూ.10 వేలిస్తే రూ.5 వేలు చేశా రు. దెబ్బతిన్న పడవలకు రూ.1 లక్ష ఇస్తే దాన్ని వీళ్లు తగ్గించారు. నాడు మేం దెబ్బతిన్న వలకు రూ.10 వేలిస్తే నేడు రూ.2,100 ఇస్తున్నారు, దాన్ని రూ.25 వేలకు పెంచాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
25 కేజీల బియ్యంతో జీవితాలు బాగుపడతాయా!
నేడు జగన్ రెడ్డి బాధితులకు 25 కేజీల బియ్యం ఇచ్చామంటున్నారు. ఆ 25 కేజీల బియ్యంతో జీవితాలు బాగుపడతాయా? టీడీపీ హయాంలో నేత కార్మికులు, మత్స్య కార్మికులకు 50 కేజీల బియ్యం ఇవ్వటంతో పాటు ఖర్చులకు రూ. 5 వేలిచ్చాం. కానీ నేడు రూ. 2,500 ఇస్తారంట. వైసీపీ ప్రభుత్వం పేదల్ని అన్ని విధాల ఇబ్బందులకు గురి చేస్తోంది. నాకు భాద, ఆవేదన ఉంది. కానీ తిట్టాలంటే మనసు రావటం లేదు. ఎన్ని సార్లు చెప్పినా జగన్ రెడ్డికి అర్దం కాదు. తుఫాన్ వచ్చి ఇన్నిరోజులయ్యింది ప్రభుత్వం నుంచి బాధితులకేమైనా సాయం అందిందా? ప్రభుత్వానికి బాధ్యత లేదా? రైతులు, కౌలు రైతులు పేదలు అందరూ తీవ్రంగా నష్టపోయారు. ఈ ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన బాధ్యత అందరిపై ఉంది. హుద్ హుద్ తుఫాన్ సమయంలో కేంద్రంతో మాట్లాడి రెండోరోజు ప్రధానిని రప్పించాను. కేంద్రం కొంత సాయం అందించింది. కానీ నేడు ఈ ప్రభుత్వం కనీసం కేంద్ర బృందాన్ని కూడా పిలువలేదు. ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నిస్తే కేసులు పెడతారని మౌనంగా ఉండొద్దు. అధర్మపాలనపై ధర్మంగా పోరాడుదాం. మీరు నాపైన చూపించిన అభిమానాన్ని మర్చిపోను, మీరుణం తీర్చుకుంటా. మీ అందరి సహకారంతో రాష్ట్రాన్ని గాడిలో పెడతానని చంద్రబాబు నాయుడు అన్నారు.