అమరావతి(చైతన్యరథం): ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు వ్యవహారంలో సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్‌పై ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. గుంటూరులోని నగరంపాలెం పోలీస్ స్టేషన్లో దాఖలైన ఫిర్యాదుకు సంబంధించిన అభియోగాలపై 15 రోజుల్లో సునీల్ కుమార్ వివరణ ఇవ్వాలంటూ జీఏడీ రాజకీయ కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ మేరకు ప్రభుత్వం జీవో నెం.1695 తీసుకువచ్చింది. అభియోగాలపై వివరణ ఇచ్చే క్రమంలో, ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు తీసుకువచ్చే ప్రయత్నం చేసినా పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. సునీల్ కుమార్ తన వివరణను లిఖితపూర్వకంగా ఇవ్వాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.