- క్లెయిమ్‌ల పరిష్కారంపై సీఎం చంద్రబాబు పిలుపు
- మానవతా కోణంలోనూ బాధితులకు సహకారం
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సినంతా చేస్తున్నాయి
- ఇన్స్యూరెన్స్, బ్యాంకులూ అదేవిధమైన సేవలివ్వండి
- సంస్థలపై విశ్వసనీయత పెరిగేలా కృషిచేయాలి
- ఏడు రోజుల్లో క్లెయిమ్‌ల పరిష్కారం పూర్తికావాలి
- చివరి మైలు వరకూ న్యాయం చేయండి..
- ఇన్స్యూరెన్స్, బ్యాంకర్లతో సీఎం చంద్రబాబు సమీక్ష
విజయవాడ (చైతన్య రథం): గతంలో ఎన్నడూ లేనంతగా విజయవాడను వరద ముంచెత్తిన నేపథ్యంలో.. బాధిత ప్రజలకు మానవతాకోణాన్నీ దృష్టిలో పెట్టుకుని క్లెయిముల పరిష్కారంలో సహాయ సహకారాలు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. శుక్రవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశమందిరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన బ్యాంకర్లు, ఇన్స్యూరెన్స్ కంపెనీలతో సమీక్షా సమావేశం నిర్వహంచారు. సమావేశంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, ముఖ్య కార్యదర్శి (ప్లానింగ్) పీయూష్ కుమార్, జిల్లా కలెక్టర్ డా జి సృజన తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో వరద నష్టాల క్లెయిమ్‌ల పరిష్కారం, రుణాల రీషెడ్యూలింగ్, రీ స్ట్రక్చర్, మారటోరియం, కొత్త రుణాల మంజూరు, ఎలక్ట్రానిక్ వస్తువుల మరమ్మతు తదితరాలపై చర్చించారు. సమావేశంలో ఇన్స్యూరెన్స్ కంపెనీలు, బ్యాంకర్లు, ఎలక్ట్రానిక్ వస్తు కంపెనీల ప్రతినిధులు, అర్బన్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘గతంలో ఎన్నడూలేని విధంగా విజయవాడకు వరదముంపు ఎదురైంది.
సంక్షోభ స్థితిలో ఉన్నవారికి మానవతా కోణంలో సహాయ సహకారాలు అందించాల్సిన అవసరముందని చంద్రబాబు సూచించారు. ‘వినూత్న ఆలోచనలతో ప్రజలకు సహాయ సహకారాలు అందించాం. 110కి పైగా ఫైర్ ఇంజిన్లతో గృహాలు, రహదారులను శుభ్రం చేసే కార్యక్రమం నిర్వహించాం. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజల ఆస్తి నష్టాలకు సంబంధించి బీమా క్లెయిమ్‌ల సత్వర పరిష్కారానికి విజయవాడ సబ్‌కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రం ద్వారా న్యాయమైన సెటిల్‌మెంట్స్ జరిగేలా చూడాలి’ అని చంద్రబాబు సూచించారు. ‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సినంతా చేస్తున్నాయి. ఇదేవిధంగా ఇన్స్యూరెన్స్ కంపెనీలు, బ్యాంకులు నిబద్ధతతో వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు సేవలందించాలని పిలుపునిచ్చారు. వాహనాలు, గృహాలు, వ్యాపార వాణిజ్య ఆస్తుల నష్టాలకు సంబంధించి జరిగిన నష్టాలపై వచ్చిన ప్రతి క్లెయిమ్‌నూ సరైనవిధంగా అసెస్ చేసి.. ఆమేరకు పూర్తిస్థాయిలో సెటిల్‌మెంట్ చేయాలి.
మొత్తంమీద పదిరోజుల్లో ప్రక్రియ పూర్తిచేసేందుకు కృషిచేయాలని సూచించారు.
అలాగే.. ప్రజలకు భరోసా కల్పించేలా, సంస్థ విశ్వసనీయత పెరిగేలా బాధిత ప్రజలకు సేవలందించాలన్నారు. మానవతా కోణంలోనూ సాయపడాలన్న దృక్పథంతో పనిచేయాలని, సంక్షోభంలోవున్న ప్రజలను కష్టాల నుంచి గట్టెక్కించేందుకు తమవంతు సహకారం అందించాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. క్లెయిమ్‌ల పరిష్కారంలో వేగంతో పాటు మానవతతో పూర్తిన్యాయం అందించడం ముఖ్యమని అంటూనే.. ఫాస్ట్‌తోపాటు ఫెయిర్‌నెస్ ఉండాలన్నారు. నష్ట గణన మదింపు సరైన విధంగా జరిగేలా చూడాలని సూచించారు. బాధితులు పూర్తిస్థాయిలో సంతృప్తి వ్యక్తం చేసేలా సేవలందించడం ప్రధానమని, సంతృప్తిస్థాయిని తెలుసుకునేందుకు ఎప్పటికప్పుడు ఐవీఆర్‌ఎస్, ఫోన్ కాల్స్ ఇలా వివిధ మార్గాల ద్వారా డేటా తెప్పించుకుంటానని చంద్రబాబు చెప్పారు.
ఏ ఒక్కరికీ అన్యాయం జరగకూడదని అంటూనే… చివరి మైలు వరకూ న్యాయం అందాలన్నారు.సర్వేను వేగవంతం చేయాలని, అవసరమైతే ఫీల్డ్ సర్వేయర్లను పెంచుకోవాలని సూచించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఫోర్స్‌డ్ సెటిల్‌మెంట్స్ జరక్కూడదని సూచిస్తూనే.. ఒకవేళ క్లెయిమ్‌ల పరిష్కారంలో నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రభుత్వపరంగా తగిన చర్యలకు ముందుకెళ్తామని హెచ్చరించారు. ప్రో యాక్టివ్‌గా బ్యాంకులు వరద ప్రభావిత ప్రజలకు సేవలందించాలని ఈ సందర్భంగా చంద్రబాబు పిలుపునిచ్చారు. రుణాల రీషెడ్యూలింగ్, రీస్ట్రక్చర్ వెసులుబాట్లను కచ్చితత్వంతో అమలుచేయాలని, కొల్లేటరల్ సెక్యూరిటీవంటి నిబంధనలు లేకుండా చూడాలన్నారు. వడ్డీ విషయంలో అదనపు భారమనేది లేకుండా చూడాలని చంద్రబాబు సూచించారు. కొత్తగా నీడ్ బేస్డ్ లోన్స్ (అవసరం ఆధారిత రుణాలు)ను బాధితులకు అందించాలని బ్యాంకర్లకు సూచించారు.
ఇక, పాడైన ఎలక్ట్రానిక్ వస్తువుల రిపేర్ల విషయంలో కంపెనీలు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని చంద్రబాబు హితవుపలికారు. 100 శాతం లేబర్ ఛార్జీల్లో, 50 శాతం వరకు స్పేర్‌పార్ట్స్‌లో రాయితీ కల్పిస్తూ సేవలందించాలన్నారు. ఇప్పుడు మీరు స్పందించే తీరే కస్టమర్లలో విశ్వసనీయతను పెంపొందిస్తుందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. మార్కెట్లో బ్రాండ్ నిలబడుతుందన్నారు. అవసరం మేరకు టెక్నీషియన్లను పెంచుకోవాలని, హైదరాబాద్, చెన్నైనుంచి కూడా వనరులను సమీకరించుకోవాలని సూచించారు. కష్టకాలంలో అన్ని మార్గాలద్వారా బాధిత ప్రజలకు అండగా నిలవాల్సిన అవసరముందని, ఈ విషయం గుర్తుంచుకుని మానవతా దృక్ఫథంతో మెలగాలని కోరారు. ఐదు రోజుల్లోగా వచ్చిన ఫిర్యాదులన్నింటినీ పరిష్కరించేలా కంపెనీల సేవా కేంద్రాలు కృషిచేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు.