- ప్రజా ప్రభుత్వంపై అబద్ధాల సాక్షిలో రోత రాతలు
- పేదల కడుపునింపే అన్న క్యాంటీన్లపై తప్పుడు ప్రచారం
- తల్లికి వందనం, క్యాబినెట్ మీటింగ్‌పైనా నీచ కథనాలు
- అసత్యమేవ జయతే అని క్యాప్షన్ పెడితే బాగుంటుంది
- రాయలసీమకు ఏం చేశారు? అభివృద్ధిపై చర్చకు సిద్ధమా?
- జగన్‌రెడ్డిపై నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ధ్వజం
మంగళగిరి(చైతన్యరథం): ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితమై ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితిలో జగన్‌రెడ్డి ఫేక్ ప్రచారాలే పనిగా పెట్టుకున్నారని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ధ్వజమెత్తారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మీడి యా సమావేశంలో కూటమి ప్రభుత్వం మీద దుష్ప్రచారాలపై మండిపడ్డారు. పేదల ఆకలి తీర్చాలన్న సదుద్దేశంతో అన్న క్యాంటీన్లు పెడితే వాటిపైనా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని తెలంగాణకు అప్పగించామంటూ దుష్ప్రచారాలు, ఇంకా సమీక్ష దశలోనే ఉన్న తల్లికి వందనంపై కూడా ఫేక్ ప్రచారాలు చేయిస్తున్నారని మండిపడ్డారు.
భారతిరెడ్డి సాక్షి పత్రికలోని సత్యమేవ జయతే అనే క్యాప్షన్‌ను అసత్యమేవ జయతేగా మార్చుకుంటే బాగుంటుందేమోనని సలహా ఇచ్చారు. 28న క్యాబినెట్ మీటింగ్ ఉంటుందని 16వ తేదీనే సర్క్యులర్ జారీ చేశాం..కానీ ఎటు వంటి ఆధారాలు లేకుండా క్యాబినెట్ మీటింగ్ కావాలనే వాయిదా వేశారంటూ లోకేష్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. అదే పంధాను కొనసాగిస్తూ టీడీపీ కార్యకర్తలు, నాయకులు, లోకేష్, చంద్రబాబుపై ఫేక్ వార్తలు, ఫేక్ ప్రచారాలు కొన సాగిస్తే ఈసారి 11 సీట్లు కాదు కదా పార్టీనే మూసేసుకుని పరిస్థితి తప్పదని వ్యాఖ్యానించారు.
జగన్‌రెడ్డివి శవ రాజకీయాలు
ప్రజలు మీ ఫేక్ ప్రచారాలు తెలుసుకుంటున్నారు కాబట్టే నంద్యాల, కర్నూలు లాంటి చోట్ల కూడా వైసీపీకి కోలుకోలేని ఫలితాలు వచ్చాయన్నారు. నంద్యాలలో వైసీపీ కార్యకర్తలు గొడవపడి హత్య జరిగితే అది టీడీపీ వాళ్లే చేయించారంటూ ప్రెస్ మీట్లు పెట్టడం సిగ్గుచేటని మండిపడ్డారు. జగన్‌రెడ్డి ఐదేళ్ల పాలనలో ఎన్ని హత్యలు జరిగినా ఏ రోజైనా బయటికొచ్చారా? ఎంతమంది వైసీపీ కార్యకర్తలను ఆదుకున్నారు? ఎంతమంది కార్యకర్తలను పరామర్శించారు? అని ప్రశ్నించారు. హత్యలు చేసిన వారినే తన పక్కన పెట్టుకుని రాష్ట్రంలో శాంతిభద్రతల గురించి మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటు న్నారన్న సంగతి వాళ్లకు అర్థం కావటం లేదన్నారు. జగన్‌రెడ్డి శవ రాజకీయాలకు కేరాఫ్ అని ధ్వజమెత్తారు.
రాయలసీమ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా?
కేంద్ర బడ్జెట్‌లో రాయలసీమకు రైల్వేస్, ఇండస్ట్రియల్ హబ్‌ల ఏర్పాటుకు నిధులు కేటాయించారు..జగన్‌రెడ్డి కూడా అదే రాయలసీమ వ్యక్తే కదా మరి రాయలసీమ అభివృ ద్ధికి ఏం చేశారని ప్రశ్నించారు. ఒక్క పరిశ్రమనైనా రప్పించారా? రాయలసీమలోని నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగమైనా ఇప్పించారా? అని ప్రశ్నించారు. రాయలసీమ అభివృద్ధి గురించి ఆలోచించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క చంద్రబాబు మాత్రమేనని స్పష్టం చేశారు. టీడీపీ హయాంలో మొదలుపెట్టిన ప్రాజెక్టులు జగన్‌రెడ్డి అసమర్ధత వల్ల మధ్యలో ఆగిపోయాయని, రానున్న ఐదేళ్లలో వాటిని ఖచ్చితంగా పూర్తి చేసేందుకు చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారని, తప్పకుండా పూర్తిచేస్తామని స్పష్టం చేశారు.