- దివ్యమైన పచ్చదనం.. దైవంతో సమానం
- పవిత్ర పుణ్యక్షేత్రంలో పచ్చదనం విస్తరించాలి
- తిరుమల గిరులపై మరింత దట్టమైన అడవి
- విస్తరణకు ప్రత్యేక ప్రణాళిక అనుసరించండి
- గోవింద నామస్మరణ ఒక్కటే వినిపించాలి
- వీఐపీల సంస్కృతిని పెంచిపోషించొద్దు
- ఆలయ పవిత్రత పరిరక్షణ బాధ్యత అందరిదీ..
- ప్రసాదాలలో శుచి శుభ్రతే నిజమైన ఆధ్యాత్మికత
- అనవసర వ్యయంతో అట్టహాసాలు చేయొద్దు
- ఆధ్మాత్మిక సౌరభాలతో మనసు పులకించాలి
- దేవదేవుడిని చూశామన్న అనుభూతి చాలు..
- టీటీడీకి ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం
అమరావతి (చైతన్య రథం): అత్యంత పవిత్రమైన తిరుమల గిరులపై అటవీ పరిరక్షణ ఒక ఉద్యమంలా సాగాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. గత ప్రభుత్వం ఈ దిశగా దృష్టిపెట్టకపోవడంతో.. తిరుమల గిరులపై పర్యావరణ శోభ మృగ్యమైనట్టుందని చంద్రబాబు అన్నారు. గిరులపై అటవీ ప్రాంతాన్ని 72నుంచి 80శాతంపైగా పెంచాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. అటవీ సంరక్షణతోపాటు విస్తరణ కోసం వచ్చే 5 ఏళ్లకు ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుని పనిచేయాలని ముఖ్యమంత్రి సూచించారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో రెండురోజుల తిరుమల పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబు.. శనివారం పద్మావతీ అతిథి గృహంలో తితిదే అధికారులతో సమావేశమయ్యారు.
దేవాదాయ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, తితిదే ఈవో శ్యామలరావు, అదనపు ఈవో, ఇతర విభాగాల అధికారులతో వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించిన అనంతరం.. దేవాలయ పవిత్రతను కాపాడే విషయంలో స్పష్టమైన ఆదేశాలిచ్చారు. తిరుమల పవిత్రత, నమ్మకం కాపాడేలా ప్రతిఒక్కరూ మసలుకోవాలని, కొండపై గోవింద నామం తప్ప మరో స్మరణ వినిపించకూడదన్నారు. ఆలయ ప్రశాతంతకు ఎక్కడా భంగం వాటిల్లకూడదని, ఏ విషయంలోనూ రాజీ పడొద్దన్నారు. నిత్యం లక్షలాది భక్తులు వెంకన్న దర్శనాలకు వస్తోన్న నేపథ్యంలో.. భవిష్యత్ నీటి అవసరాలకు తగ్గట్లు నీటి లభ్యత ఉండేలా చూసుకోవాలని, అందుకు ముందస్తు ప్రణాళిక అవసరమని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలిచ్చారు. తిరుమల గిరులపై బయో డైవర్సీటీ పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్న చంద్రబాబు, టీటీడీ సేవలపై భక్తులనుంచి స్పందన తీసుకునే విధానంపైనా ఆరాతీశారు. వచ్చిన ప్రతి భక్తుడు తమ అనుభవాలపై అభిప్రాయాలు చెప్పే అవకాశం కల్పించాలని సూచిస్తూనే.. భక్తుల సూచనలు, సలహాల ఆధారంగా సేవలపై తితిదే యంత్రాంగం పనిచేయాలని సూచించారు.
ఒక్క తితిదేలోనే కాకుండా అన్ని దేవాలయాల్లో భక్తుల అభిప్రాయాలు తీసుకునే విధానం తీసుకురావాలని మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డికి సూచించారు. లడ్డూ ప్రసాదం, అన్న ప్రసాదం నాణ్యత పెరిగిందని భక్తులు చెప్తున్నారంటూనే.. ఎల్లప్పుడూ ఇదే మాట వినిపించేలా తితిదే జాగ్రత్తలు తీసుకోవాలని, ఉన్న పరిస్థితులు మరింత మెరుగుపడాలని జాగ్రత్తలు చెప్పారు. ప్రసాదాల తయారీలో వాడే పదార్థాల నాణ్యత బాగుండేలా చూసుకోవాలని చెప్తూనే.. అత్యుత్తమ పదార్థాలు మాత్రమే వాడాలని సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. తిరుమలలో విఐపీ సంస్కృతి తగ్గాలని, ప్రముఖులు వచ్చినప్పుడు హడావుడి కనిపించకూడదన్నారు. సింపుల్‌గా, ఆధ్యాత్మిక ఉట్టిపడేలా అలంకరణ ఉండాలని, ఆర్భాటం, అనవసర వ్యయాలకు పోవద్దని చంద్రబాబు సూచించారు. భక్తులపట్ల గౌరవం, మన్ననతో తితిదే సిబ్బంది వ్యవహరించాలని, దేశ విదేశాలనుంచి వచ్చేవారిని గౌరవించుకోవాలని సూచించారు. దురుసు ప్రవర్తన ఎక్కడా ఉండకూడదంటూనే, భక్తులు సంతృప్తితో, ఆధ్యాత్మిక అనుభూతితో కొండనుంచి తిరిగి వెళ్లేలా తితిదే సిబ్బంది వ్యవహరించాలన్నారు. తిరుమల పేరు తలిస్తే…. ఏడుకొండలవాడి వైభవం, ఆధ్యాత్మికత మాత్రమే గుర్తుకొచ్చేలా ఆలయ ఆవరణను ఆవిష్కరించే బాధ్యత తిరుమల యంత్రాంగానిదేనని చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. స్విమ్స్ సేవలు మెరుగుపర్చాలని అంటూనే… ‘ఇదొక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక క్షేత్రం. తిరుమల పవిత్రత కాపాడడం, ఆధ్యాత్మికత విషయంలో ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించడం అందరి బాధ్యత’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థల సహకారంతో శ్రీవారి సేవ (స్వచ్చంద సేవను ) మరింత బలోపేతం చేయాలని, తద్వారా భక్తులకు సేవకుల ద్వారా చక్కటి సేవలు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాము ఆకాంక్షించారు.