నర్సీపట్నం(చైతన్యరథం): ప్రజా భాగస్వామ్యంతో గ్రామాల్లో ఉపాధి పనుల నిర్వహణ కోసమే గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా శుక్రవారం నిర్వహించిన గ్రామసభల్లో భాగంగా మాకవరపాలెం పంచాయతీలో నిర్వహించిన సభలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు పాల్గొన్నారు. స్పీకర్ హోదాలో మొదటి సారిగా మాకవరపాలెం వచ్చిన ఆయనకు గ్రామ సర్పంచ్, మహిళలు ఘన స్వాగతం పలికారు. ఆ సభలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, 13,326 పంచాయతీల్లో ఒకే రోజు ప్రారంభమైన గ్రామసభల్లో రికార్డు స్థాయిలో రాష్ట్రవ్యాప్తంగా కోటి మందికిపైగా ప్రజలు పాల్గొన్నారన్నారు. తాను పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నప్పుడు ఈ గ్రామసభల కార్యక్రమాన్ని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారని గుర్తు చేశారు.
కేంద్ర ప్రభుత్వ నిధులతో గ్రామాల అభివృద్ధి జరుగుతుందని, ఈ గ్రామ సభల ద్వారా 87 రకాల పనులను ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టేందుకు అవకాశం లభించిందని చెప్పారు. 54 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పన జరుగుతోందని అయ్యన్న వివరించారు. పంచాయతీ పరిధిలోని వారంతా కూర్చొని గ్రామాభివృద్ధి పై నిర్ణయాలు తీసుకోవడం, ప్రజాస్వామ్య స్ఫూర్తితో, పారదర్శకంగా నిధులు వినియోగించుకోవడం అనే లక్ష్యంతో గ్రామ సభలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రామాల్లో సిసి రోడ్లు, డ్రైనేజీలు, ఇతర అభివృద్ధి పనుల కోసం ఈ నిధులు వినియోగించుకోవాలని సూచించారు. గత ప్రభుత్వంలో పంచాయతీలకు ఎటువంటి నిధులు ఖర్చు చేయలేదని విమర్శించారు. అన్ని గ్రామాల అభివృద్ధికి నిధులు వినియోగించేలా చూడాలని అధికారులకు ఆయన సూచించారు.
సర్పంచ్ అల్లంపల్లి శిరీష మాట్లాడుతూ, గత మూడు సంవత్సరాల కాలంలో జరిగిన గ్రామసభలు వేరు.. ఈ గ్రామ సభ వేరు అన్నారు. మాకవరపాలెం మేజర్ పంచాయతీలో ఇంత ఘనంగా గ్రామసభ జరగడం తమ అదృష్టం అని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో హెచ్.వి. జయరాం, డి.ఎల్.పి.ఓ. ఎస్.ఎస్.ఎన్. మూర్తి, తహసీల్దార్ ప్రసాద్ రావు, ఎంపీడీవో సిహెచ్. సీతామహాలక్ష్మి, ఎక్స్ జెడ్పిటిసి ఉత్తర శేషు కుమార్, ఎంపీటీసీ ఆర్. సర్వేశ్వరరావు, రాచపల్లి ఎంపీటీసీ ఆర్వై పాత్రుడు, వైస్ సర్పంచ్ లాలం రాము, శెట్టిపాలెం సర్పంచ్ అల్లు రామనాయుడు, ఎక్స్ వైస్ ఎంపీపీ ఉబ్బల్రెడ్డి వెంకటరమణ పాల్గొన్నారు.