.ఇక సహించేది లేదు…తాడేపేడో తేల్చుకుంటా
.అధైర్యపడొద్దు… అర్థరాత్రయినా అందుబాటులో ఉంటా
.కార్యకర్తల సమావేశంలో చంద్రబాబునాయుడు
కుప్పం: కుప్పం నియోజకవర్గంలో వైసిపి గూండాల చర్యలను ఇకపై సహించబోనని, కార్యకర్తపై పడే ప్రతిదెబ్బా తనపై పడినట్లుగానే భావిస్తానని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. కుప్పంలో అన్నాక్యాంటీన్ ధ్వంసం, కార్యకర్తలపై దాడి, తదనంతర పరిణామాలపై కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చంద్రబాబునాయుడు గురువారం రాత్రి అత్యవసరంగా సమావేశమయ్యారు. కార్యకర్తలెవరూ అధైర్యపడొద్దు.. అర్థరాత్రయినా నేను అందుబాటులోనే ఉంటా.. వైసిపి నేతలతో తాడోపేడో తేల్చుకుంటానని స్పష్టంచేశారు. ఎంతమందిని కొడతారో చూస్తా.. టిడిపి కార్యకర్తలను ఇబ్బందిపెట్టిన ఏ ఒక్కడినీ వదిలిపెట్టబోనని స్పష్టంచేశారు. పోలీసులు, వైసిపి గూండాలు కలిసి కేడర్ పై పెట్టిన తప్పుడు కేసులకు భయపడొద్దు.. తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ మీ తరపున పోరాటం చేస్తుందని భరోసా ఇచ్చారు. వైసిపి మూకల తాటాకు చప్పుళ్లకు భయపడొద్దు.. ధైర్యంగా ముందుకు సాగండి..ఏ కష్టమొచ్చినా మీ వెనుక నేనున్నానన్న విషయం మర్చిపోద్దని చంద్రబాబునాయుడు పేర్కొన్నారు.