- స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాలకు ఈ-సైకిళ్లు
- ఈవీ కంపెనీలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్
- ఈవీలు, ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుపై సీఎం చంద్రబాబు సమీక్ష
అమరావతి (చైతన్య రథం): ఇంధన పొదుపు కోసం చేపట్టే కార్యాచరణలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేలా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ఉద్యమంగా మార్చేలా ప్రణాళికలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ`సైకిళ్లు, ఈ`వాహనాలను పెద్దఎత్తున ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని సీఎం దిశానిర్దేశం చేశారు. సోమవారం రాష్ట్ర సచివాలయంనుంచి ఈవీ కంపెనీల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడారు. రాష్ట్రంలో స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాలకు ఎలక్ట్రిక్ సైకిళ్లు అందించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. మొత్తం 16 వేల ఎలక్ట్రిక్ సైకిళ్లను ఆ కార్యాలయాల సిబ్బందికి అందించాలని సీఎం నిర్దేశించారు. ఈ`వాహనాలను సులభంగా కొనుగోలు చేసేలా రుణాలను అందించే ప్రయత్నం చేయాలని.. దీనికోసం ప్రత్యేక ఎస్పీవీని ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ఈఎంఐ విధానంలో ఈ`సైకిళ్లను ఇచ్చేలా కార్యాచరణ చేపట్టాలన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలతోపాటు ఛార్జింగ్ స్టేషన్లలాంటి మౌలిక సదుపాయాలనూ ఏర్పాటు చేయాలని సూచించారు. ఛార్జింగ్ స్టేషన్లతోపాటు మౌలికసదుపాయాల కల్పించటంపై ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని సీఎం పేర్కొన్నారు.













