జగన్ పాలనలో విద్యా వ్యవస్థ సర్వనాశనం: మాల్యాద్రి
కమీషన్ల కోసం పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటం
విద్యావ్యవస్థను నిజంగా ఉద్ధరిస్తే మా ప్రశ్నలకు జగన్, సాక్షి మీడియా సమాధానం చెప్పాలి
అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి నాలుగున్నరేళ్ల పాలనలో రాష్ట్రంలో విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసి, కమీషన్ల కోసం పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడి, నాలుగున్నరేళ్లలో ప్రాథమిక విద్య మొదలు కళాశాల విద్య వరకు సర్వనాశనం చేశాడని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి గురజాల మాల్యాద్రి విమర్శించారు. విద్యాసంస్థలను రాజకీయ కార్యకలాపాలకు కేంద్రాలుగా మార్చి, విషపూరిత ప్రసంగాలు చేస్తూ.. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం మాల్యాద్రి విలేకరులతో మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు ఈ నాలుగున్నరేళ్లలో జగన్ చేసిన ద్రోహాన్ని కళ్లకు కట్టినట్టు ప్రజలకు తెలియచేస్తున్న ప్రజా మీడియాపై అక్కసు వెళ్లగక్కినంత మాత్రాన జగన్ రెడ్డి చేసిన దుర్మార్గాలు బయటపడకుండా పోవన్నారు. అల్లూరి జిల్లా చింతపల్లిలో విద్యార్థులకు ట్యాబుల పంపిణీ సభలో విద్యార్థులను ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి రాజకీయ విద్వేష ఉపన్యాసం చేయడం విద్యాసంస్థల్ని దుర్వినియోగం చేయడం కాదా అని ప్రశ్నించారు. రాష్ట్ర విద్యారంగాన్ని జగన్ నిజంగా ఉద్ధరిస్తే మేము లేవనెత్తిన ప్రశ్నలకు జగన్మోహన్ రెడ్డిగానీ.. ఆయన సాక్షి మీడియాగానీ సమాధానం చెప్పగలవా అని గురజాల మాల్యాద్రి నిలదీశారు.
మాల్యాద్రి సంధించిన ప్రశ్నలు:
1 గత ఏడాది కంటే ఈ సంవత్సరం విద్యార్థులకు అందించే ట్యాబుల్లో 25,379 ట్యాబులు కోత పెట్టింది నిజం కాదా?
- బహిరంగ మార్కెట్లో ఒక్కో ట్యాబ్ ధర రూ.11,200లు మాత్రమే ఉంటే, రూ.15,500లకు కొన్నట్టు లెక్కలు చూపించి, గడచిన రెండేళ్లలో రూ.470కోట్లు కమీషన్లు కొట్టేసింది వాస్తవం కాదా?
- నాడు-నేడు పేరుతో, ప్రభుత్వ పాఠశాలలకు రంగులేసే నెపంతో..ఇతర పనులు చేసినట్టు చెప్పి రూ.3వేల కోట్లు కొట్టేసింది నిజం కాదా?
- పాఠశాల ప్రాంగణాల్లో రైతుభరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి, హైకోర్టుతో ప్రభుత్వం మొట్టికాయలు వేయించుకున్నది నిజం కాదా?
- అధికారంలోకి వస్తే ఏటా డీఎస్సీ నిర్వహిస్తానని చెప్పి, ముఖ్యమంత్రి అయ్యాక జగన్ మాట తప్ప లేదా?
- చంద్రబాబునాయుడి ప్రభుత్వం 5 ఏళ్లల్లో 2 డీఎస్సీలు నిర్వహించి 18వేల ఉపాధ్యాయ నియామకాలు పూర్తిచేసింది నిజం కాదా? నాలుగున్నరేళ్లలో జగన్ ఒక్క ఉపాధ్యాయ పోస్టు కూడా భర్తీ చేయంది వాస్తవం కాదా?
- చంద్రబాబు బెస్ట్ అవైలబుల్ స్కూళ్లు ఏర్పాటుచేసి, 2,45,000 మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తే.. జగన్ రెడ్డి ఆ పథకాన్నే రద్దు చేసింది నిజం కాదా?
- ఎయిడెడ్ విద్యాసంస్థల భూముల్ని కొట్టేయడం కోసం, ఆ సంస్థల్నే ఈ ముఖ్యమంత్రి నిర్వీర్యం చేసింది నిజం కాదా?
- ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్నభోజన పథకం రద్దు చేసింది నిజం కాదా?
- ఐదు కొత్త మెడికల్ కాలేజీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు చెందిన 160 వైద్య విద్యసీట్లను ఓపెన్ కేటగిరిగా మార్చి, కోట్ల రూపాయలకు అమ్ముకుంది నిజం కాదా?
- ఫీజు రీయింబర్స్ మెంట్ చంద్రబాబు 16లక్షల మంది విద్యార్థులకు అందిస్తే, దాన్ని 9.86లక్షల మందికి.. అంటే, 6లక్షల మందికి కోత కోసింది నిజం కాదా?
- జీవోనెం-1 ద్వారా గిరిజన ప్రాంతాల్లో పనిచేసే ఎస్టీ ఉపాధ్యాయులకు అన్యాయం చేసింది నిజం కాదా?
- రాష్ట్రంలో 84 లక్షల మంది విద్యార్థులుంటే, కేవలం 44 లక్షల మందికే అమ్మఒడి ఇస్తున్నది నిజం కాదా? ఒక్కొక్కరికి రూ.15వేలు ఇస్తామని, రూ.13వేలకు తగ్గించి, మాటతప్పింది వాస్తవం కాదా?
- చంద్రబాబునాయుడు హయాంలో విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లు.. అసోసియేట్ ప్రొఫెసర్ల నియామకాలు 1385 వరకు చేపడితే, జగన్మోహన్ రెడ్డి నాలుగున్నరేళ్లల్లో ఒక్క నియామకం కూడా చేపట్టకుండా విశ్వవిద్యాలయాలను రాజకీయ కలుషిత కేంద్రాలుగా మార్చింది నిజం కాదా?
- ఉపాధ్యాయ, లెక్చరర్, ప్రొఫెసర్ల పోస్టులు భర్తీ చేయకుండా, ఫీజు రీయింబర్స్ మెంట్ సకాలంలో సరైన రీతిలో ఇవ్వనందున రాష్ట్రంలో విద్యాప్రమాణాలు దిగజారింది నిజం కాదా?
- నీతి అయోగ్ నివేదిక ప్రకారం నాణ్యమైన విద్యలో చంద్రబాబు హయాంలో 3వ స్థానంలో ఉన్న ఏపీ, నేడు 19వ స్థానానికి పడిపోయింది వాస్తవం కాదా?
- 2022-23కి గాను కేంద్రం విడుదల చేసిన ‘ఫౌండేషనల్ లెర్నింగ్ మరియు న్యూమరసీ నివేదిక’ ప్రకారం దేశంలో ఏపీ 29వ స్థానంలోకి దిగజారిందనేది నిజం కాదా?
- కేంద్ర ప్రభుత్వ అధీనంలోని ‘ఆరా’ సంస్థ నివేదిక ప్రకారం 8వ తరగతి విద్యార్థులు 2వ తరగతి లెక్కలు కూడా చేయలేకపోతున్నారని వెల్లడి కాలేదా?
- పదవ తరగతి ఫలితాల్లో ఐదేళ్ల టీడీపీ పాలనలో సరాసరి ఉత్తీర్ణతాశాతం 92.9 శాతముంటే, అది నేడు 66.76శాతానికి దిగజారింది నిజం కాదా?
- ప్రభుత్వ పాఠశాలల నుంచి 7.50లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు తరలిపోయింది నిజం కాదా?
- దాదాపు 60వేల మంది ఇంజనీరింగ్, వగైరా కోర్సుల విద్యార్థులు నాణ్యమైన విద్యకోసం పొరుగు రాష్ట్రాలకు తరలిపోయింది నిజం కాదా?
- చంద్రబాబు ప్రభుత్వం తక్కువ ఖర్చుతో 7,500 పాఠశాలల్లో ఫైబర్ గ్రిడ్ ఏర్పాటు చేయడం వల్లే నేడు డిజిటల్ విద్యకు దోహదపడిరదనేది నిజం కాదా? ఇంగ్లీష్ మీడియాన్ని కూడా మొదట పైలెట్ ప్రాజెక్ట్ గా మున్సిపల్ పాఠశాలల్లో ప్రవేశపెట్టింది చంద్రబాబు ప్రభుత్వం కాదా?23. గురుకుల పాఠశాలలు, బెస్ట్ అవైలబుల్ స్కూళ్లు, 22 మెడికల్ కాలేజీలు 350కి పైగా ఇంజనీరింగ్ కాలేజీలు, 12 కేంద్రీయ విద్యాసంస్థలు స్థాపించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను ఉన్నత స్థానాలకు పంపిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానిది కాదా? అని మాల్యాద్రి అన్నారు.