- రెండు తెలుగు రాష్ట్రాలకు అదే శ్రేయోదాయకం
- పరస్పర సహకారంతో అభివద్ధి సాధిద్దాం
- సమస్యలకు సానుకూల చర్చలే సరైన పరిష్కారం
- ఏపీని విధ్వంసం చేసిన భూతం.. త్వరలోనే భూస్థాపితం
- తెదేపాకు యువరక్తం పక్కిస్తా..
- తెలంగాణ గడ్డమీద ఏపీ సీఎం చంద్రబాబు ఉద్ఘాటన
హైదరాబాద్ (చైతన్య రథం): ఉమ్మడి తెలుగు రాష్ట్రం వేరుపడినా.. కలిసి పనిచేస్తేనే లాభదాయకమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఎలాంటి సమస్యలపైనైనా అన్నదమ్ముల్లా పోరాడి ఐకమత్యంగా ఉండాలని ఆకాంక్షించారు. కలిసి పనిచేస్తే రెండు రాష్ట్రాలు లబ్ధిపొందుతాయన్న భావన వ్యక్తం చేశారు. నాల్గవసారి ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారి హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్‌కు వచ్చిన చంద్రబాబు.. నేతలు, పార్టీ శ్రేణులు, అభిమానుల నుంచి అపూర్వ స్వాగతం అందుకున్నారు. చిరస్మరణీయ స్వాగతం పలికిన తెలంగాణను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఆత్మీయులను కలిసి అభినందనలు తెలియజేయాలని వచ్చాను. మీ అభిమానం చూస్తుంటే నాకు మరింత ఉత్సాహం వస్తుందని చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు. టీడీపీ ముందు, తర్వాత తెలుగువారి చరిత్రను పరిశీలించవచ్చన్నారు. ‘1995 ముందూ, తరువాతగా హైదరాబాద్‌ను చూడాలన్నారు. ‘హైటెక్‌సిటీతో హైదరాబాద్‌ను అభివృద్ధి చేశాం. నేడు హైదరాబాద్ దేశంలోనే నెంబర్‌వన్. ఇంతకంటే ఓ నాయకుడికి ఏంతృప్తి ఉంటుంది? ఔటర్‌రింగ్ రోడ్డు పనులు కూడా నాడు నేనే ప్రారంభించా. విమానాశ్రయాన్ని ముందు చూపుతో నిర్మించాం. నాలెడ్జ్ ఎకానమీకి నాంది పలికాం. నేడు నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా హైదరాబాద్ నిలిచింది. తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అభివృద్ధిని కొనసాగించాయి.
ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి కూడా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నారు’ అని చంద్రబాబు వివరించారు. రెండు రాష్ట్రాల మధ్యనున్న సమస్యలు పరిష్కరించుకుందామని తానే రేవంత్‌రెడ్డికి లేఖ రాశానని, వేరుగావున్నా సమస్యలపై ఐకమత్యంగా పోరాడదామని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఏ సమస్య వచ్చినా జాతి ప్రయోజనాలను కాపాడటానికి తాను ముందుంటానని హామీ ఇచ్చారు. ‘విభేదాలు, ఘర్షణల వల్ల నీళ్లు రావు. సమస్యలు పరిస్కారం కావు. అభివృద్ధి ముందుకెళ్లదు. విభేదాల వల్ల లాభంకంటే నష్టమే ఎక్కువ. సానుకూల చర్చల ద్వారానే ఎంతైనా శ్రేయోదాయకం’ అని సూచించారు. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరిస్తే అంతకంటే ఉత్తమం మరొకటి లేదన్నారు. ‘అభివృద్ది రాజధానితో ప్రారంభమైతే రాష్ట్రం నలుమూలకు విస్తరిస్తుంది. విభజన సమయంలో తెలంగాణతో ఏపీలో తలసరి ఆదాయం వ్యత్యాసం 35 శాతముంది. 2014 నుండి 2019 వరకు కష్టపడి 27 శాతానికి తగ్గించాను. తర్వాత వచ్చిన విధ్వంస ప్రభుత్వం వల్ల మళ్లీ 44 శాతానికి పెరిగింది. విభజనతో జరిగిన నష్టంకంటే గత ప్రభుత్వ పాలన వల్లే ఏపీకి ఎక్కువ నష్టం వాటిల్లిందని చంద్రబాబు వివరించారు. దేశంలోనే అత్యంత అధికంగా తలసరి ఆదాయంమున్న రాష్ట్రం తెలంగాణ. ఏపీ ఇబ్బందుల్లో ఉంది. మళ్లీ ఏపీని కూడా గట్టెక్కించే బాధ్యత తీసుకుంటామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. నాడు విజన్ గురించి మాట్లాడితే ఎగతాళి చేశారు… విజన్ 2020 అంటే 420 అని మాట్లాడారు. 2047 నాటికి మన దేశం ప్రపంచంలోనే నెంబర్-1గా ఉంటుంది. వికసిత్ భారత్‌లో నెంబర్‌వన్‌గా తెలంగాణ, ఏపీ ఉంటాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఉద్యోగాలు చేయడం కాదు, ఉద్యోగాలిచ్చే స్థాయికి రావాలని తెలుగు ప్రజలను కోరుతున్నాను. గ్లోబల్ సిటిజన్స్‌గా మన తెలుగుజాతి ఉంటుంది. అన్ని వ్యవస్థల్లో తెలుగుజాతి నెంబర్ వన్‌గా ఉండాలన్నదే నా ఆకాంక్ష అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
పార్టీకి యువరక్తం ఎక్కిస్తా
పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలున్నారు… మళ్లీ యువతను ప్రోత్సహిస్తా. యువరక్తాన్ని ఎక్కిస్తాం. అధికారంలో ఉన్నా… ప్రతిపక్షంలో ఉన్నా ప్రజాపక్షానే ఉంటా. ఎన్టీఆర్ ట్రస్ట్‌ద్వారా పిల్లలకు చదువు, బసవతారకం కేన్సర్ ఆసుపత్రి ద్వారా సేవలందిస్తున్నాం. ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన తప్ప పెత్తనం చేయాలనే ఆలోచన ఎప్పుడూ రాలేదని చంద్రబాబు అన్నారు. ఇప్పుడు వేసే పునాదే మళ్లీ 30 ఏళ్లు పాటు ఉంటుంది. ఏపీలో పవన్ ముందుకువచ్చి వ్యతిరేక ఓటు చీలకూడదని చెప్పారు. నేను జైల్లో ఉన్నప్పుడు వచ్చి పొత్తు ప్రకటించారు. బీజేపీ కూడా ముందుకొచ్చి కలిసి పోటీ చేశాం. యువగళం, నిజం గెలవాలి కార్యక్రమాలు బాగా పనిచేశాయి. తెలంగాణ నుంచి ఎన్నికలముందు 70 రైళ్లలో వచ్చి ఓట్లు వేశారు. చిన్న పనులు చేసుకునే వారు కూడా వచ్చి ఓట్లు వేశారు. ఏ విధంగా వారి రుణం తీర్చుకోవాలో అర్థం కావడం లేదని ఈ సందర్భంగా వారి అభిమానాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.
భూతాన్ని పూర్తిగా భూస్థాపితం చేస్తాం
ఏపీలో సైకో కాదు… ఒక భూతం ఉంది. పెట్టుబడిదారులను ఆహ్వానిస్తే మీపై నమ్మకం ఉంది… కానీ మీ రాష్ట్రంలో ఒక భూతముందని అన్నారు. మీ ప్రజలు ఎప్పుడైనా వేరేవిధంగా ఆలోచిస్తే ఆ భూతం ముందుకు వస్తుందని అంటున్నారు. ఆ భూతాన్ని పూర్తిగా భూస్థాపితం చేసే బాధ్యత తీసుకున్నాం. అర్హతలేని వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుందో గత పాలకులు చూపించారు. ఎటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఉంటే బాగుంటుందో మరోసారి నిరూపించుకోవాల్సిన సమయమిది. ఈరోజే అన్నీ అయిపోవాలని చాలా మంది అనుకుంటున్నారు. ఖజానా ఖాళీ అయిపోయింది.. సమస్యల సుడిగుండంలో ఉన్నాం. అయినా నాకు ధైర్యం ఉంది. సంక్షోభంలో అవకాశాలు వెతుక్కోవడం నాకు అలవాటని సీఎం చంద్రబాబు నాయుడు విశ్వాసం వ్యక్తం చేశారు.