- ఎద్దులను అరెస్టుచేసి రైతును కొట్టిన పోలీసులు
- పోలీసులతో లోకేష్ వాగ్వావాదం.. ప్రదర్శనగా అసెంబ్లీకి
- పోలీసుల కళ్లుగప్పి ఆసెంబ్లీ ఆవరణకు తెలుగు రైతులు
- పోలీసులపై చర్యలు తీసుకోవాలన్న అచ్చెన్నాయుడు
అమరావతి: అసెంబ్లీ సమీపంలో ఉన్న ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద రైతు ద్రోహి జగన్ అంటూ టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎడ్లబండ్లతో వినూత్న నిరసన చేపట్టారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్, టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నేతృత్వంలో తొలుత ఎద్దుల బండిపై ప్రదర్శనగా అసెంబ్లీకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. తెలుగుదేశం శాసనసభాపక్షం నిరసన ర్యాలీపై పోలీసుల ఆంక్షలు విధించారు.
ఎడ్లబండిని స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఎద్దులను పోలీసులు కొట్టి తరిమేయడంతో పోలీస్ స్టేషన్ నుంచి ఎడ్లబళ్లను టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మెడపై ఉంచుకొని రోడ్డుపైకి వచ్చారు. ఎడ్లకు బదులు ఎమ్మెల్యే, ఏమెల్సిలే కాడె తగిలించుకుని బండిని లాగారు. ఎడ్ల బళ్లపై పోలీసు ప్రతాపం ఏమిటంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎడ్లను అరెస్టు చేయటమేంటంటూ పోలీసులతో నారా లోకేష్ వాగ్వివాదానికి దిగారు. ఎడ్లబండి కాడె మోస్తూ లోకేష్, అచ్చెన్నాయుడు, రామానాయుడు, చినరాజప్ప, ఇతర ఎమ్మెల్యే లు, ఎమ్మె ల్సీలు అసెంబ్లీ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. పోలీసు వలయాన్ని చేధించుకుని అసెంబ్లీ ప్రధాన ద్వారం వరకూ ఎడ్ల బండిని లాక్కుంటూ వెళ్లారు. అసెంబ్లీ సమీపానికి వెళ్లాక గిట్టుబాటు ధర ఎక్కడ జగన్? రైతు దోపిడీ కేంద్రాలుగా మారిన ఆర్బీకేలు, విత్తనాలు, ఎరువులు ఇవ్వలేని చెత్త ప్రభుత్వం, డ్రిప్ ఇరిగేషన్‌ని నిర్వీర్యం చేసిన జగన్ సర్కార్, ధాన్యం బిల్లులు ఎప్పుడు చెల్లిస్తావ్ జగన్, కౌలు రైతులకు భరోసా ఎక్కడ? ఈ క్రాప్ అక్రమాలపై చర్యలేవి? పంట నష్టం.. దక్కని సాయం, రైతు ద్రోహి జగన్, మోటార్లకి మీటర్లు..రైతుల మెడలో ఉరితాళ్లు, దివాలా తీసిన ఆక్వా రంగం, రైతు భరోసా కాదు రైతు దగా, జగన్ పాలనలో క్రాప్ హాలిడే అంటూ నినాదాలు చేస్తూ టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్లకార్డులు చేతబూని నిరసన తెలిపారు. ఒకవైపు ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగుతుండ గానే టిడిపి ఎమ్మెల్యేలు హస్‌లో నిరసన కొనసాగించారు. చివరకు మధ్యాహ్నం 2.30గంటల ప్రాంతంలో ఆందోళన చేస్తున్న టిడిపి సభ్యులను ఒకరోజు పాటు స్పీకర్ సస్పెండ్ చేశారు.
అసెంబ్లీని తాకిన తెలుగురైతు నిరసన
తెలుగురైతు ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ఏపీ అసెంబ్లీని తాకింది. తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి పోలీసు వలయాన్ని ఛేదించుకుని అసెంబ్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, రైతు నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నయి. కొద్దిసేపు అసెంబ్లీ మార్గంలో వాహనాలు నిలిచిపోయాయి. మర్రెడ్డి శ్రీనివాసరెడ్డితోపాటు ఇతర రైతు నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. సచివాలయం సమీపంలోని విద్యుత్ సబ్ స్టేషన్ గోడదూకి ఒక్కసారిగా రైతులు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నంచడంతో పోలీసు నివ్వెరపోయారు. పోలీసులతో తోపులాటలో పలువురు తెలుగు రైతులకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆటోలో విజయవాడలోని ప్రైవేటు ఆస్పత్రికి తెలుగు రైతుల తరలించారు.
అంతా బాగుంటే ఎందుకు పంట విరామం ప్రకటించాల్సి వచ్చింది?
వ్యవసాయంపై చర్చ సమయంలో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్వాకం వల్లే పంట విరామం ప్రకటించాల్సి వచ్చిందని అన్నారు. రైతు భరోసా రూ.15 వేలు ఇస్తామని రూ.7,500 ఇచ్చి మోసం చేశారు, ఈ క్రాప్ బుకింగ్ కోసం కౌలు రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఎరువుల ధరలు ఆకాశాన్ని అంటాయి, మోటార్లకు మీటర్లు పెట్టి ఉచిత విద్యుత్‌కు మంగళం పాడారని అన్నారు. ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ లేదు, ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలతో పాలన చేస్తోందని దుయ్యబట్టారు. రైతుల ఆత్మహత్యల్లో మూడోవ స్థానం, కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండవ స్థానంలో ఏపీ ఉందని తెలిపారు.
పోలీసులపై చర్య తీసుకోవాలి: అచ్చెన్నాయుడు డిమాండ్
టీడీపీ నిరసనకు ఎడ్ల బండి ఇచ్చిన రైతును సీఐ తీవ్రంగా కొట్టారు, రైతుపై చేయిచేసుకున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. తెలుగుదేశం నిరసనకు ఎడ్ల బండి ఇచ్చిన రైతును సీఐ తీవ్రంగా కొట్టారు. రైతులపై పోలీసులు ప్రతాపం చూపడం దారుణమన్నారు. శాసనసభా పక్ష ఉపనాయకుడు నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ..ప్రభుత్వం దుర్మార్గపు చర్యల వల్లే రాష్ట్రంలోని పలుజిల్లాల్లో రైతులు పంట విరామం ప్రకటించాల్సి వచ్చిందని అన్నారు. పార్టీ సీనియర్ శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఉన్న కోటరీ వల్లే రైతాంగానికి తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. 3ఏళ్లుగా వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉంది. మూగజీవాల్ని పోలీసులు తరమటం దుర్మార్గమని అన్నారు. ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు మాట్లాడుతూ..పశువుల పట్ల కూడా ప్రభుత్వానికి కనికరం లేదు.రైతు సమస్యల పట్ల నిరసనను కూడా అడ్డుకోవడం దుర్మార్గమని అన్నారు.